ఆశావాహులకు రిజర్వేషన్ టెన్షన్!

by Ravi |   (  Updated:2025-01-11 01:00:54  IST  )

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ తన నివేదికను ఖరారు చేసింది.

ఆశావాహులకు రిజర్వేషన్ టెన్షన్!
X

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీ డెడికేటెడ్ కమిషన్ తన నివేదికను ఖరారు చేసింది. రాష్ట్రంలో 56 శాతం మంది బీసీలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. త్వరలో ఈ కమిషన్ సర్కారుకు నివేదికను అందజేయనుండగా.. పార్టీల్లో రిజర్వేషన్లపై టెన్షన్ నెలకొన్నది. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్లకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయని అన్ని పార్టీలకు తెలిసినా.. రిజర్వేషన్లు ఖరారయ్యాకే పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర స్థాయి నాయకులకే కాకుండా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పట్టణ, గ్రామ లీడర్లలోనూ ఒక రకమైన టెన్షన్ నెలకొన్నది. తాము అనుకున్న ప్రకారం రిజర్వేషన్ రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది.

ఇప్పటికే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవీ కాలం ముగిసింది. మరో నెల రోజుల్లోపు 95 శాతం మున్సిపాలిటీలకు సంబంధించి పాలక వర్గాల గడువు ముగియనుంది. అంతేకాకుండా ఒక మండలానికి కనీసం ఐదు ఎంపీటీసీ స్థానాలు కచ్చితంగా ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే చట్ట సవరణ చేసింది. ఈ నేపథ్యంలో ఏ స్థానానికి ఏ రిజర్వేషన్ వస్తుంది? తమకు అనుకూలిస్తుందా? లేదా? అనుకూలించకపోతే ఏం చేయాలి? సతీమణులను, బంధువులను బరిలో దింపాలా? లేక ప్రత్యామ్నాయ మార్గాలను చూపించాలని రాష్ట్రస్థాయి నాయకులను కోరాలా? అనే సందిగ్ధం జిల్లా, నియోజకవర్గ, పట్టణ, గ్రామ నాయకుల్లో నెలకొన్నది.

త్వరలో ముగియనున్న ‘పట్టణ’ టర్మ్

రాష్ట్రవ్యాప్తంగా 14 కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో ఆసిఫాబాద్ మున్సిపాలిటీని కొత్తగా 2024 ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు. దీంతో ఆసిఫాబాద్‌తో పాటు వివిధ కారణాలతో మందమర్రి, మణుగూర్, పాల్వంచ, జహీరాబాద్ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగలేదు. రాష్ట్రవ్యాప్తంగా 8 కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం ఈ జనవరిలోనే ముగియనున్నది. అయితే జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు 2026 ఫిబ్రవరి వరకు, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, అచ్చంపేట, జడ్చర్ల, సిద్దిపేట, కొత్తూరు, నకిరేకల్, మున్సిపాలిటీల పాలక వర్గాల గడువు 2026 మే నెల వరకు ఉన్నది. ఈ నేపథ్యంలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలతోపాటు మున్సిపాలిటీల ఎన్నికలు సైతం నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సమీప గ్రామాల విలీన ప్రక్రియను ప్రభుత్వం చేపడుతున్నది. అందులో భాగంగా వార్డుల విభజనపై సైతం కసరత్తు చేస్తున్నది.

కమిషన్ నివేదిక ఎలా వస్తుందోనని..

సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్ స్థానాలకు పోటీ చేయాలనుకున్న గ్రామ, మండల, పట్టణ లీడర్లకు ఇప్పుడు రిజర్వేషన్ టెన్షన్ పట్టుకున్నది. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఎలా వస్తుందోనని, తాము పోటీ చేయాలనుకున్న స్థానం ఎవరికి రిజర్వ్ అవుతుందోననే ఆందోళన నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి ఒక్కో స్థానానికి నలుగురైదుగురు పోటీ పడుతున్నారు. పలు స్థానాల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేయాలని భావిస్తున్న వారు కూడా చాలా మందే ఉన్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ తమకు అనుకూలంగా ఉంటుందో, లేదోనని తమకు తెలి సిన నాయకులను ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఓటరు జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. ఈ నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వే షన్లతోపాటు అందులో మహిళలకూ రిజర్వేషన్లు కేటాయిస్తే తమ సతీమణులను బరిలోకి దింపేందుకు నేతలు సిద్ధమవుతున్నారు.

రిజర్వేషన్లు తేలాకే పార్టీల ప్లానింగ్..

రిజర్వేషన్లు తేలాకే పట్టణ, గ్రామీణ ఎన్నికలపై పూర్తి స్థాయి ప్రణాళికలు రూపొందించాలని పార్టీలు భావిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఎన్నికలపై కార్యకర్తలు, నాయకులను సిద్ధం చేసేందుకు కార్యక్రమాలు ప్రారంభించాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల పర్యటనను ప్రారంభించారు. స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై దిశా నిర్దేశం చేస్తున్నారు. బీజేపీ కూడా రాష్ట్ర రాజధానిలో సమావేశాలు నిర్వహిస్తూ నాయకులను సమాయత్తం చేస్తున్నది. బీఆర్ఎస్‌లో నియోజకవర్గ, జిల్లా స్థాయి నాయకులు తమ తమ క్యాడర్‌ను సిద్ధం చేస్తున్నారు. అయితే రిజర్వేషన్లు తేలాకే పూర్తిస్థాయిలో ప్రణాళిక రూపొందించవచ్చని, పరిస్థితులకు అనుగుణంగా ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుందని ఆయా పార్టీల రాష్ట్ర స్థాయి నాయకులు చెబుతున్నారు.

-ఫిరోజ్ ఖాన్,

96404 66464

Next Story