రిజర్వేషన్‌ల రాజకీయం vs రాజ్యాంగం.. శాశ్వత పరిష్కారం ఏంటి?

by Ravi |   (  Updated:2025-10-13 01:15:33  IST  )

ప్రజాస్వామ్యంలో రిజర్వేషన్లు కేవలం రాజకీయ సాధనాలు కావు, అవి సామాజిక న్యాయానికి ఒక నిలువుటద్దం. తెలంగాణ హైకోర్టు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీలకు) 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ

రిజర్వేషన్‌ల రాజకీయం vs రాజ్యాంగం.. శాశ్వత పరిష్కారం ఏంటి?
X

ప్రజాస్వామ్యంలో రిజర్వేషన్లు కేవలం రాజకీయ సాధనాలు కావు, అవి సామాజిక న్యాయానికి ఒక నిలువుటద్దం. తెలంగాణ హైకోర్టు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీలకు) 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో- 9పై స్టే విధించింది. జీవో MS నెం. 41, 42 అసంబద్ధమైనవి, రాజ్యాంగ విరుద్ధమైనవిగా పరిగణించబడినాయి.

రాజ్యాంగమే సర్వోన్నతమైనది కావున, ఏ కార్యనిర్వాహక ఉత్తర్వు అయినా రాజ్యాంగ సూత్రాలను అతిక్రమిస్తే, న్యాయవ్యవస్థ దానిని రద్దు చేసే అధికారం కలిగి ఉంటుంది. ఈ రిజర్వేషన్ల ప్రక్రియ దేశవ్యాప్తంగా ఒక సంక్లిష్టమైన అధ్యాయంగా మారింది.

సుప్రీం తీర్పులే.. వివాదాలకు కారణం

భారత రాజ్యాంగంలోని 73, 74వ సవరణలు స్థానిక స్వపరిపాలన సంస్థలకు రాజ్యాంగబద్ధతను కల్పించాయి. ఈ సవరణల ప్రకారం, ఆర్టి కల్ 243 D (గ్రామీణ సంస్థలు), ఆర్టికల్ 243 T (పట్టణ సంస్థలు) షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), మహిళలకు రిజర్వేషన్లు తప్పనిసరి చేశాయి. అదే సమయంలో, వెనుకబడిన తరగతులకు (బీసీలకు) రిజర్వేషన్లు కల్పిం చే అధికారాన్ని రాష్ట్ర శాసనసభలకు అప్పగించాయి. అయితే, ఈ రిజర్వేషన్ల అమలు విషయం లో చాలా రాష్ట్రాలు న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం, రిజర్వేషన్ల పరిమితిపై సుప్రీంకోర్టు ఇచ్చిన వివిధ తీర్పులే. బీసీల రాజకీయ సాధికారతకు రిజర్వేషన్లు ఎంతో అవసరం.

న్యాయపరమైన సవాళ్లు.. తీర్పులు

1980లో మండల్ కమిషన్‌తో కేంద్ర ప్రభు త్వ ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసిన ఈ నివేదిక, బీసీ రాజకీయాలకు ఒక కొత్త శకాన్ని ప్రారంభించింది. ముఖ్యం గా, 'ఎం.ఆర్. బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూ ర్' కేసులో రిజర్వేషన్లు ఏ కారణం చేత కూడా 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ఆధారంగానే 'ఇందిరా సా హ్నీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా' కేసులో రిజర్వేషన్ల పరిమితిపై సుప్రీం స్పష్టతనిచ్చింది. మొత్తం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఈ మూడు అడ్డంకుల వల్లే..

ఈ తీర్పు ప్రధానంగా విద్యా, ఉద్యోగ రంగాలకు సంబంధించింది. దీనికి అదనంగా, 'కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా' కేసుతో స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు 'త్రిశూల పరీక్ష' (Triple Test) విధానాన్ని తీసుకొచ్చింది. ఈ త్రిశూల పరీక్ష ప్రకారం, బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటే మూడు షరతులను తప్పనిసరిగా పాటించాలి. అవి రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల స్థితిగతులపై ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసి, వారి రాజకీయ వెనుకబాటుతనంపై శాస్త్రీయ, వాస్తవిక డేటాను సేకరించాడం రెండు ఈ డేటా ఆధారంగా రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడం, మూడు ఈ రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీలతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చూసుకోవడం. ఈ మూడు షరతులు పాటించకుండా బీసీ రిజర్వేషన్లు కల్పించడం న్యాయస్థానాల్లో నిలబడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నిబంధనలే నేడు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అతిపెద్ద సవాలుగా నిలిచాయి.

ఏక వ్యక్తి కమిషన్ నివేదిక

రాజకీయంగా ఈ సమస్యను పరిష్కరించడానికి, సుప్రీంకోర్టు నిర్దేశించిన 'త్రిశూల పరీక్ష'ను దృష్టిలో ఉంచుకొని, తెలంగాణ ప్రభుత్వం శ్రీ బూసాని వెంకటేశ్వరరావు, ఐ.ఎ.ఎస్. (రిటైర్డ్) చైర్మన్ గా ఏక వ్యక్తి కమిషన్ మార్చి 2025లో తన నివేదికను సమర్పించింది. తమ విశ్లేషణలో, కమిషన్, విద్య, ఉద్యోగాల్లో, ముఖ్యంగా స్థానిక సంస్థలలో రాజకీయ ప్రాతినిధ్యం కోసం బీసీలకు కనీసం 42 శాతం రిజర్వేషన్లు ఉండాలని సిఫార్సు చేసింది. ఈ రిజర్వేషన్లను అమలు చేయడానికి విద్య, ఉద్యోగాలకు రెండు వేర్వేరు చట్టాలను రూపొందించాలని కూడా కమిషన్ సిఫార్సు చేసింది.

బిల్లు పెండింగ్‌లో ఉండాగానే.. జీవో తెచ్చి

న్యాయపరమైన అడ్డంకులు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో, తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు ఒక నిరంతర రాజకీయ, చట్టపరమైన పోరాటంగా మారింది. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయంలో భాగంగా, తెలంగాణ శాసనసభలో తెలంగాణ మున్సిపాలిటీలు (మూడవ సవరణ) బిల్లు, 2025, తెలంగాణ పంచాయతీ రాజ్ (మూడవ సవరణ) చట్టం, 2025లను ఆమోదించింది. విచిత్రమేమిటంటే, గతంలో ఇదే అంశంపై రెండు బిల్లులు, ఒక ఆర్డినెన్స్ రాష్ట్రపతి ఆమోదం కోసం వేచి చూస్తున్న సమయంలో ఈ బిల్లులను శాసనసభలో ఆమోదించారు. ఇది గవర్నర్ వద్ద ఉండగానే జీవో -9 ద్వారా రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కోటాను అమలు చేసే ప్రయత్నం విఫలం అయింది. ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్‌పై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఈ 42 శాతం రిజర్వేషన్లలోని 17 శాతం వాటాను సాధారణ కేటగిరీ (జనరల్ కేటగిరీ) కింద పరిగణించి ఎన్నికలను నిర్వహించుకోవచ్చునని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

భవిష్యత్తు మార్గం.. సవాళ్లు

ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం రాజ్యాంగ సవరణ మాత్రమే. ప్రస్తుతం స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలంటే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాలి. విద్య, ఉద్యోగ రంగాల్లో తమిళనాడు రాష్ట్రం ఇదే మార్గాన్ని అనుసరించి, 69 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, ప్రజాకాంక్షల మధ్య నెలకొన్న సంక్లిష్ట పోరాటంలో చివరి విజయం ఎవరిదనేది కాలమే నిర్ణయించాలి.

-డా.కట్కూరి

సైబర్ సెక్యూరిటీ న్యాయ నిపుణుడు

Next Story