మట్టిమనుషుల పోరులో నేలకొరిగిన ఠాను నాయక్

by Disha edit |
మట్టిమనుషుల పోరులో నేలకొరిగిన ఠాను నాయక్
X

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దేశంలోనే సువర్ణ అక్షరాలతో రాసిన ఘట్టం. అది వెట్టిచాకిరికి, భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా సమాన హక్కుల కోసం, దున్నేవాడికి భూమికోసం జరిగిన మహత్తరమైన పోరాటం. ఈ పోరాటం 4 వేల మంది ప్రాణాల బలిదానంతో, 3వేల గ్రామాలకు స్వరాజ్యం, 12 లక్షల ఎకరాలు భూమి పంచిపెట్టింది.

ప్రజలను కదిలించిన కుటుంబం..

ఆనాడు నల్లగొండ జిల్లా జనగామ తాలూకా ధర్మపురం తండా లంబాడీలకు చెందిన 80 ఎకరాల మెట్ట భూమి 25 ఎకరాల మాగాణి భూమిపై పుసుకూరు రాఘవరావు జమీందారు కన్ను వేసి స్వాధీనం చేసుకోచూసినారు. సంఘం నాయకత్వాన ఆంధ్ర మహాసభను గెలుచుకొని లంబాడీలు ఏకమై ప్రతిఘటించారు. పంటలను కాపాడుకోవడం కోసం పిట్టలపై రాళ్లు రావడానికి ఉపయోగించే వడిసెలను చేతబట్టి గుండాలను ఎదుర్కొన్నారు. తమ పొలాలలో ఎర్రజెండాను నాటి పొలం చుట్టూ కాపలా కాశారు. లంబాడీలకు సంఘం అండతో భూస్వామి వాళ్లను లొంగదీసుకోలేకపోయాడు.

జనగాం తాలూకాలో ఆంధ్ర మహాసభను విస్తరింపచేయాలని 11వ మహాసభ నిర్ణయించినప్పుడు మొట్టమొదట ఠాను నాయక్ కుటుంబం తోడ్పాటు ఇచ్చింది. దేశ్‌ముఖ్ ఆగడాలకు వ్యతిరేకంగా లంబాడీలు తీవ్రంగా ప్రతిఘటన చేశారు. మొక్కవోని దీక్షతో నిలిచిన ప్రజా ఉద్యమాలకు పెట్టని కోటలాగా ఉండేది. ఠాను నాయక్ కుటుంబాన్ని తలచుకుంటే చాలు శత్రువుకు గంగ వెర్రులెత్తేది. లంబాడీలను సర్వనాశనం చేయాలని శత్రువు ఎన్నోసార్లు ప్రయత్నించాడు. స్థానిక నాయకుడు మోహన్ రెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో ఉంచినప్పుడు పోలీస్ తుపాకులను కూడా లెక్కచేయకుండా పోలీసుల వద్దకు వెళ్లి నిలదీసింది ఈ కుటుంబమే. 300 మంది మిలటరీ వీరి గ్రామంపై దాడి చేయవచ్చినప్పుడు గ్రామ ప్రజలందరినీ కదిలించి వడిశెలతో మూడు గంటల పాటు సైన్యాన్ని అడుగు ముందు వేయకుండా నిలదీసింది, శత్రువు ఓర్పును పరీక్షకు పెట్టింది ఈ కుటుంబమే!

పేదల రాజ్యం వర్థిల్లాలంటూ..

కమ్యూనిస్టు పార్టీ కోసం పనిచేస్తున్న కుటుంబంలోని యువకులను వెంటాడి అంతం చేయాలని పోలీసులు గుండాలు ఎంతో ప్రయత్నం చేశారు. చివరకు ఠాను నాయక్ మూడో అన్న శంకరు దొరికాడు. పలు చిత్రహింసలకు గురిచేసి జైల్లో పెట్టి చాలా కాలం తర్వాత విడుదల చేశారు. 1947 భువనగిరిలో పల్లేరుల గ్రామంలో పెద్దవాడైన జోద్య నాయక్ దొరికాడు. అతడిని జైలుకు పంపి నానా బాధలు పెట్టారు. రజాకార్లు వారి ఇంటిని రెండుసార్లు తగలబెట్టారు. వారి వ్యవసాయం సాగనివ్వలేదు. ఠాను నాయక్ రెండో అన్న సోమ్లను పట్టుకున్నారు. సోమ్లా చేతనే కట్టెలు చేర్పించి చితిమంట పేర్చి సజీవంగా సోమ్లను దహనం చేశారు. ఈ దెబ్బతో లంబాడి కుటుంబం కాళ్లబేరానికి వస్తుందని ఆశించిన శత్రువు ఆశలు అడియాశలు అయ్యాయి. మళ్ళీ వారి ఇంటిపై దాడి చేసి ఇద్దరు పసిపిల్లలను చంపేసింది అందువల్ల కూడా ఈ కుటుంబానికి పార్టీ ఎడల విశ్వాసం, ప్రేమ రవ్వంత కూడా చెక్కుచెదరలేదు. దళాలకు రక్షణ ఇవ్వడంలోనూ, తోడ్పాటు నివటంలోనూ వెనుకంజ వేయలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని కంటికి రెప్పలాగా కన్నబిడ్డ లాగా చూసుకున్నారు. ఠాను నాయక్ తమ్ముడు దర్గ్య నాయక్ ఉద్యమంలోకి వచ్చి దళసభ్యుడై అచిర కాలంలోనే దళా కమాండరై ప్రజలకు ప్రేమపాత్రుడైనాడు 1949 ఫిబ్రవరి 26న దర్గ్య నాయక్‌ను చిత్రహింసలు పెట్టి అరెస్టు చేసి మరణ దండన విధించారు. పెద్దన్న జోద్య కుమారుడు కిషన్‌ను జైల్లో పెట్టారు.

భారత సైన్యాలు ప్రవేశించిన క్షణం నుండి ఠాను నాయక్‌ను సజీవంగా పట్టుకునేందుకు సైన్యం ప్రయత్నిస్తూనే ఉంది. సంవత్సరం వరకు అతడు శత్రువులకు చిక్కలేదు. చివరకు ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం వల్ల 1950 మార్చి 20న ముండ్రాయి గ్రామంలో ఠాను నాయక్ శత్రువుల చేతిలో చిక్కాడు. పెట్టని చిత్రహింస లేదు. ఎన్ని బాధలు పెట్టినా ఒక్క పార్టీ రహస్యం కూడా బయట పెట్టలేదు. భారత సైన్యాధికారులకు కూడా ఠాను నాయక్‌ని చంపడానికి నిరాకరించారు. కానీ రామవరం దేశ్‌ముఖ్ కటారు నరసింగరావు అతన్ని బండికి కట్టించి చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారు. ఠాను నాయక్ వీరమరణం పొందుతూ కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి. ఎర్రజెండా జిందాబాద్. పేదల రాజ్యం వర్ధిల్లాలి అంటూ నినదించారు. ఠానునాయక్‌ వీరస్మృతికి జోహార్లు.

(మార్చి 20న ఠాను నాయక్ 73వ వర్ధంతి)

మూడ్. ధర్మ నాయక్

రాష్ట్ర అధ్యక్షులు గిరిజన సంఘం

9490098685Next Story