ఉపకారానికి నిలువుటద్దం కృష్ణ

by Ravi |   (  Updated:2025-05-31 00:45:49  IST  )

తన అభిమానులను ఎంతగానో ప్రేమించే వీరాభిమాని స్వర్గీయ ఘట్టమనేని కృష్ణ. ఆయన సరళ స్వభావి. ఉపకారానికి ఆయన నిలువుటద్దం.

ఉపకారానికి నిలువుటద్దం కృష్ణ
X

తన అభిమానులను ఎంతగానో ప్రేమించే వీరాభిమాని స్వర్గీయ ఘట్టమనేని కృష్ణ. ఆయన సరళ స్వభావి. ఉపకారానికి ఆయన నిలువుటద్దం. నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ రోజున స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణకు నాకు మధ్య ఉన్న ఆత్మీయానుబంధం అనిర్వచనీయమైనది. కృష్ణ హీరోగా నేను నిర్మాతగా వీరపనేని రమణ కుమార్ సమర్పణలో శ్రీ ప్రొడక్షన్స్ “బొబ్బిలి దొర” సినిమా తీయడం నా జీవితంలో మరపురాని సంఘటనగా నిలిచిపోయింది. పేపర్ ఏజెంటుగా జీవనయానం ప్రారంభించి మిమిక్రీ ఆర్టిస్టుగా, రంగస్థల నటుడిగా, దూరదర్శన్‌లో ఎపి సోడ్ నిర్మాతగా ఎదిగాను.

యాధృచ్ఛిక పరిచయం

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఛాలెంజ్' సినిమా చూసి అందులోని హీరో పాత్ర చూసి చలించి పోయాను. ఆ క్షణంలోనే జీవితంలో ఏదైనా సాధించాలన్న పట్టుదల కలిగింది. సినీ నిర్మాతగా స్థిరపడాలని నిశ్చయించుకున్నాను. “1990లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ ఎన్టీ రామారావు ఎన్నికల ప్రచారం సందర్భంగా “చైతన్య రథయాత్ర” హైదరాబాద్ నుంచి ప్రారంభించారు. ఆ యాత్రలో జూనియర్ వేణుమాధవ్‌తో కలిసి మిమిక్రీ ప్రోగ్రాం చేశాను. ఆ సమయంలోనే కొందరు సినీ ప్రముఖులతో పరిచయం కలిగింది. వారిలో ప్రముఖ నిర్మాత స్వర్గీయ డి. రామానాయుడు సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్‌లో కో-డైరెక్టర్‌గా పనిచేస్తున్న బోయపాటి కామేశ్వర్ రావుతో పరిచయం అయ్యింది. ఆయన సూపర్ స్టార్ దగ్గరకు నన్ను తీసుకెళ్లి పరిచయం చేశారు.

అడగ్గానే కాల్షీట్ ఇచ్చారు..

నేను అడిగిన వెంటనే అంతటి ప్రసిద్ధ హీరో కాల్షిట్ ఇవ్వడం, “బొబ్బిలిదొర” టైటిల్‌కి ఓకే చెప్పడం, కృష్ణ హీరోగా షూటింగ్ ప్రారంభం కావడం వెనువెంటనే జరిగిపోయింది. నేను నిర్మాతగా, బోయపాటి కామే శ్వర్ రావు దర్శకత్వంలో నిర్మించిన ‘బొబ్బిలిదొర’లో స్వర్గీయ కృష్ణ, శ్రీమతి విజయనిర్మల హీరో హీరోయిన్లుగా నటించారు. నాతో పాటు పాతూరి భవాని, సి.హెచ్. వినోద్ కుమార్, కంటిపూడి పద్మావతి నలుగురం కలిసి బొబ్బిలి దొర సినిమా నిర్మించాం. ముందుగా 1997లో సంక్రాంతికి సిని మా రిలీజ్ చేయాలనుకున్నాం. అప్పట్లో థియేటర్ల కొరత వల్ల ఒక నెల ఆలస్యంగా ఫిబ్రవరి 14న విడు దల చేశాం. కానీ సినిమా ఫ్లాప్ కావడం బాధించింది. ఆర్థికంగా కూడా దెబ్బతిన్నాను. అయినా సూపర్ స్టార్ స్వర్గీయ కృష్ణతో సినిమా తీశానన్న సంతృప్తి మిగి లింది.

సామాజిక సేవలోనూ ఆదర్శం

అనంతరం సినిమా రంగానికి గుడ్‌బై చెప్పి సామాజిక సేవలో పయనిస్తున్నాను. మెగాస్టార్ చిరంజీవి 'స్టాలిన్' సినిమా చూసి స్ఫూర్తి పొంది రెండు వందల మంది ఆర్థికంగా స్థిరపడి ఆర్థికంగా తలెత్తుకుని జీవించేలా సహాయ సహకారాలు అందించాను. నా దగ్గరకు సహాయం కోరి వచ్చిన వారికి కాదనకుండా, లేదనకుండా ధన సహాయం, మాట, శ్రమ, సహాయం చేసి ఆదుకున్నాను. సామాజిక సేవను చేస్తూ ఇప్పుడు కూడా ఎలసి, మార్గదర్శి, కపిల్ చిట్ ఫండ్ ఏజెంటుగా జీవిత కాలం కొనసాగుతున్నాను. స్వర్గీయ ఘట్టమనేని కృష్ణ జయంతి సందర్భంగా ఆ మహానుభావునికి ఘన నివాళి.

(నేడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి)

యామినీ మధుసూధన్

'బొబ్బిలి దొర' చిత్ర నిర్మాత

90000 09096

Next Story