- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బహుజనుల ధీరుడు.. సర్వాయి పాపన్న గౌడ్
పీడితులు, బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన సామాన్యుడు, గొప్ప బహుజన విప్లవకారుడు

పీడితులు, బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన సామాన్యుడు, గొప్ప బహుజన విప్లవకారుడు, కుల, మత, జాతి వర్గ విభేదాలు లేని సమాజం కోసం దాదాపు 350 ఏండ్ల కిందనే కృషి చేసిన బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆధిపత్య అగ్రకుల పాలకులు... బహుజనులను అణగదొక్కుతున్న 17వ శతాబ్దంలోనే స్వీయ సైన్యంతో దక్కన్‌పై బహుజనుల సంక్షేమ బాధ్యత తీసుకొని తొలి బహుజన రాజ్య స్థాపన చేసిన గొప్ప వీరుడు తొలి బహుజన రాజు.
శివాజీ సమకాలికుడిగా..
మహాత్మా జ్యోతిరావు ఫూలే కంటే ముందే సామాజిక న్యాయం అమలు చేసిన గొప్ప సామాజిక విప్లవకారుడు. రాచరికపు వ్యవస్థ నీడలో అగ్రకులాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, జమీందార్లు, జాగీర్దాల అరాచకాలను సహించలేక కడుపు మండి కత్తి పట్టిన వీరుడు. ఛత్రపతి శివాజీ ఉత్తర భారతంలో విదేశీయుల నుంచి దేశాన్ని స్వరాజ్యాన్ని సాధిస్తున్న సమయంలో, దక్షిణాదిన భూస్వామ్య, దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటు చేసి తెలంగాణ గడ్డపై దళిత, బహుజన, మైనార్టీలతో కలిసి ప్రజారాజ్యాన్ని నిర్మించిన వాడు పాపన్న. అందుకే మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ సమకాలికుడిగా పాపన్నను చెబుతారు. వరంగల్ జిల్లా ఖిలాషాపూర్ నుంచి.. కాకతీయుల పాలన ముగిసిన 300 ఏండ్ల తర్వాత సర్దార్ సర్వాయి పాపన్న ప్రస్థానం ఉంది.
గోల్కొండ కోటకు రాజుగా..
1650 ఆగస్ట్ 18న వరంగల్‌లోని ఖిలాషాపూర్ గ్రామంలో పుట్టిన పాపన్న యుక్త వయసులోనే భూస్వాములు, దేశముఖ్‌ల దాష్టీకాలను సహించలేక, మూఢ సాంప్రదాయాలను ఎదిరించి పోరుబాట పట్టాడు. అగ్ర కులపెత్తనాన్ని అణచాలని బహుజన కులాలను ఏకం చేసి గెరిల్లా సైన్యాన్ని తయారు చేసుకొని జమీందారుల ఆస్తులను కొల్లగొట్టి పేద ప్రజలకు పంచిపెట్టాడు. తన సైన్యం ద్వారా చిన్న చిన్న సంస్థానాలను ఆక్రమించుకుంటూ, తన సొంత ఊరు ఖిలాషాపూర్‌ను రాజధానిగా చేసుకుని, 1675లో సర్వాయిపేట కేంద్రంగా తన రాజ్యాన్ని స్థాపించాడు. ఆ తర్వాత ఎన్నో ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఔరంగజేబు మరణానంతరం మొఘల్ రాజు బహదూర్ షా పాపన్నను స్వయం పాలకునిగా సంధికి ఆహ్వానించి కొంత కప్పం చెల్లించి గోల్కొండ కోటకు రాజుగా కొనసాగవచ్చని బహదూర్ షా ప్రతిపాదన చేశాడు. దానికి అంగీకరించిన పాపన్న, మొఘల్ గోల్కొండ కోటపై బహుజనుల జెండాను ఎగురవేశాడు. అయితే ఇది నచ్చని జమీందార్లు, దేశముఖ్‌లు, జాగీర్దార్లు పాపన్న పరిపాలనలో తాము కొనసాగలేమని, ఆయనను పదవి నుంచి తప్పించాలని బహదూర్ షాను వేడుకోవడంతో పాపన్నను బంధించి తేవాలని ఆయన సైన్యాన్ని ఆదేశించారు. మొఘల్ సైన్యం పెద్ద ఎత్తున పాపన్నపై మూకుమ్మడిగా దాడికి దిగగా, పాపన్న తీవ్రంగా గాయపడి కొన్నిరోజుల ఆజ్ఞాత జీవితం గడిపారు. ఆయన మరణంపై వివిధ కథలు ప్రచారంలో ఉన్నా ఆయన ఒక యోధుడిగా తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు.
సర్వాయి పేటలో పాపన్న గౌడ నిర్మించిన కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి 4.5 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. పాపన్న తవ్వించిన ఎల్లమ్మ చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తుంది. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. పాపన్న గౌడ్ స్పూర్తి నేటి యువతకు ఆదర్శంగా ఉండేలా ట్యాంక్ బండ్‌పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో శంకుస్థాపన చేసుకుంటున్నాం. గ్రామ గ్రామాన ఆయన విగ్రహాలు ఏర్పాటు చేసి ఆయన చరిత్ర భవిష్యత్ సమాజానికి తెలిసేలా ప్రభుత్వం కృషి చేస్తుంది.
(18న సర్వాయి పాపన్న గౌడ్ జయంతి)
-నాగరాజు
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పీఆర్‌ఓ






