- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బహుముఖ ప్రజ్ఞాశాలి బియ్యాల జనార్ధన్ రావు
ఆదివాసుల భూ హక్కుల కోసం నిరంతర తపన, వారి బాధలు, గాథాలను తన వ్యాసాల ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేసిన రచయిత

ఆదివాసుల భూ హక్కుల కోసం నిరంతర తపన, వారి బాధలు, గాథాలను తన వ్యాసాల ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేసిన రచయిత, దోపిడీకి గురవుతున్న తెలంగాణ ప్రజల కష్టాలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వల్లే పరిష్కారం అవుతుందని అనేక వేదికల ద్వారా ఉప న్యాసాలు ఇచ్చిన వక్త. కరువుతో అల్లాడుతున్న రైతుల కన్నీళ్లను ప్రభుత్వానికి వివరించిన రైతు పక్షపాతి, నక్స లైట్లతో శాంతి చర్చలు జరపాలని శాంతి కోసం ఆరాట పడిన వ్యక్తి. ఇలా అనేక విషయాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి సమాజంలో ఒక ప్రత్యేకతను చాటుకున్న శక్తి డాక్టర్ బియ్యాల జనార్దన్ రావు. ఈయన 1955 అక్టోబర్ 12న మహబూబాబాద్ జిల్లాలో జన్మించారు.. చదువు పూర్తయ్యాక కేయూలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పార్ట్ టైం అధ్యాపకుడిగా పని చేసి, అనంతరం ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించాడు. ఆదివాసుల భూమిపై అక్కడి గిరిజనేతరులు పెత్తనంపై ఆయన మండిపడ్డాడు. వారి పక్షాన అనేక వ్యాసాలు రాసి వారి బాధలను బాహ్య ప్రపంచానికి తెలియజేశాడు. వారి కోసం 1/70 చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు.. 'గిరిజన భూముల పరాయికరణ' అనే అంశంపై 1985లో బియ్యాల పరి శోధన చేసి పీహెచ్‌డీ పట్టాపొందిన తొలి గిరిజనేతర వ్యక్తిగా నిలిచాడు. పౌరహక్కుల ఉద్యమంలో సైతం ఆయన పాల్గొన్నాడు. 1982లో వరంగల్‌లో కరువుపై పరిశీలన బృందంలో ఈయన ఒకరు.. 1993 ప్రాంతంలో ఆదివాసీ ఉద్యమాలు, ఏజెన్సీ ప్రాంత సమస్యలపై అనేక వ్యాసాలు రాశాడు. 1999లో కన్నబిరాన్, ఎస్.ఆర్.శంకరన్ తదితరులతో కలిసి నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలనే ఎజెండాను తీసుకొచ్చారు. మలిదశ తెలంగాణ ఉద్య మంలో ఆయన చురుకైన పాత్ర పోషించాడు. తెలంగాణకు జరుగుచున్న అన్యాయాన్ని, అక్రమాల్ని, వివక్షపై ఆయన అనేక వేదికలపై గళమెత్తాడు.. 2001లో టీఆర్ఎస్ ఏర్పాటులో సైతం క్రియాశీలక పాత్ర పోషించాడు. ఈయన 2002లో కన్నుమూశాడు. ఆయన భౌతికంగా లేకున్న ఆయన రచనలు ఆదివాసుల్లో చైతన్యాన్ని నింపుతూనే ఉంటాయి..
(నేడు బియ్యాల జనార్ధన్ రావు వర్ధంతి)
-తాళ్లపెల్లి సురేందర్
94407 15635






