- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గద్దర్.. ఓ యుద్ధగీతం
కత్తుల వంతెన మీద కవాతు చేసి నోరులేని పీడిత, వంచిత వర్గాల గొంతుకగా నిలిచారు ప్రజా యుద్ధనౌక గద్దర్. పాటను అస్త్రంగా

కత్తుల వంతెన మీద కవాతు చేసి నోరులేని పీడిత, వంచిత వర్గాల గొంతుకగా నిలిచారు ప్రజా యుద్ధనౌక గద్దర్. పాటను అస్త్రంగా సంధించి ప్రజా ఉద్యమాల్లో సాంస్కృతిక విప్లవం సృష్టించారాయన. పాల్ రాబ్సన్, బాబ్ మార్లీ తరహాలో తెలుగు నేలలో అట్టడుగు ప్రజానీకానికి చైతన్యం, తిరుగుబాటును నేర్పారు. సామాజిక ఉద్యమం, విప్లవోద్యమం, దళితోద్యమం, ఆ తర్వాత మలి తెలంగాణ ఉద్యమంలోనూ తన అగ్గిగళంతో యుద్ధం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పాటతో పాటు తూటాను మోసిన చరిత్ర ఒక్క గద్దర్‌కే దక్కింది. ఒక్క మాటలో చెప్పాలంటే త్యాగం, పోరాటానికి నిలువెత్తు రూపం ఆయన.
అసమానతల సమాజంలో గద్దర్ తన జననం నుండి మరణం వరకు అసామాన్య పోరాటం సాగించారు. పాలకులు, భూస్వాముల అణచివేత, దోపిడీపై ధిక్కారం ప్రదర్శించారు. నూనూగు మీసాల వయసు నుండే బీ.ఆర్ అంబేడ్కర్, అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రలను అర్థమయ్యే రీతిలో ఒగ్గు కథలు, బుర్రకథల రూపంలో వినిపించి మట్టి మనుషుల్లో చైతన్యం రగిలించారు. గోచీ, గొంగళి, కాళ్లకు గజ్జెలు, చేతి కర్ర, ఎర్రజెండా కలగలిపిన ఆహార్యంతో ఆయన ప్రజలలో చైతన్యం నింపారు.
దుఃఖం ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమవుతూ..
గద్దర్ ఆశ, ఆశయం సమ సమాజ నిర్మాణం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. 'జ్ఞానమొక్కటే మిగిలిపోవుగాక' అన్న బీ.ఆర్ అంబేడ్కర్ మాటను ఆయన ఆచరించారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నుండి జన నాట్యమండలి సాంస్కృతిక సేనానిగా రూపాంతరం చెందారు. దుఃఖం ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమయ్యారు. పాటను ఆయుధంగా ఎక్కుపెట్టి ప్రకంపనలు రేపారు. 'భారతదేశం భాగ్యసీమరా.. సకల సంపదకు కొదువ లేదురా' అంటూ రైతుల గోసను చెప్పారు. బూటకపు ఎన్‌కౌంటర్లపై స్పందించాడు. పాడి శ్రామిక వర్గాలకు దన్నుగా నిలిచారు. 'బండెనక బండికట్టి.. పదహారు బండ్లు కట్టి.. ఏ బండ్లో వస్తావ్ కొడుకో.. నైజాము సర్కరోడా' అంటూ పెత్తందారీ వ్యవస్థకు ప్రశ్నించాడు. కారంచేడు హత్యాకాండ జరిగినప్పుడు దళితులకు ధిక్కారం నూరిపోశారు. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా.. తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా' అంటూ మానవ సంబంధాల ఆవశ్యకతను వివరించి స్త్రీ పక్షపాతిగా నిలిచారు. 35 ఏళ్ల కిందటే వరంగల్‌లో జరిగిన ' రైతు కూలీ' మహాసభలకు గద్దర్ హాజరవుతారని తెలిసి ఏకంగా 15 లక్షల మంది ప్రజలు వచ్చారంటే ఆయన పాట ఎంత పదునైందో అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్ర ఉద్యమంలో రక్తం చిందిస్తూ..
జీవితమంతా ప్రజా పోరాటాల్లో గడిపిన గద్దర్‌ను 75 ఏళ్ల వయసు వరకు రాజ్యం 32 పోలీసు కేసులతో వెంటాడింది. 1997లో గద్దర్‌పై హత్యాయత్నం జరగగా, మృత్యు ముఖంలోకి వెళ్లి బయటపడ్డారు. మలి తెలంగాణ ఉద్యమాన్ని గద్దర్ తన పాటా, ఆటలతో ఉర్రూతలూగించడం ఈ తరం కళ్లారా చూసింది. 'అమ్మా తెలంగాణమా.. ఆకలి కేకల గానమా' పాటలో ఒక వైపు ఆవేదన చెబుతూనే.. మరోవైపు 'ఎట్టొల్ల మట్టి చిప్పవు.. గాయిదోల్ల గండ్రగొడ్డలివి' అంటూ తిరుగుబాటును నేర్పడం ఒక్క గద్దర్‌కే చెల్లింది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో చెమటతో పాటు రక్తం చిందించిన ప్రజా వాగ్గేయకారుడాయన. తుపాకీ గుండ్లను ఎదుర్కొన్న గద్దర్.. 'నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా.. మీ పాటనై వస్తున్నానమ్మో మా అమ్మలారా' అంటూ తెలంగాణ విముక్తి కోసం మళ్లీ గానం చేశాడు. 'అక్షరం అంటరాని విముక్తి గీతం' అని నమ్మిన గద్దర్ మహాబోధి విద్యాలయం నెలకొల్పి వందలాది వలస కార్మికుల పిల్లలకు ఉచితంగా విద్యను అందించారు.
గద్దర్ చరిత్ర భవిష్యత్‌కు తెలిపేందుకు..
నక్సల్, మావోయిస్టు ఉద్యమ పంథాలో నడిచిన గద్దర్..70 ఏళ్లు నిండాక తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. గోచీ, గొంగడి, కర్రకు ఎర్రజెండా ఆహార్యం వదిలి సూటు, బూటు ధరించారు. చేతి కర్రకు పంచశీల కండువాను కట్టారు. భారత రాజ్యాంగం చేబూని 'ఒక మనిషి - ఒక ఓటు' ఆవశ్యకతను నొక్కి చెప్పాడు. 'బానిసలారా లెండిరా.. ఈ బాంచన్ బతుకులు వద్దురా.. అడుక్కుతింటే మన ఆకలి తీరది.. గుద్ది గుంజుకుందామురా' అంటూ మిగిలిన కర్తవ్యాన్ని బోధించారు. ఓట్ల విప్లవం వర్ధిల్లాలి అని నినదించారు. ఏడు దశాబ్దాలు భయం ఎరుగని గుండె 2023 ఆగస్టు 6న భౌతికంగా ఆగిపోయింది. కానీ, గద్దర్ చిరస్మరణీయుడు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ జయంతిని అధికారికంగా నిర్వహించడాన్ని సమాజం స్వాగతించింది. అయితే ఇది అంతటితే సరిపోదు. ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ప్రతిష్టించి, భవిష్యత్ తరాలకు ఆయన చరిత్ర తెలిపేందుకు పాఠ్య పుస్తకాలో గద్దర్ చరిత్రను పొందుపర్చాలి. అలాగే ఏదైనా ప్రభుత్వ యూనివర్సిటీకి ఆయన పేరును పెట్టాలని కవులు, కళాకారులు, అభిమానులు వినమ్రంగా కోరుకుంటున్నారు.
(నేడు గద్దర్ వర్ధంతి సందర్భంగా)
-నరేష్ పాపట్ల
95054 75431






