కలలను వాస్తవాలుగా మార్చిన శాస్త్రవేత్త!

by Ravi |   (  Updated:2025-10-15 00:46:09  IST  )

నా కథ రామేశ్వరం దీవిలో, మసీదు వీధిలో నూరేళ్లకు పైగా జీవించి అక్కడే మరణించిన జైనులాబ్ధీన్ కొడుకు కథ. తన అన్నకు సాయం చేయడానికి వార్తా పత్రికలు అమ్మిపెట్టిన పిల్లవాడి కథ. శివ సుబ్రహ్మణ్య

కలలను వాస్తవాలుగా మార్చిన శాస్త్రవేత్త!
X

నా కథ రామేశ్వరం దీవిలో, మసీదు వీధిలో నూరేళ్లకు పైగా జీవించి అక్కడే మరణించిన జైనులాబ్ధీన్ కొడుకు కథ. తన అన్నకు సాయం చేయడానికి వార్తా పత్రికలు అమ్మిపెట్టిన పిల్లవాడి కథ. శివ సుబ్రహ్మణ్య అయ్యర్, ఇయొదురై సొలోమోన్ పెంచి పెద్ద చేసిన విద్యార్థి కథ. పాండలై వంటి ఉపాధ్యాయులు బోధించిన అభ్యాసి కథ. ఎమ్.జి.కె మీనన్‌తో గుర్తించబడ్డ సైంటిస్టు కథ, చరిత్ర పురుషుడైన ప్రొఫెసర్ సారాభాయితో తీర్చిదిద్దబడ్డ ఇంజనీర్ కథ. వైఫల్యాలతో ఎదురు దెబ్బలతో పరీక్షించబడ్డ శాస్త్రవేత్త కథ. ప్రతిభావంతులు, దీక్షాపరులైన ఒక విస్తృత వృత్తి నిపుణుల బృందం సహకారం పొందిన నాయకుడి కథ. ఈ కథ నాతోనే ముగుస్తుంది. ఎందుకంటే ప్రాపంచికార్థంలో నాకెవరూ వారసులు లేరు. నేనేదీ కూడ బెట్టలేదు, ఏదీ కట్టుకోలేదు, ఏమీ సంపాదించుకోలేదు. నన్ను ఇతరులకొక ఉదాహరణగా చూపించుకోవాలని నేను అనుకోవడం లేదు. కానీ కనీసం నా జీవితం నుంచి కొందరైనా ఉత్తేజం పొందవచ్చంటూ అబ్దుల్ కలాం తన ఆత్మకథ ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’లో చెప్పుకున్న విధానం కోట్లాదిమంది యువతను విపరీతంగా ప్రభావితం చేసింది.

సామాన్య కుటుంబంలో పుట్టి..

తమిళనాడులోని రామేశ్వరంలో ఓ నిరుపేద కుటుంబంలో 1931 అక్టోబర్ 15న జన్మించిన కలాం, తన కుటుంబం, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో భౌతికశాస్త్రంపై ఆసక్తిని పెంచుకొని కొన్ని పరిణామాల మధ్య ఏరో స్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసి భారతీయ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)లో కీలక బాధ్యతలు చేపట్టి మన దేశం గర్వపడేలా పనిచేశారు. నేడు అగ్ర రాజ్యాలను సైతం ఆశ్చర్యపరుస్తున్న మన అంతరిక్ష ప్రయోగ విజయాలు కలాం లాంటి మహానుభావుల నిరంతర కృషే పునాదని చెప్పవచ్చు. ఆయన మనదేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1997లో భారతరత్న పురస్కారంతో సత్కరించింది. అనంతరం ఆయన రాష్ట్రపతిగా పోటీ చేసి మన దేశ 11వ రాష్ట్రపతిగా సేవలు అందించారు. ఆయన పదవీ కాలంలో దేశంలోని విద్యార్థులకు, యువతకు పెద్ద పెద్ద కలలుగనమని మార్గదర్శనం చేస్తూ రోల్ మోడల్ అయ్యారు.

స్వాతంత్య్ర పోరాటంలో భాగమే అంటూ..

ప్రపంచానికి ఇంతవరకూ మనకు తెలిసి శ్రీనివాస రామానుజన్ వంటి జీనియస్ మరొకరు జన్మించలేదంటూనే, మన ప్రఖ్యాత శాస్త్రవేత్తలు మన పాఠశాలల్లో మరొక రామానుజన్‌ను ఎందుకు చూడలేకపోతున్నారంటూ మనల్ని సూటిగా ప్రశ్నించారు. ఓ సందర్భంలో... 1910కి పూర్వం అంతర్జాతీయ ఖ్యాతి గానీ, స్థాయి గానీ కలిగిన భారతీయ శాస్త్రవేత్తలు లేరు. కానీ 1920 నుంచి 1925 మధ్య మనం హఠాత్తుగా అంతర్జాతీయ ప్రకాస్తి గడించిన అయిదారుగురు శాస్త్రవేత్తల్ని చూడగలిగాం. ఈ విశిష్టమైన సంభవానికి జాతీయోద్యమ కాలం యువ హృదయాల్లో రగిలించిన ఆత్మ వ్యక్తీకరణ కాంక్షే అయి ఉంటుందని. తనని తాను నిలబెట్టుకోవడానికి జరిపిన స్వాతంత్ర్య సంగ్రామంలో అది కూడా ఒక భాగమే అంటారు కలాం. అప్పుడు భారతదేశం పాలిత దేశమే అయినా, సైన్స్‌లో మాత్రం మనం పాశ్చాత్య ప్రపంచంతో సమ ఉజ్జీలుగానే నిలబడ్డామంటారు. తన ఆలోచనలతో ప్రపంచ ప్రఖ్యాతులనే ప్రభావితం చేసిన కలాం 2015 జూలై 27న ఈశాన్య బారత్ లోని ఓ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్ధేశించి ప్రసంగిస్తూనే అస్తమించారు. స్వాతంత్ర్య భారత్ కోసం గాంధీజీ రాట్నంతో దేశాన్ని మేల్కొలిపితే కలాం రాకెట్ల కలలతో స్వాతంత్ర్య భారతాన్ని ముందుకు నడిపారు. భారత యువతకు కలలు కనడం నేర్పిన కలాం, మనం ఆ కలలను సాకారం చేయడం నేర్పారు. ఆయన పేరు మరిచిపోయినా, ఆయన చూపిన దారి మన ఆత్మలో వెలుగుతుంది.

-ఫిజిక్స్ అరుణ్ కుమార్

93947 49536

Next Story