- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వాతంత్య్ర సమరంలో తొలిసేనాని
1795 నాటికి బెంగాల్, బిహార్, ఒరిస్సా ప్రాంతాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో పట్టు సాధించింది. అప్పుడు

1795 నాటికి బెంగాల్, బిహార్, ఒరిస్సా ప్రాంతాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో పట్టు సాధించింది. అప్పుడు ఛోటా నాగపూర్‌లోకి అడుగుపెట్టిన ఆంగ్ల సైన్యాధిపతి కెప్టెన్ జాకబ్ ఖైముక్ 'విభజించి పాలించు' విధానంతో విభేదాలు సృష్టించి స్థానిక రాజ్యాలను ఆక్రమించి కంపెనీ పాలన ప్రారంభించారు. దీంతో అప్పటి వరకు స్థానిక రాజుల పాలనలో ప్రజలంతా శాంతిగా, ధార్మిక, భక్తి, సాంస్కృతిక జీవనంతో ఆర్థికంగా, సాంఘికంగా సుఖజీవనం గడిపేవారు. కంపెనీ వారు అడుగు పెట్టాక ప్రజలను అణచివేసి, దోపిడీ చేస్తూ బానిసలుగా మార్చి ధర్మ, సంస్కృతులను అవహేళన చేసి, ఆధ్యాత్మిక కేంద్రాలను ఆక్రమించి మత మార్పిడి చేసేవారు. ఈ బాధలను భరించలేక ప్రజలు ఆంగ్ల పాలనను వ్యతిరేకిస్తూ స్వాతంత్య్ర సాధనకి తీవ్రంగా పోరాడారు. ఈ పోరాటానికి 1792 ఫిబ్రవరి 17న సిల్లీ గ్రామంలో జన్మించిన బుధు భగత్ కేంద్రమైనాడు. ఆయన మరుగునపడిన స్వాతంత్ర్య సమర యోధులలో ముఖ్యమైన వారు.
ఆదివాసీలు దేవుడని నమ్మేవారు!
దేశంలో 1832 వరకు ఆదివాసీలు బ్రిటిష్ వారిపై పోరాటం చేశారు. ఈ పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొనే 1857లో దేశమంతటా స్వాతంత్య్ర సాధనకు తొలి సంగ్రామం ఆరంభమైంది. భగత్‌కు దైవశక్తులు ఉన్నాయని ప్రజల విశ్వాసం. జీవిత సమస్యల్లో దిక్కుతోచని ప్రజలు ఆవేదనతో భగత్‌ను తలిస్తే దేవుని వలె ప్రత్యక్షమై పరిష్కరించేవాడని నమ్మకం. పరిసర గ్రామాల గిరిజనులంతా బుధు భగత్‌ను అనుసరించేవారు. అయితే ఆంగ్లేయులు మాత్రం ఆయనను విప్లవ నేతగా గుర్తించి ఆయన రాకపోకలపై నిఘా పెట్టి గ్రామాలల్లో సోదాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేసేవారు. అయితే ఎంత వెతికినా ఆయన ఆచూకీ తెలిసేది కాదు. ఆయనను పట్టిస్తే నగదు బహుమతి ఇస్తామని ప్రకటించినా ఆచూకీ ఎవరూ చెప్పేవారు కాదు. అందుకు కారణం ప్రజలంతా భగత్‌ను తమ ఆరాధ్య దైవంగా భావించి ఆయనను రక్షించడం కర్తవ్యంగా భావించేవారు.
బ్రిటిష్ సేనలకు సింహ స్వప్నంగా మారి..
ఒక సారి భగత్ సిల్లీ గ్రామంలో ఉన్నాడని తెలుసుకొని దాడి చేస్తే ఆ సమయంలో గ్రామంలోని యువకులు తమ ఆయుధాలతో భగత్ చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడి తమ ప్రాణాలు లెక్కచేయకుండా ఆయనను రక్షించడానికి ప్రయత్నించారు. కానీ భగత్‌కు అకస్మాత్తుగా తుపాకీ గుండు తాకడంతో ఆయన నేలకొరిగాడు. 1832 ఫ్రిబ్రవరి 17న కెప్టన్ ఇంఫె భగత్, ఆయన అనుయాయుల తలలు నరికి పెద్ద పళ్లెంలో పేర్చి కమిషనర్‌కు పంపాడు. ఈ విషయాన్ని 1832 ఫిబ్రవరి 29 నాటి బెంగాల్ హారకరా పత్రిక ప్రచురించింది. బ్రిటిష్ సేనలకు సింహ స్వప్నంగా నిలిచిన బుధు భగత్ స్వాతంత్య్ర స్ఫూర్తిని ఆయన పోరాట చరిత్రను సి. రాయ్ చౌదరి భారత స్వాతంత్య్ర తొలి సంగ్రామంగా వర్ణించాడు. బుధు భగత్ ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో తొలి సేనానిగా చరిత్ర పుటల్లో నిలిచాడు.
(నేడు బుధు భగత్ జయంతి, వర్ధంతి)
గుమ్మడి లక్ష్మీ నారాయణ
9491318409
- Tags
- Budhu Bhagat






