ఆ అడుగుకు మూడేళ్లు..

by Ravi |   (  Updated:2026-03-18 01:16:00  IST  )

ప్రతిపక్షంలో ఉన్న సమయంలో భట్టి విక్రమార్క పాదయాత్ర తెలంగాణ రాజకీయాల్లో తీసుకొచ్చిన మార్పులు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లపై సమగ్ర విశ్లేషణ.

ఆ అడుగుకు మూడేళ్లు..
X

ఎన్నో ఆకాంక్షలు, ఎన్నో ఆశలతో నిర్విరామంగా పోరాడి సోనియా గాంధీ కృషితో తెలంగాణలోని సబండ వర్గాల పోరాటంతో సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలోకి అడుగుపెట్టిన తెలంగాణ ప్రజలు, రాష్టం వచ్చిన ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలను మాయచేసి, మభ్యపెట్టి, నీటిలో రాతల్లా, గాలిలో మాటల్లా అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ ఇచ్చిన అమలు కాని హామీలను నమ్మిన ప్రజలు ఆ పార్టీకి పట్టం కట్టారు..

కొత్త ఆశలతో అడుగుపెట్టిన తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పాలన చూసి పెనం మీద నుండి పోయిలోకి పడ్డట్లు అయ్యింది... తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయనుకున్న విద్యార్థుల ఆశల ఆవిరి అయ్యాయి. మా రాష్ట్రంలో మా బతుకులు సక్కగా ఉంటాయనుకున్న రైతుల చేతికి సంకెళ్లు వేసిరి, గూడులేని మమ్మల్ని ఆదుకుంటారు అనుకున్న పేదల జీవితంలో చీకట్లు నింపారు.. నీళ్లు రాక, నిధులు రాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆగమైన తెలంగాణ ప్రజల బతుకులు, స్వరాష్ట్రంలో కూడా గంతే ఆగమాగం అయినవి.

ప్రజల భుజం తట్టిన చేయి..

బీడు బారిన భూములు, ఉద్యోగాలు లేక యువతి యువకులు, అమరులైన బిడ్డల కడుపుకోతలు ఒకవైపు... ధనమే దాహంగా, దోచుకోబడటమే మార్గంగా, అందిన కాడికి అటు ప్రజల ఆశలను, ఇటు తెలంగాణ సొమ్మును దోచుకోవడానికి అలవాటుపడ్డ దొరలను ఏమి చేయలేక, ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి చెప్పాలో తెలియక, నిస్సహాయకంగా, నిస్తేజంగా చూస్తూ ఉన్న తెలంగాణ ప్రజలకు ఒక వెలుగు కనిపించింది, ఒక ధైర్యం వారి గుండెల్లోకి వచ్చింది, ఒక అన్నలా వారి భుజం మీద ఒక చేయి తట్టింది...నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రజలు తలెత్తి, పిడికిలి బిగించి నినదించారు..

పిప్పిరి నుండి ఖమ్మం వరకు పాదయాత్ర..

దగాబడ్డ ప్రజల కోసం, వారి కష్టాలు విని, వాటికి పరిష్కార మార్గం చూపటం కోసం, వారికి అండగా ఉండటం కోసం, ఏ ఆశయ సాధన కోసం ఆనాడు సోనియా గాంధీ తెలంగాణ రాష్టం ఇచ్చారో, ఆ ఆశయాలు ఇందిరమ్మ రాజ్యంలో ఐతేనే సాకారం అవుతాయని జనాలను జాగృతి చేయటం కోసం కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజల కోసం పిప్పిరి నుండి ఖమ్మం వరకు పాదయాత్ర మొదలుపెట్టారు భట్టి విక్రమార్క... ఆ పాదయాత్రలో నేను భాగమవ్వటం అదృష్టం.

ప్రజా నాయకుడు భట్టి విక్రమార్క!

తెలంగాణ ప్రజల జీవన విధానాలను, వారు పడే శ్రమ, కష్టాలను దగ్గర ఉండి సూక్ష్మంగా చూసినా భట్టి విక్రమార్క, రాజకీయ నాయకులు వచ్చారా, పోయారా? అన్నట్లు కాకుండా, వాటి పరిష్కార మార్గాలను కాంగ్రెస్ పార్టీ మేని ఫెస్టోలో పొందుపరిచేలా అధినాయకత్వాన్ని ఒప్పించారు.. బడుగు బలహీన వెనుకబడ్డ వర్గాలను పార్టీకు దగ్గర చేశారు. పార్టీకు దగ్గర చేశారు అనటం కంటే పార్టీనే వారి దగ్గరగా వెళ్లేలా పార్టీని కదిలించారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెబితే నవ్వే రోజు నుండి దొరల గడీను కూల్చేది, పేదలు బతుకులో వెలుగులు నింపేది కాంగ్రెస్సే అనేలా తన నడక సాగింది. సుదీర్ఘ పాదయాత్ర తర్వాత జరిగిన సార్వతిక ఎన్నికలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.. పార్టీకు వీర విధేయుడుగా పేరొందిన భట్టి విక్రమార్క, సమీకరణలు కుదరక అధిష్టానం సూచనతో సీఎం పదవికి అన్ని అర్హతలు ఉన్నా పార్టీ పెద్ద మీద గౌరవంతో సీఎం పదవిని వదులుకున్నారు, కానీ, ప్రభుత్వంలో సీఎం స్థాయి సమాంతరంగా ప్రభుత్వ నిర్ణ యాలల్లో పాలుపంచుకుంటున్నారు, నాడు పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ఒక్కోటిగా నెరవేస్తూ వస్తున్నారు..

రైతులకు రూ.31,000 కోట్ల రుణమాఫీ

పాదయాత్రలో తనను కలిసిన వారిని పేరు పేరున యాది ఉంచుకొని వారికి పథకాలు అందేలా చర్యలు తీసుకున్నారు. పాదయాత్ర సమయంలో, తన కష్ట సుఖాలలో ఉన్న వారే బంధువులుగా బావించి తన కుమారుడి వివాహానికి వారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించి వాటిని సత్కరించిన గొప్ప మనసు ఉన్న నాయకుడు భట్టి విక్రమార్క.. ముఖ్యంగా తన పాదయాత్ర సమయంలో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ , చలికి వణుకుతున్న అవ్వలను చూసి చలించిన భట్టి విక్రమార్క, ప్రభుత్వం రాగానే తెలంగాణలో ఆడబిడ్డల పేరు మీద ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపారు.. రైతులు పక్షపాతిగా పేరొందిన భట్టి విక్రమార్క తన పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం దేశ చరితలో ఎక్కడ లేని విధంగా రూ.31,000 కోట్ల రుణమాఫీ చేసి చరిత్రలో నిలిచారు..

4 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు..

నాలుగు లక్షల ఇందిరమ్మ ఇళ్లు రాష్ట్రంలో మంజూరు చేశారు. నేడు ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇళ్ల ప్రారం భోత్సవం పండుగ జరుగుతోందంటే దానికి ముఖ్య కారణం భట్టి విక్రమార్క.. పార్టీలో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ రైజింగ్ తెలంగాణాలో భాగస్వామ్యం చేస్తూ ముందుకు సాగుతున్నారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా 'మా భట్టి అన్న తాళం‌చెవి తీస్తేనే నిధులు వస్తాయి' అని అనేక సందర్భాలలో అన్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు.. ప్రభుత్వంలో ఆయన స్థానం ఏంటో? జోడు ఎడ్ల బండిలా అటు ముఖ్యమంత్రి - ఇటు ఉప ముఖ్యమంత్రి రాష్టాన్ని ఇంకా అభివృద్ధి పథంలో నడపాలనీ, ఒక ఉద్యమకారుడుగా, తెలంగాణ పౌరుడుగా కోరుకుంటున్నాను. చరిత్రలో నిలిచేలా సాగిన నాటి పాదయాత్రలో నావంతుగా భాగస్వామ్యం ఐనందుకు సంతోషిస్తూ..

(భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా)

- బిచ్చాల అన్వేష్

యువజన కాంగ్రెస్,

96669 17596

Next Story