తెలంగాణ మార్గదర్శి ప్రొఫెసర్ జయశంకర్

by Ravi |   (  Updated:2025-08-06 00:30:52  IST  )

ఆధిపత్య శక్తులపై ఆయనో వీరభద్రుడు. ఆలోచనల అవస రాన్ని తెలిపిన నిబద్ధుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్

తెలంగాణ మార్గదర్శి ప్రొఫెసర్ జయశంకర్
X

ఆధిపత్య శక్తులపై ఆయనో వీరభద్రుడు. ఆలోచనల అవస రాన్ని తెలిపిన నిబద్ధుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్, ఆయన తెలంగాణను స్వప్నించి, శాసించిన మహోపాధ్యాయుడు. ఈయన వరంగల్ జిల్లా, ఆత్మకూరు మండలం అక్కన్నపేట గ్రామంలో 1934 ఆగస్టు 6న జన్మించాడు. హనుమకొండలోని మార్కజీ పాఠశాలలో ప్రాథమిక విద్య నేర్చాడు. హనుమకొండ న్యూ హైస్కూల్లో మాధ్యమిక విద్య వరకు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్.ఎస్.సీ వరకు చదువు కున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని బీ.ఏ పూర్తి చేశారు. బెనారస్ విశ్వవిద్యాలయం, అలీగడ్ విశ్వ విద్యాలయం నుండి పీజీ పూర్తి చేశారు. జయశంకర్ సార్‌కి సమస్యల పట్ల ఏ విధంగా స్పందించాలో, ఏ విధంగా ఉద్యమంగా తీర్చిదిద్దాలో తెలుసు..

ఇంటర్ విద్యార్థిగా ఉన్నప్పుడే..

అప్పట్లో వరంగల్‌లో డిగ్రీ కళాశాల లేదు. డిగ్రీ చద వాలంటే హైదరాబాదుకు వెళ్లాలి. లెక్చరర్స్ ప్రోద్బలంతో డిగ్రీ కాలేజీ కావాలని విద్యార్థులు ఉద్యమించారు. అందులో మొదటి వరుసలో జయశంకర్ ఉన్నాడు. ఈ సంఘటన తర్వాత పదేళ్లకు డిగ్రీ కాలేజీ, 30 ఏళ్లకు యూనివర్సిటీ వచ్చింది. ఏదైతే డిగ్రీ కాలేజీ, యూనివర్సిటీ కోసం ఉద్యమం చేసిండో అదే యూనివర్సిటీకి ఆచార్య జయశంకర్ వైస్ చాన్సలర్ అయ్యాడు. 1960లో ఉపాధ్యాయ వృత్తిలో అడుగు పెట్టిన ఆయన లెక్చరర్‌గా ఆదిలాబాద్‌లో పనిచేశాడు. 1975-79 వరకు సీ.కె.ఎం కళాశాల ప్రిన్సిపల్‌గా, బోర్డు మెంబర్‌గా సేవలందించాడు. అలాగే రిజిస్ట్రా‌ర్‌గా, కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గానూ పనిచేశాడు. మూడు దశలుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ కీలక పాత్ర పోషించారు. 1952లో ఇంటర్మీడియట్ విద్యార్థిగా తెలంగాణకు జై కొట్టి తరగతులను బహిష్కరించారు. వరంగల్‌లో మొదలైన ఉద్యమం హైదరాబాద్‌లో కేంద్రీకృతమైంది. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధనకు ఎలాంటి వ్యూహాలు రచించాలో సార్‌కు తెలుసు..

మూడు దశల్లో ఉద్యమం చేయాలంటూ..

తెలంగాణ ఉద్యమానికి మూడు దశలు ఉన్నాయి. మొదటిది భావజాల వ్యాప్తి అది జరిగింది, రెండవది ఆందోళన కార్యక్రమం అది కొనసాగుతున్నది, ఇక మిగిలింది రాజకీయ ప్రక్రియ అది జరగాల్సి ఉంది. దానిని పూర్తి చేయడమే ఉద్యమ కర్తవ్యం కావాలి. దానికి రాజకీయ చిత్తశుద్ధి అవసరం. ఇప్పుడున్న రాజకీయ నాయకత్వం ఆ పని పూర్తి చేస్తుందని నేను నమ్ముతున్నానని ప్రకటించాడు. ఉద్యమం జరిగిన మూడు దశల్లోనూ జయశంకర్ సార్ పేరు మరువలేనిది. అందుకే ఆయన తెలంగాణ సిద్ధాంతకర్త. ముఖ్యంగా తెలంగాణ భావజాల వ్యాప్తి ప్రజలలో ఎలా చొచ్చుకు పోయిందో జయశంకర్ సార్ ఒకరోజు ఇట్లా చెప్పిండు. "ఎందుకమ్మా తెలంగాణ అంటే? సార్ తెలంగాణ వస్తే మా పొలాలకు నీళ్లు వస్తాయి, మా పోరగాళ్లకు కొలువులు వస్తాయి. అనే భావన వారికి కలిగింది" చదువురాని ఆడవాళ్లు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాడు. జయశంకర్ సార్ విద్యార్థి, సంఘ నాయకుడు గొప్ప పరిపాలనా దక్షుడు. తెలంగాణ కోసం అహర్నిశలు శ్రమించిన కార్యశూరుడు. తెలంగాణ కోసం తెలంగాణ రాజకీయ నాయకులకు తన సహకారం అందించాడు. చెన్నారెడ్డి నుండి చంద్రశేఖర్ రావు వరకు ప్రతి ఒక్కరి రాజకీయ పార్టీకి తన మేధో శ్రమను ధారపోశాడు. అయన ఆశిస్తున్నట్లే చివరగా రాజకీయ ప్రకియతోనే తెలంగాణ వచ్చింది. అందరిని తన మార్గంలో నడిపించాడు. అందుకే అతడు మార్గదర్శి. తెలంగా‌ణకు చిరునామా, రాష్ట్రం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు.

(నేడు జయశంకర్ సార్ జయంతి సందర్భంగా)

-దేవులపల్లి రమేశ్

99637 01294

Next Story