తెలంగాణ సినీ ప్రతిభను గుర్తించండి!

by Ravi |   (  Updated:2026-02-28 00:31:05  IST  )

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గద్దర్ ఫిలిం అవార్డులలో తెలంగాణకు చెందిన సినిమాలకు దర్శక నిర్మాతలకు నటీనటులకు జర్నలిస్టులకు సరైన న్యాయం జరగాలని తెలంగాణ సినిమా వేదిక పక్షాన మేం డిమాండ్ చేస్తున్నాం.

తెలంగాణ సినీ ప్రతిభను గుర్తించండి!
X

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గద్దర్ ఫిలిం అవార్డులలో తెలంగాణకు చెందిన సినిమాలకు దర్శక నిర్మాతలకు నటీనటులకు జర్నలిస్టులకు సరైన న్యాయం జరగాలని తెలంగాణ సినిమా వేదిక పక్షాన మేం డిమాండ్ చేస్తున్నాం. గద్దర్ ఫిలిం అవార్డులలో ప్రధాన ఫీచర్ ఫిలిం విభాగంలో, ప్రత్యేక అవార్డుల జ్యూరీలో పూర్తిగా తెలంగాణకు చెందని వారితోనే సభ్యులను, జ్యూరీ చైర్మన్‌తో సహా నియమించడం వలన తెలంగాణ సినిమా నటీనటులకు, సాంకేతిక నిపుణులకు న్యాయం జరగదని మేం అభిప్రాయపడుతున్నాం. ఇక ప్రత్యేక అవార్డులలో తెలంగాణకు సంబంధంలేని, తెలంగాణలో సినిమా వికాసానికి ఏమాత్రం దోహదపడని ఎన్టీఆర్ అవార్డు, బి.ఎన్. రెడ్డి అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు, అక్కినేని నాగేశ్వరరావు అవార్డు, నాగిరెడ్డి-చక్రపాణి అవార్డులు తెలంగాణ అవార్డులలో చోటు చేసుకోవడం ఏ మాత్రం సహేతుకం కాదు.. పైగా వీరి పేర్లతో పక్క రాష్ట్రంలో అవార్డులు ఇస్తూనే ఉన్నారు.. కనుక ఈ 5 అవార్డులను రద్దు చేసి వీటి స్థానంలో హైదరాబాదులో 1922‌లోనే సినిమాలు నిర్మించిన ధీరేన్ గంగూలీ పేరున ఒక ప్రత్యేక అవార్డును నెలకొల్పాలి. అలాగే హైదరాబాద్‌కు చెందిన ప్రఖ్యాత సమాంతర సినిమా పితామహుడుగా పేరుపొందిన శ్యామ్ బెనగల్ పేరున కూడా ఒక ప్రత్యేక అవార్డును ఏర్పాటు చేయాలి.. వీటితో పాటు తెలుగులో ఉత్తమ సామాజిక చిత్రాలను తీసి, జాతీయ అవార్డులు గెలుచుకున్న ప్రఖ్యాత దర్శకుడు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో నమోదైన బి.ఎస్. నారాయణ పేరున కూడా జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రవేశపెట్టాలని తెలంగాణ సినిమా వేదిక ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరుతున్నది. అలాగే డాక్యుమెంటరీ, క్రిటిక్స్ విభాగంలో ఏర్పాటు చేసిన అవార్డుల జ్యూరీ చైర్మన్లు తెలంగాణేతరులు కావడం తెలంగాణ సినీ పరిశోధకులకు, డాక్యుమెంటరీ నిర్మాతలకు న్యాయం జరగదు.. ఇక్కడి అవార్డులకు చైర్మన్లుగా, సభ్యులుగా ఉన్న తెలంగాణేతరులు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చే నంది అవార్డుల ఎంపిక కమిటీలలో మన వారికి సభ్యత్వ అవకాశం కల్పిస్తారా? ఎంతమంది తెలంగాణ వారికి అవార్డులు ఇప్పించగలరు? ఒక్కసారి ఆత్మ పరీక్ష చేసు కోవాలి. పైన మేం పేర్కొన్న అంశాలను దృష్టిలో ఉంచుకుని 2025 గద్దర్ ఫిలిం అవార్డుల ఎంపిక కమిటీలను తెలంగాణకు చెందిన వ్యక్తులతో పునర్నియమించాలని తెలంగాణ సినిమా వేదిక కోరుతున్నది.

-తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి

89775 31465

Next Story