- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంకుడు గుంతలే నీటి భవిష్యత్తుకు భరోసా!
ఎల్‌నినో ప్రభావంతో పెరుగుతున్న నీటి సంక్షోభం, భూగర్భ జలాల క్షీణత, హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో తలెత్తుతున్న తాగునీటి సమస్యలకు వర్షపు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల ఏర్పాటు అత్యవసరం..

ఎల్‌నినో ప్రభావం వల్ల వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా కురవాల్సిన వర్షాలు ఆలస్యంగా రావడం, తక్కువగా కురుస్తున్నాయి. ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై, ముఖ్యంగా హైదరాబాద్ వంటి వేగంగా విస్తరిస్తున్న నగరాలపై తీవ్రంగా పడుతోంది. భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతుండగా, బోర్లు ఎండిపోవడం, ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నగరవాసులకు నిత్యకృత్యంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. వర్షాభావంతో రైతులు పంటలకు నీరు అందించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువులు, కుంటలు, వాగులు ఆక్రమణలకు గురికావడం, వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశాలు తగ్గిపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. మరోవైపు ఇష్టానుసారంగా బోర్లు వేసి నీటిని వ్యాపారంగా మార్చడం కూడా భూగర్భ జలాల క్షీణతకు కారణమవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రతి ఇంటి వద్ద, ప్రతి ప్రభుత్వ కార్యాలయం, పాఠశాల, అపార్ట్‌మెంట్, పరిశ్రమలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం అత్యవసరం. ఇంటి పైకప్పులపై పడే వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి పంపిస్తే భూగర్భ జలాల నిల్వలు పెరుగుతాయి. బోర్లలో నీటి మట్టం మెరుగుపడటంతో పాటు తాగునీటి కొరత కూడా తగ్గుతుంది. రైతులకు సాగునీరు అందే అవ కాశాలు పెరుగుతాయి. నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కోట్ల రూపాయలతో కొత్త పథకాల కంటే, వర్షపు ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టే ఇంకుడు గుంతల ఉద్యమమే అత్యంత సమర్థవంతమైన పరిష్కారం. ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, కొత్త భవనాలకు ఇంకుడు గుంతలను తప్పనిసరి చేస్తేనే భవిష్యత్ తరాలకు నీటి భద్రతను అందించగలం. నీటిని కాపాడటమే జీవనాన్ని కాపాడటమనే విషయాన్ని ప్రభుత్వం, అధికారులు, ప్రజలు కలిసి గుర్తించాల్సిన సమయం ఇదే.
- విజయ్
93926 06361






