మునుగోడు ఉపఎన్నికకు కారణాలేంటి?విపక్షాల ఆరోపణలు నిజమేనా?

by Disha edit |
మునుగోడు ఉపఎన్నికకు కారణాలేంటి?విపక్షాల ఆరోపణలు నిజమేనా?
X

ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతూనే బిజేపీలో చేరుతున్నట్లు బహిరంగంగా ప్రకటించడం పార్టీ ఫిరాయింపుల చట్టం పరిధిలోకే వస్తుంది. అతి కీలకంగా ఉన్న ఈ సాంకేతికపర అంశాన్ని కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలు పరిగణలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యపరిచే అంశమే! చట్టంలోని లొసుగులను వినియోగించుకుంటూ, ఇంత బహిరంగంగా జరుగుతున్న పార్టీ ఫిరాయింపు వ్యవహారాన్ని బుద్ధిపూర్వకంగా విస్మరించడం మరింత విస్మయం కలిగిస్తున్నది. వారం, పది రోజులుగా సాగుతున్న కోమటిరెడ్డి రాజీనామా వ్యవహారం స్పీకర్‌ ఆమోదం తెలపడంతో ఒక కొలిక్కి వచ్చినప్పటికీ, రాజీనామా సందర్భంగా ఆయన సంధించిన అనేక ప్రశ్నలకు మునుగోడు ఉప ఎన్నికలో అక్కడి ఓటరు మహాశయులే సరైన జవాబులను అందించగలుగుతారు!

2018 లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి సాధారణ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత గడచిన మూడు సంవత్సరాల కాలంలో అసాధారణ పరిస్థితులు ఏర్పడి అనివార్యంగా నాలుగు ఉప ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సమర్పించిన రాజీనామాను స్పీకర్‌ ఆమోదించడంతో జరుగబోయే ఉప ఎన్నికకు ఆ నాలుగు ఉప ఎన్నికలకు ఎలాంటి పోలికలుగానీ, సారూప్యతగానీ కనిపించడం లేదు. అప్పటి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌‌రెడ్డి నల్గొండ పార్లమెంటు స్థానానికి ఎన్నిక కావడంతో హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానాన్ని వదులుకున్నారు. అక్టోబర్‌ 2019లో ఇక్కడ జరిగిన ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ ఈ స్థానాన్ని కైవసం చేనుకున్నది.

మెదక్‌ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హఠాత్తుగా మృతి చెందడంతో నవంబర్‌ 2020లో జరిగిన ఉప ఎన్నికలో బీజెపీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందారు. నాగార్జునసాగర్‌ ఎమ్మల్యేగా ఉన్న నోముల నర్సింహయ్య అకాల మరణంతో మే 2021లో జరిగిన ఉప ఎన్నిలోనూ అధికార పార్టీ అభ్యర్థి నోముల భరత్ విజయం సాధించారు. ఆ తర్వాత అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్‌ రాజీనామాతో నవంబర్‌ 2021లో తలెత్తిన హుజురాబాద్‌ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌‌ను విజయం వరించింది. ఈ నాలుగు ఉపఎన్నికల ఫలితాల వలన అధికార పార్టీకి సంఖ్యా పరంగా ఎలాంటి హెచ్చుతగ్గులు ఎదురుకానప్పటికీ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బీజేపీ అనూహ్యంగా బలం పుంజుకుని రాష్ట్రంలో అధికారపార్టీకి పెనుసవాలును విసరగలుగుతున్నది.

మాటల దొంతరలతో

మునుగోడు ఉపఎన్నికకు కారణమవుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాకు నహేతుక పరిస్థితులు కనిపించడం లేదు. తన రాజీనామాకు సంబంధించి ఆయన కూడా నిర్ధిష్ట కారణాలను స్పష్టం చేయలేకపోతున్నారు. ఏఐసీసీ నాయకురాలు సోనియాగాంధీకి రాసిన లేఖలో తన రాజీనామాకు కారణం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పని చేయలేకపోవడమేనని పేర్కొన్నారు. 'ఓటుకు నోటు' కేసులో రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లడాన్ని సాకుగా ప్రస్తావించారు. తన రాజీనామా ప్రకటనకు నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి అనుసరిస్తున్న నిరంకుశ విధానాలు, కుటుంబ పాలన, ప్రజావ్యతిరేక విధానాలంటూ ఏకరువు పెట్టారు. మరో సందర్భంగా తెలంగాణలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ మాత్రమే నిలబడగలుగుతుందని, రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ మాత్రమే దోహదం చేస్తుందని, గడచిన రెండు సంవత్సరాలుగా ఆయన చెబుతున్న అభిప్రాయాలనే పునరుద్దాటించారు.

తాను రాజీనామా చేయడంతో వచ్చే ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు ప్రభుత్వం మునుగోడు అభివృద్ధికి నిధులను విచ్చలవిడిగా మంజూరు చేన్తుందని, అందుకే తాను రాజీనామా మార్గాన్ని ఎంచుకున్నానని మరోసారి చెప్పుకున్నారు. ఇదిలా ఉంటే, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా విషయంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు. కోల్‌ ఇండియా పరిధిలోని జార్టండ్‌ బొగ్గుగనుల తవ్వకాలకు సంబంధించిన రూ.20 వేల కోట్ల భారీ కాంట్రాక్టు, అదే రాష్ట్రంలోని రూ. 818 కోట్ల జాతీయ రహదారుల విస్తరణ పనుల కాంట్రాక్టు పొందడం కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేసీలో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. ఆయన ఈ ఆరోపణలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నప్పటికీ, పై రెండు భారీ కాంట్రాక్టులు ఆయన కంపెనీకే దక్కడంతో కోమటిరెడ్డి వివరణలో విశ్వసనీయత కనిపించడం లేదు.

కనిపించని స్పష్టత

ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాలో ఎలాంటి స్పష్టత కనిపించడం లేదు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి, మరీ ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డి నియామకమైనప్పటి నుంచి ఆయన రాజీనామా అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనను టీఆర్‌ఎస్‌‌లో చేర్చుకునేందుకు అధికార పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ప్రయత్నించారని రాజీనామా ప్రకటన తర్వాత పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్య్యూలలో రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. బీజేపీ కేంద్ర నాయకత్వంతో చర్చలు, సంప్రదింపుల తర్వాత ఈ నెల 21న బిజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. అప్పటికి ఆయన తన రాజీనామాను స్పీకర్‌కు సమర్పించలేదు. రాజీనామా అధికారికంగా, చట్టపరంగా ఆమోదం పొందలేదు. కాంగ్రెస్ అధిష్టానం తమ నిర్ణయాన్ని వెల్లడించలేదు.

కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధిగా ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతూనే బిజేపీలో చేరుతున్నట్లు బహిరంగంగా ప్రకటించడం పార్టీ ఫిరాయింపుల చట్టం పరిధిలోకే వస్తుంది. అతి కీలకంగా ఉన్న ఈ సాంకేతికపర అంశాన్ని కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలు పరిగణలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యపరిచే అంశమే! చట్టంలోని లొసుగులను వినియోగించుకుంటూ, ఇంత బహిరంగంగా జరుగుతున్న పార్టీ ఫిరాయింపు వ్యవహారాన్ని బుద్ధిపూర్వకంగా విస్మరించడం మరింత విస్మయం కలిగిస్తున్నది. వారం, పది రోజులుగా సాగుతున్న కోమటిరెడ్డి రాజీనామా వ్యవహారం స్పీకర్‌ ఆమోదం తెలపడంతో ఒక కొలిక్కి వచ్చినప్పటికీ, రాజీనామా సందర్భంగా ఆయన సంధించిన అనేక ప్రశ్నలకు మునుగోడు ఉప ఎన్నికలో అక్కడి ఓటరు మహాశయులే సరైన జవాబులను అందించగలుగుతారు!

పిట్టల రవీందర్‌

సీనియర్ జర్నలిస్ట్

99630 62266

We are Hiring SEO Executive for Telugu News website.
For more details Click here
Send us your resume to:[email protected] / Whatsapp 8886424242

Next Story

Most Viewed