2002 ఓటుపై ప్రశ్న.. ప్రజలపై కొత్త సందేహాల భారం!

by Ravi |   (  Updated:2026-07-19 01:16:20  IST  )

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ- 2026 ప్రక్రియలో అడుగుతున్న ప్రశ్నలు, ప్రజల్లో నెలకొన్న సందేహాలు, ఎన్నికల సంఘం పారదర్శకత, బీఎల్‌వోల పాత్ర, ఓటర్ల విశ్వాసాన్ని బలోపేతం చేయాల్సిన అవసరంపై విశ్లేషణ.

2002 ఓటుపై ప్రశ్న.. ప్రజలపై కొత్త సందేహాల భారం!
X

భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందించేందుకు ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్–2026) కార్యక్రమాన్ని చేపట్టింది. ఓటరు జాబితాలోని లోపాలను సరిచేయడం, డూప్లికేట్ నమోదులను గుర్తించడం, మరణించిన వారి పేర్లను తొలగించడం, అర్హులైన ప్రతి పౌరుడి పేరును నమోదు చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. అయితే ఈ ప్రక్రియలో భాగంగా అడుగుతున్న కొన్ని ప్రశ్నలు మాత్రం ప్రజల్లో కొత్త సందేహాలకు తావిస్తున్నాయి..

24 సంవత్సరాల క్రితం ఎక్కడ ఓటు వేశారో ప్రతి పౌరుడు గుర్తుంచుకోవాలా? గుర్తు లేకపోతే ప్రజాస్వామ్యంలో అతని హక్కు ప్రశ్నార్థకమవుతుందా? ఇదే ప్రశ్న నేడు ప్రత్యేక ఓటరు సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో లక్షలాది మంది ఓటర్ల మనసులో మెదులుతోంది.

2002లో ఓటు వేశారా.. వేస్తే ఎక్కడ?

ఎన్నికల నిర్వహణలో ఓటరు జాబితా నాణ్యత అత్యంత కీలకం. ఒకే వ్యక్తి పేరు రెండు చోట్ల ఉండకూడదు. మరణించిన వారి పేర్లు తొలగాలి. అర్హులైన ప్రతి పౌరుడి పేరు తప్పకుండా నమోదవ్వాలి. ఈ లక్ష్యంతోనే ప్రత్యేక సవరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ, 2002లో ఓటు వేశారా.. వేస్తే ఎక్కడ? అనే ప్రశ్నను తప్పనిసరి అంశంగా అడగడం ఎందుకు దాని ఉద్దేశం ఏమిటి? ఆ వివరాలు ఇవ్వకపోతే దాని ప్రభావం ఏమిటనే విషయాలపై ప్రజలకు స్పష్టమైన సమాచారం అందకపోవడంతో సందేహాలు మరింత పెరుగుతు‌న్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటరు జాబితా ప్రక్షా ళన ఎంత ముఖ్యమో, ప్రజల విశ్వాసం అంతకంటే ముఖ్యమైనది. ప్రజలకు అర్థం కాని ప్రశ్నలు అడిగి, సరైన వివరణ ఇవ్వకుండా ప్రక్రియను ముందుకు నడిపితే అది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయదు.. అనుమానాలు పెంచుతుంది.

1400 మంది ఓటర్లకు.. ఇద్దరు సిబ్బంది చాలా?

ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో హెల్ప్‌ డెస్క్‌లు, బూత్ లెవల్ అధికారులు(బీఎల్‌వోలు), ఎన్యుమరేటర్లకు సరైన శిక్షణ లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఫారాలు ఎలా నింపాలి? ఏ సమాచారం ఎందుకు అడుగుతున్నారనే విషయాలను వివరించలేని పరిస్థితి ఉంటే ప్రజలు అధికారులను కాదు, మొత్తం వ్యవస్థనే ప్రశ్నిస్తారు.. ఒకే బూత్‌లో 900 నుంచి 1400 మంది ఓటర్లు ఉంటే, ఒక్కరు లేదా ఇద్దరు సిబ్బందితో మొత్తం ప్రక్రియను సమర్థంగా నిర్వహించడం ఎలా సాధ్యం? లోపాలను దాచడం కాదు.. వాటిని సరిదిద్దడమే మంచి పరిపాలనకు గుర్తు.

పాతికేళ్ల ముందు నాటి వివరాలు గుర్తుంటాయా?

ఇక్కడ మరో ముఖ్యమైన సామాజిక కోణం ఉంది. 2002లో ఓటు హక్కు ఉన్న వారిలో చాలామంది ఇప్పుడు వృద్ధులు.. మరికొందరు వలసలు వెళ్లారు.. చాలామంది తమ పాత చిరునామాలు, పాత పోలింగ్ కేంద్రాలు, అప్పటి ఓటరు వివరాలు గుర్తుంచుకునే పరిస్థితిలో ఉండకపోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, బీసీలు, ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, సంచార వర్గాలు, అసంఘటిత రంగ కార్మికులు, పట్టణాలకు వలస వచ్చిన కుటుంబాలపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సమాచార లోపం వల్ల హక్కులు దెబ్బతినకూడదు. ప్రజాస్వామ్యం ఉన్నది బలహీనులను మరింత బలహీనులను చేయడానికి కాదు.. వారిని వ్యవస్థలో భాగస్వాములను చేయడానికి. ప్రతి అదనపు సమాచారం వెనుక ఉద్దేశాన్ని ప్రజలకు స్పష్టంగా వివరించడం కూడా అంతే అవసరం. కొలిచినదే కొలమానమవుతుంది. సేకరించిన సమాచారం ఏ ప్రయోజనం కోసం ఎలా వినియోగిస్తారు పౌరుల హక్కులకు ఎలాంటి రక్షణ ఉంటుంది? అనే విషయాలను బహిరంగంగా వివరించినప్పుడే విశ్వాసం పెరుగుతుంది.

ప్రజలకు స్పష్టమైన సమాధానాలు కావాలి!

భారత రాజ్యాంగంలోని అధికరణ 324 ఎన్నికల నిర్వహణ బాధ్యతను ఎన్నికల సంఘానికి అప్పగించింది. అలాగే ఎన్నికల చట్టాల ప్రకారం ఓటరు జాబితాలను ఎప్పటికప్పుడు నవీకరించడం ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ బాధ్యత. అదే సమయంలో ప్రజలకు అవసరమైన సమాచారం అందించడం, సందేహాలను నివృత్తి చేయడం కూడా అంతే ముఖ్యమైన ప్రజాస్వామ్య బాధ్యత. అస్పష్టమైన ప్రశ్నలతో అయోమయం కలిగించడం కంటే, పారదర్శకమైన వివరణతో ప్రజల్లో విశ్వాసం పెంపొందించడం ముఖ్యం. అదే ఎన్నికల యంత్రాంగం తొలి బాధ్యత. ప్రస్తుతం ఈ అంశం రాజకీయ చర్చకు కూడా దారి తీస్తోంది. ప్రతిపక్షాలు దీనిని ప్రజలపై అదనపు భారం అని విమర్శిస్తున్నాయి. అధికార యంత్రాం గం మాత్రం ఓటరు జాబితా ఖచ్చితత్వం కోసం అవసరమైన చర్యగా సమర్థించే అవకాశం ఉంది. కానీ ప్రజలకు రాజకీయ వాదనలు కాదు, స్పష్టమైన సమాధానాలే కావాలి. ఎన్నికల ప్రక్రియపై చిన్న అనుమానం వచ్చినా అది మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అందుకే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాలి. వివరణలు అందుబాటులో ఉండాలి. సందేహాలకు సమాధానాలు వెంటనే ఇవ్వాలి.

విశ్వాసం ద్వారానే ప్రజా సహకారం..

ఈ సందర్భంలో మరో పెద్ద ప్రశ్నను సమాజం అడుగుతోంది. జనాభా వివరాలు లేకుండా సంక్షేమం ఎలా ప్రభుత్వ పథకాలు రూపొందించాలన్నా, సామాజిక న్యాయం అమలు చేయాలన్నా, బలహీన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నా ఖచ్చితమైన గణాంకాలు అవసరం. అదే సమయంలో ప్రజల నుంచి సేకరించే ప్రతి సమాచారం పారదర్శకంగా, చట్టబద్ధంగా, ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండాలి. సమాచారం సేకరణకు ప్రజల సహకారం అవసరం. ఆ సహకారం విశ్వాసం ద్వారానే వస్తుంది.. సందేహాల ద్వారా కాదు. ప్రభుత్వం, ఎన్నికల యంత్రాంగం తక్షణమే కొన్ని చర్యలు తీసుకోవాలి. బీఎల్‌వోలు, ఎన్యుమరేటర్లకు సమగ్ర శిక్షణ ఇవ్వాలి. ప్రతి ప్రశ్న వెనుక ఉద్దేశాన్ని సులభమైన భాషలో వివరించే మార్గదర్శకాలు విడుదల చేయాలి. ప్రతి హెల్ప్‌ డెస్క్‌లో ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించే సిబ్బందిని నియమించాలి. అవసరమైతే వివిధ శాఖల అధికారులను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలి. ప్రజల సందేహాలను నివృత్తి చేసే ప్రత్యేక హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేయాలి. ప్రజాస్వామ్యంలో నమ్మకం కోల్పోవడం అత్యంత పెద్ద నష్టం.

-దుండ్ర కుమారస్వామి

జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు

99599 12341

Next Story