- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్ మీడియాలో ‘ఫేక్’కు చెక్!
సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు, తప్పుడు సమాచారం, వైరల్ పోస్టులు సమాజంపై చూపుతున్న ప్రభావం, ఫ్యాక్ట్ చెక్ అవసరం, సోషల్ మీడియా సంస్థల బాధ్యత, మొబైల్ నంబర్ ఆధారిత అకౌంట్ ధృవీకరణ వంటి పరిష్కారాలు..

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. లేచింది మొదలు నిద్ర పోయే వరకు ఇందులో మునిగితేలుతున్నాం. దీనిని కొందరు కాలక్షేపం కోసం వాడుతుంటే.. మరికొందరు సమాచారం కోసం వాడుతున్నారు. ఇంకొందరు ఫేమస్ అయ్యేందుకు ఒక ఫ్లాట్ ఫారంగా ఎంచుకున్నారు.
ఇదంతా బానే ఉంది. కానీ ఇటీవల ఇందులో పోస్టు అవుతున్న కంటెంట్ చూస్తుంటే నిజంగా భయమేస్తున్నది. ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అని తెలియక ఈ ఫ్లాట్ ఫారాలను ఉపయోగించే వారు ఒకింత కన్ఫ్యూజన్‌కు, భయానికి లోనవుతున్నారు.
తప్పుదోవ పట్టించేలా..
సోషల్ మీడియాలో సమాచారం చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. కానీ అందులో నిజం ఎంతుందనేదే ప్రశ్న. ఒక విషయంపై ఓ పోస్టు వైరలయ్యేలోపే దానికి విరుద్ధంగా మరికొన్ని పోస్టులు పుట్టుకొస్తుంటాయి.. ఇందులో ఏది నిజం.. ఏది అబద్ధం? అనేది తేలడం కష్టంగా మారింది. దీనికి తోడు కొన్ని ఫేక్ వీడియోలను వైరల్ చేస్తుండటంతో తప్పుడు సమాచారం ఎక్కువగా వైరల్ అవుతున్నది. దీంతో ఇందులో నిజం తెలుసుకునేందుకు ఫ్యాక్ట్ చెక్‌తో పాటు మరికొన్ని వార్త ఏజెన్సీల వెబ్‌సైట్‌లను సందర్శిం చాల్సిన పరిస్థితి. ఇక క్రైమ్ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పలేం. ఇందుకు సంబంధించిన వీడియోలు బోలెడు వైరల్ అవుతుంటాయి.
ఫేక్ అకౌంట్లు..
ఇక సోషల్ మీడియాలో ఉన్న ప్రతి అకౌంట్ నిజమైనదేనని చెప్పలేం. ఇందులో చాలా వరకు ఫేక్ అకౌంట్లు ఉన్నాయి. అకౌంట్‌కు ఒక డీపీ, దానిని ఆపరేట్ చేసే వాళ్లు మరొకరు ఉంటారు. అందులో ఉండే కంటెంట్ ఇంకోటి ఉంటుంది. అసలు ఆ అకౌంట్ ఎవరిది అనేదీ తెలియదు.. తప్పుడు వార్తలు, సమాచారాన్ని వ్యాప్తి చేసేవాటిల్లో ఇవే అధికం. ఇవి కేవలం ఒక లక్ష్యం కోసం మాత్రమే ఏర్పడినవి. ఇందులో వచ్చే ప్రతి సమాచారం వారికి అనుకూలంగానే ఉంటుంది. దీనికి నిజంతో పనిలేదు. ప్రాపగాండా చేయడమే వీటి అంతిమ లక్ష్యం. నిజానికి సమస్యంతా ఇలాంటి అకౌంట్లతోనే. ఇలాంటి అకౌంట్ల నుంచి వచ్చిన పోస్టులను చూసిన నెటిజన్లు ఏదో తెలియని ఆందోళనకు గురవుతుంటారు. చిన్న క్రైంను కూడా పెద్దగా చేసి చూపడం లేదంటే చిన్న గొడవను పెద్దదిగా చేసి పోస్టులు చేయడం, కొన్ని వర్గాలను కించపరచడం, కావాలనే రెచ్చగొట్టడం, విద్వేషాలను జొప్పిం చడం వంటివి ఇలాంటి వాటిల్లోనే ఎక్కువ.
నియంత్రణలో విఫలం..
చాలా వరకు సోషల్ మీడియా యాప్స్ యాక్సిస్ కోసం మెయిల్ ఐడీ ఉంటే సరిపోతుంది. కానీ మెయిల్ ఐడీకి ఎలాంటి ఆధారం ఉండదు. దీని ద్వారా లాగిన్ అయి కంటెంట్ పోస్టు చేస్తే.. అసలు దానిని ఎవరు పోస్టు చేస్తున్నారు ఆ కంటెంట్ క్రియేటర్‌ను నిజంగానే నమ్మొచ్చా? అందులో ఏదైనా అబద్ధం ఉందా అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనికి తోడు ఫేక్ కంటెంట్‌ను నియంత్రించడంలో ఆయా ఫ్లాట్‌ఫారాలు సైతం ఫెయిలవుతున్నాయి. కేవలం మెయిల్ ఐడీతో అకౌంట్ యాక్సిస్ ఇవ్వడమే ఇందుకు ప్రధాన సమస్య. ఒక వేళ ఇలాంటి అకౌంట్లను బ్లాక్ చేసినా కొత్త మెయిల్ ఐడీతో మరో అకౌంట్ యాక్సిస్ తీసుకుంటారు. ఇలా లక్షల ఫేక్ అకౌంట్లు పుట్టుకొస్తుంటాయి.
ఒక వ్యక్తికి ఒకే యూజర్ ఐడీ
సోషల్ మీడియా అకౌంట్లకు మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా లింక్ చేయాలి. అకౌంట్ తెరిచే సమయంలో మొబైల్ నంబర్‌ను లాగిన్ ఐడీగా ఉపయోగించే విధానాన్ని సోషల్ మీడియా సంస్థలు అమలు చేయాలి. అయితే ఆ నంబర్‌ను పూర్తిగా గోప్యంగా ఉంచి, దాని ఆధారంగా ప్రత్యేక యూజర్ ఐడీ సృష్టించుకునే అవకాశం కల్పించాలి. అకౌంట్ నిర్వహణ మొత్తం యూజర్ ఐడీతోనే జరగాలి, కానీ లాగిన్ మాత్రం మొబైల్ నంబర్‌తోనే ఉండాలి. పాస్‌వర్డ్ మార్చుకునే అవకాశం ఉండాలి, అయితే యూజర్ ఐడీని మార్చకుండా ఉంటే మంచిది. ఒకవేళ వినియోగదారు మొబైల్ నంబర్ మార్చుకున్నా, పాత యూజర్ ఐడీ, ఫాలోవర్లు, పోస్టులు యథాతథంగా కొనసాగేందుకు అవకాశం కల్పించాలి. దీని వల్ల ఫేక్ అకౌంట్లకు, ఫేక్ కంటెంట్‌కు చాలా వరకు చెక్ పెట్టొచ్చు..
తప్పుదోవ పట్టించే పోస్టులు చేస్తే.. బ్లాక్
అకౌంట్ హోల్డర్ ఫేక్ కంటెంట్, ప్రజలను రెచ్చగొట్టే కంటెంట్ షేర్ చేస్తే వెంటనే గుర్తించి.. అవసరమైతే ఆ అకౌంట్‌ను కొద్ది రోజులు హోల్డ్‌లో పెట్టడమా లేక బ్లాక్ చేయడమా అనే నిర్ణయాన్ని సోషల్ మీడియా సంస్థలు కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఒక అకౌంట్ బ్లాక్ చేసినా కొత్త అకౌంట్ క్రియేట్ చేయడానికి మరో ఫోన్ నంబర్ అవసరం ఉంటుంది కాబట్టి.. కంటెంట్ పోస్టు చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ప్రజలను తప్పుదోవ పట్టించే, లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేలా పోస్టులు చేస్తే వెంటనే అకౌంట్ బ్లాక్ చేయొచ్చు.
-పి.మహేశ్ కుమార్,
జర్నలిస్ట్






