నివేదన:ఆరోగ్య భద్రత కల్పించండి సారూ

by Disha edit |
నివేదన:ఆరోగ్య భద్రత కల్పించండి సారూ
X

ఈహెచ్ఎస్ పథకం కింద వైద్య సేవలు అందించేందుకు ప్రైవేటు ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. దీనికి కారణం ఇప్పటికే ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు రూ. 350 కోట్ల వరకు చేరడమే. అందుకే, ప్రీమియం తో కూడిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ను అమలు చేయాలని ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇందుకుగాను ప్రతి నెల మూల వేతనం లో రెండు శాతం వరకు ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నాయి. ఇది అమలు జరిగితే ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయులు, పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులకు సాంత్వన చేకూరుతుంది.

ద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాలకులదే. 'ప్రభుత్వ ఉద్యోగం వరం లాంటిది. ఉద్యోగ భద్రత, పదోన్నతులు, సెలవులు, సకల సౌకర్యాలు ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయాలలో పనిచేసి ఇంటికి వచ్చి నిశ్చింతగా ఉండొచ్చు' అనే భావన ఉద్యోగులలో ఉంది. కానీ, వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. పాలకుల విధానాలు, మారుతున్న ధోరణుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగం కత్తిమీద సాములా మారింది.

జిల్లాల పునర్విభజన తర్వాత ఉద్యోగులపై పని భారం పెరిగింది. నలుగురు చేయాల్సిన పని ఒక్కరే చేయాల్సి వస్తున్నది. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల స్థానంలో కొత్త నియామకాలు చేపట్టడం లేదు. దీనివలన సెలవు తీసుకోకుండా రాత్రింబవళ్లు నిరంతరాయంగా పని చేయడంతో ఒత్తిడి పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహం, దృష్టి మాంద్యం వంటి అనేక రుగ్మతల బారిన పడుతున్నారు. ముఖ్యంగా 40 ఏండ్లు దాటిన ఉద్యోగ ఉపాధ్యాయులు అనారోగ్యంతో సతమతమవుతున్నారు.

సంక్షేమం మరిచిన సర్కారు

ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం కూడా సరైన వైద్య సేవలు అందించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వైద్య సేవలు అందించడానికి ఉమ్మడి రాష్ట్రంలోని సమీకృత వైద్య సహాయ నిబంధనలకు అనుగుణంగా మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు పరిచారు. దీని ప్రకారం ఉద్యోగులు తమ సొంత ఖర్చులతో చికిత్స పొందిన తర్వాత బిల్లును సమర్పిస్తే నిధులు ప్రభుత్వం విడుదల చేసేది.

దీనిని మొదట ఉద్యోగులకు, పెన్షనర్లకు, తర్వాత ఉపాద్యాయులకు వర్తింపజేశారు కానీ, ఇది ఉద్యోగులకు సాంత్వన చేకూర్చలేకపోయింది. దానికి కారణం ఆస్పత్రుల నుంచి బిల్లులు పొంది వాటిని సమర్పించి, బిల్లుల మంజూరు కోసం కార్యాలయాల చుట్టూ తిరగడం, నెలల తరబడి ఎదురు చూడడమే. బిల్లుల మంజూరుకు లంచాలు చెల్లించాల్సిన పరిస్థితి. పరిమితి రెండు లక్షలు మాత్రమే ఉండటంతో క్లెయిమ్ చేసుకున్న దానిలో సగం వరకు మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసేది. దీంతో గుండె జబ్బులు, నరాలు, మెదడు సంబంధిత శస్త్రచికిత్సలు, డెంటల్ చికిత్సలకు ఇబ్బందికరంగా మారేది.

ప్రీమియం ద్వారా సేవలు

ఈ వైద్య సేవల పథకం కేవలం కొన్ని ఆసుపత్రులకే పరిమితం కావడంతో ఉపాధ్యాయ సంఘం నేతలు ఉచిత వైద్య సేవల పథకాన్ని తేవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల వినతి మేరకు 2014 నవంబర్ ఒకటి నుంచి తెలంగాణ ప్రభుత్వం 'ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్' అమలులోకి తెచ్చింది. అనతికాలంలోనే దీనికి అక్రమాల జబ్బు సోకి మరుగున పడింది. దీంతో ఏడాది కాలంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కొన్ని ఆస్పత్రులు ఈహెచ్ఎస్ పథకం కింద వైద్య సేవలు అందించేందుకు నిరాకరిస్తున్నాయి దీనికి కారణం ఇప్పటికే ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు రూ. 350 కోట్ల వరకు చేరడమే. అందుకే, ప్రీమియం తో కూడిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ను అమలు చేయాలని ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

ఇందుకుగాను ప్రతి నెల మూల వేతనంలో రెండు శాతం వరకు ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నాయి. ఇది అమలు జరిగితే ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయులు, పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులకు సాంత్వన చేకూరుతుంది. వీరందరికీ ఆరోగ్య కార్డుల ద్వారా కార్పొరేట్‌స్థాయి ఉచిత వైద్యం అందించాలని కోరుతున్నారు. ప్రీమియం సొమ్ముతో ఒక ట్రస్టు ఏర్పాటు చేసి, ఐఏఎస్ అధికారిని బాధ్యుడిగా నియమించి ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు పరిస్తే, ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకొని ఉద్యోగులు, ఉపాధ్యాయులు రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహిస్తారు. నీతి నిజాయితీతో ప్రజలకు సేవ చేస్తారు.

అంకం నరేశ్

6301650324


Next Story