ఇదీ సంగతి:ధరల భారం.. అవినీతి బేరం

by Disha edit |
ఇదీ సంగతి:ధరల భారం.. అవినీతి బేరం
X

దేశంలో పేదరికం 80 శాతం పెరిగింది. 94.11 శాతం మంది ఆదాయం 10 వేల రూపాయల కన్నా తక్కువకు దిగజారింది. ధరల భారం దేశంలోని ప్రతి కుటుంబం పైనా అదనంగా 7,500 రూపాయల మేరకు పడింది. షేర్ బజార్ నుంచి 1,65,000 కోట్ల విదేశీ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ప్రజల ఆదాయం 2021లో 50 శాతం పడిపోతే, ఈ ఏడాది జనవరి వరకు 60 శాతం పడిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఆర్‌బీ‌ఐ అంచనా ప్రకారం 2034-35 వరకు కూడా అధిక ధరల పరిస్థితి మారే సూచనలు లేవు. బీజేపీ గద్దె దిగినా, దేశం ఆర్థిక పరిస్థితి గాడిలో పడడానికి మరో దశాబ్దం పట్టక తప్పదంటున్నారు ఆర్థిక నిపుణులు.

దేశం సిస్టంలో అవినీతి ఒక భాగం అయిపోయింది. అబద్ధాలు, అమలు కాని హామీలు రాజకీయాలలో ఎలా సహజం అయిపోయాయో, అవినీతి, అక్రమాలు, ఆశ్రిత పక్షపాతాలు కూడా నేతలకు సహజం అయిపోయాయి. అయిదేండ్లలో ప్రజాప్రతినిధుల ఆస్తులు ఐదు నుంచి పదింతలు పెరుగుతున్నాయి. ఆదాయానికి మించి సంపాదన 85 శాతం ప్రజా ప్రతినిధులలో స్పష్టంగా కనిపిస్తున్నది. అవినీతికి పాల్పడ్డారని పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ సాంగ్లీని తాజాగా సీఎం భగవంత్‌మాన్ కేబినెట్ నుంచి తొలగించారు. ఆయన మీద కేసు పెట్టి జైలుకు పంపారు.

అవినీతి నేతలుగా ముద్రపడిన ఇలాంటివారు తమ రాజకీయాలను కొనసాగిస్తూనే ఉంటారు. తమకున్న డబ్బు, హంగూ, ఆర్బాటంతో ఎన్నికలలో విజయం సాధిస్తూనే ఉంటారు. అవినీతి, అక్రమాలు, మితిమీరిన సంపాదన దేశ రాజకీయ నాయకులకు షరా మాములు అయిపోయాయి. 'ఎవరిని చూసినా ఏమున్నది గర్వకారణం?' అనే విధంగా ఉంది పరిస్థితి. ఫలానా రాజకీయ పార్టీలో ఫలానా నేత 'దూద్ కా ధులా హువా నేతా హై' అని చెప్పుకోవడానికి ఈ కాలంలో ఎవరూ లేరు. కానీ, వారి ఫొటోలకు మాత్రం కార్యకర్తలు పాలాభిషేకం చేస్తూనే ఉంటారు. పాల ధర కూడా ఆకాశాన్నంటిన మన దేశంలో ఇది కామన్ అయిపోయింది.

వారందరూ జైలులో ఉంటే

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అధికార, విపక్ష నేతలందరిదీ ఇదే పరిస్థితి. అందుకే, పాలకులు ఎక్కడ ఈడీ, సీబీఐ తదితర కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తారో అనే భయంతో నాయకులు వ్యవహారం నడుపుతుంటారు. 'పాము చావొద్దు-కర్ర విరగొద్దు' అనే తీరుగ వారి మాటలు ఉంటాయి. నిజానికి మనీ లాండరింగ్, లంచం, అక్రమాలు, ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన కేసులు ఉన్న వారంతా జైలులో ఉంటే, వారికి అయిదేండ్ల కన్నా ఎక్కువ శిక్షలు పడే అవకాశం ఉంటే ఈ దేశ రాజకీయాలు మారిపోయేవి. రాజకీయాలలో కొంతలో కొంత అయినా నిజాయితీపరుల ప్రవేశాన్ని మనం చూడగలిగేవారం. కానీ, అలా జరుగదు ఎందుకంటే విపక్ష నేతలు అయినా, అధికార నేతలు అయినా ఎవ్వరూ కేసులకు అతీతులు కారు కాబట్టి అంతా కలిసిమెలిసే ఉంటారు.

అధికారంలో ఉన్న పార్టీలో చేరితే కేసులన్నీ మాఫ్ లేదా పెండింగ్. బెంగాల్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బిహార్, గుజరాత్, గోవా, జమ్మూ-కాశ్మీర్, రాజస్థాన్, తమిళనాడు ఇలా దాదాపు 12 రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి ఉంది. బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం సభ్యులందరూ ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొంటున్నారు. తమిళనాడు దివంగత సీఎం జయలలిత కూడా కేసులు ఎదుర్కొన్నారు. డీఎంకే, ఏఐడీఎంకే, నేతలు, బీఎస్‌పీ నేత మాయావతి, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ నేత హుడా, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, మహారాష్ట్రలో శివసేన, కేంద్ర మాజీ మంత్రి శరద్‌పవార్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బంధువులు, పార్టీ నేతలు, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరైన్, ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఇలా చాలా మంది నేతల మీద కేసులు ఉన్నాయి.

ఎవరూ నీతిపరులు కాదు

అధికారంలో ఉన్నవారు తమని తాము నిజాయితీపరులుగా చెప్పుకోవడానికి అప్పుడప్పుడు విపక్షాల కేసులను బయటికి తీసి బెదిరిస్తుంటారు. ఇప్పుడు మంత్రులుగా ఇప్పుడు కొనసాగుతున్నవారి పేర్లు కూడా ఇందులో ఉంటాయి. అయితే, వారిని వారు కాపాడుకుంటారు. విపక్షాల మీద దీనిని ప్రయోగిస్తుంటారు. నిజానికి ఆరోపణలు లేనివారు 40 నుంచి 45 శాతం మాత్రమే ఉంటారు. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేని తనయుడు ఆశీష్ మీద రైతులను వాహనంతో ఢీకొట్టి చంపిన కేసు ఉంది. ఆశీష్ ఇప్పుడు జైలులోనే ఉన్నాడు. మహారాష్ట్రలోనూ మాలిక్ అనే మంత్రి జైలులోనే ఉన్నాడు. దీనికి తోడు 80-20 మందిర్, మస్జీద్ రాజకీయాలు అదనం. రెచ్చగొట్టే ఉపన్యాసాలు, లవ్ జిహాద్ పేరిట దాడులు ఇలా నేరాలలో భాగస్వాములుగా ఉండే నేతలకు కొదువ లేదు.

ప్రముఖ నేతల మీద 122 ఈడీ, 173 సీబీఐ కేసులు ఉన్నాయి. ఇందులో 71 మంది ఎమ్మెల్యేలు, 91 మంది ఎంపీలు ఉన్నారు. కొందరు మాజీ ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా ఉన్నారు. చాలా మంది రాజకీయ పార్టీ నేతల నెత్తి మీద తల్వార్ మాదిరి కేసులు వేలాడుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు మీద కోల్ స్కామ్ కేసు ఆయన మరణించే దాకా వేలాడింది. ఈ జాబితా చాంతాడంత ఉంది. రాసుకుంటూ పోతే డబుల్ ఇంటర్‌వెల్ ఇచ్చిన 'సంగం' సినిమా స్టోరీ అవుతుంది. అందుకే 'పాలిటిక్స్ ఈస్ ద స్కౌండ్రల్స్ గేమ్' అన్నాడో పెద్దమనిషి. వీరు దేశాన్ని ఎలా కాపాడుతారు? వీరేం దేశానికి దిశా నిర్దేశం చేస్తారు? ప్రశ్నించేవారిని, తప్పులను ఎత్తిచూపేవారిని, అన్యాయాన్ని అడ్డుకునేవారిని దేశద్రోహులంటున్నారు. రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛను జైలులో పెడుతున్నారు. ప్రజలను మోసం చేస్తున్న నేతలకు చరమ గీతం పాడాలి. అందుకు బుద్ధిజీవులు ముందుకు రావాలి.

పేదరికం భయంకరం

దేశంలో పేదరికం 80 శాతం పెరిగింది. 94.11 శాతం మంది ఆదాయం 10 వేల రూపాయల కన్నా తక్కువకు దిగజారింది. ధరల భారం దేశంలోని ప్రతి కుటుంబం పైనా అదనంగా 7,500 రూపాయల మేరకు పడింది. షేర్ బజార్ నుంచి 1,65,000 కోట్ల విదేశీ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ప్రజల ఆదాయం 2021లో 50 శాతం పడిపోతే, ఈ ఏడాది జనవరి వరకు 60 శాతం పడిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఆర్‌బీ‌ఐ అంచనా ప్రకారం 2034-35 వరకు కూడా అధిక ధరల పరిస్థితి మారే సూచనలు లేవు. అదానీ, అంబానీల మాదిరిగా ప్రజాప్రతినిధుల ఆస్తులు పెరిగాయి. బీజేపీ లాంటి పార్టీ లకు ఫండ్స్ పెరిగాయి. దేశం ఆర్థిక పరిస్థితి కుదేలయ్యింది. వాస్తవాలను కేంద్రం అంగీకరించే పరిస్థితి లేదు. బీజేపీ గద్దె దిగినా, దేశం ఆర్థిక పరిస్థితి గాడిలో పడడానికి మరో దశాబ్దం పట్టక తప్పదంటున్నారు ఆర్థిక నిపుణులు.

ఎండీ మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

99518 65223



Next Story