వారసత్వ కట్టడాల పరిరక్షణ మన బాధ్యత!

by Ravi |   (  Updated:2026-04-17 00:30:52  IST  )

ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని వారసత్వ కట్టడాల పరిరక్షించడంలో యువత పాత్ర, పర్యాటకాభివృద్ధి, సి.ఎస్.ఆర్ నిధుల అవసరం వంటి కీలక అంశాలపై విశ్లేషణ..

వారసత్వ కట్టడాల పరిరక్షణ మన బాధ్యత!
X

భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వానికి నిలయం. ఆ వారసత్వాన్ని కాపాడటం మనందరి బాధ్యత. 2024 నాటికి దేశంలో యునెస్కో వారసత్వ ప్రదేశాలు 43 ఉన్నాయి. తెలంగాణ నుంచి రామప్ప దేవాలయం ఈ జాబితాలో ఉంది. అలాగే రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ వారసత్వ ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. ముఖ్యంగా సుమారు 75 కోటలు, కాకతీయుల కాలంలో నిర్మించిన అపూర్వ దేవాలయాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఈ వారసత్వ కట్టడాలను పరిరక్షించడానికి హెరిటేజ్ డిపార్ట్‌ మెంట్ పనిచేస్తోంది. అయితే తగిన నిధులు, సిబ్బంది లేకపోవడం వల్ల లక్ష్యాలను పూర్తిగా సాధించలేకపోతున్నారు.. ఇటీవల ప్రొఫెసర్ అర్జునరావు నాయకత్వంలో డాక్యుమెంటేషన్, అన్వేషణ కోసం ఎన్జీవోలతో కలిసి చర్యలు చేపట్టారు. అలాగే సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జాతీయ స్థాయి సదస్సులు నిర్వహిస్తూ పరిరక్షణకు కృషి చేస్తోంది. ఇక తెలంగాణ పర్యాటక శాఖలోని ఓ అధికారి విద్యార్థులకు ఉచితంగా 1-4 రోజుల పాటు సాంస్కృతిక పర్యటనలు ఏర్పాటు చేసి, వారిని చరిత్ర రాయబారులుగా తీర్చిదిద్దే పథకాన్ని రూపొందించింది. కొన్ని కారణాల వల్ల అది నిలిచిపోయింది. రాష్ట్రంలో పర్యాటకులను ఆకర్షించడానికి సర్వేలు నిర్వహించడం, సాంకేతిక సదుపాయాలు కల్పించడం, బ్రాండింగ్ చేయడం అవసరం. ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహించడం ద్వారా ఆదాయం పెరుగుతుంది. మన వారసత్వాన్ని కాపాడటంలో విద్యార్థులు, యువత ముందుండాలి. ప్రజాప్రతినిధులను చైతన్యపరచాలి. సి.ఎస్.ఆర్ నిధులు, ప్రభుత్వ ప్రోత్సాహం పెరిగితే ఈ కట్టడాలు భావితరాలకు నిలిచిపోతాయి.

(రేపు ప్రపంచ వారసత్వ దినోత్సవం)

-కె.రంగారావు

98492 70575

Next Story