తెలంగాణలో....ముందస్తు ఎన్నికలు.... నిజమెంత?

by Disha edit |
తెలంగాణలో....ముందస్తు ఎన్నికలు.... నిజమెంత?
X

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై మరోసారి చర్చ మొదలైంది. ఈసారి ముందస్తుకు వెళ్లేది లేదని కేసీఆర్ బల్లగుద్ది మరీ చెప్పుకొచ్చినప్పటికీ ముందస్తు ఎన్నికల ప్రచార ఘోష మాత్రం ఆగడం లేదు. సీఆర్‌ ప్రభుత్వం ఇంకా ఉండేది మూడు నెలలే అంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన ప్రకటన ఊహాగానాలకు మరింతగా తెరతీసింది. ప్రతి ఏడాది మార్చిలోనే బడ్జెట్ సమావేశాలు ఉంటాయని, ఈ సారి ఫిబ్రవరిలోనే పెట్టడం వెనుక ముందస్తు ఎన్నికల వ్యూహం ఉందని, బడ్జెట్ సమావేశాల ముగింపు తర్వాత మంచి ముహూర్తం చూసుకొని అసెంబ్లీని రద్దు చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తెలంగాణ ఎన్నికలను కూడా మరో ఆరు నెలల నుంచి ఏడాది పాటు పొడిగించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంది. ఆ క్లాజ్‌ను ఉపయోగించి తెలంగాణ ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలతో పాటు నిర్వహిస్తారేమోనని బిఆర్ఎస్ పార్టీ అధినేతలు అనుమానిస్తున్నారు. అందులో భాగంగా ముందే అసెంబ్లీని రద్దు చేసి, ఏప్రిల్-మే నెలలో జరిగే కర్ణాటకతో పాటు ఎన్నికలకు వెళ్లే అవకాశాల గురించి తర్జన భర్జనలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాబట్టి సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర ముందుగానే అసెంబ్లీని రద్దు చేస్తే బంతి తమ కోర్టులోనే ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.

తెలుగు రాష్ట్రాలలో ముందస్తు ఎన్నికల ప్రచారం మరోసారి జోరందుకుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై మరోసారి చర్చ మొదలైంది. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి రెండోసారి అధికారం చేజిక్కించుకున్నారు. ఈసారి ముందస్తుకు వెళ్లేది లేదని కేసీఆర్ బల్ల గుద్ది మరీ చెప్పుకొచ్చినప్పటికీ ముందస్తు ఎన్నికల ప్రచార ఘోష మాత్రం ఆగడం లేదు. కేసీఆర్ వ్యూహాలు ఎప్పుడూ షాకింగ్ గానే ఉంటాయని... పైకి ఒకటి చెప్పి లోలోపల తన వ్యూహం ప్రకారం నడుచుకుంటారనే అనుమానం అందరిలోను ఉంది. కేసీఆర్‌ ప్రభుత్వం ఇంకా ఉండేది మూడు నెలలే అంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన ప్రకటన ఊహాగానాలకు మరింతగా తెరతీసింది.

ప్రతిపక్షాల అంచనాలు, అందుకు అనుగుణంగా వాళ్ల సన్నద్ధత ఎలా ఉన్నప్పటికీ, అసలు కేసీఆర్ మదిలో ఏముందన్నదే వేల మిలియన్ డాలర్ల ప్రశ్న? ముందస్తు ఎన్నికల కోసమే ఇటీవల కేసీఆర్ పరిపాలనా పరమైన కార్యక్రమాల్లో వేగం పెంచారని... భారీ స్థాయిలో కంటి వెలుగు పథకం... నాలుగేళ్ల తర్వాత టీచర్ల బదిలీలు, టీచర్ల ప్రమోషన్లు... ఫిబ్రవరి 17న నూతన సచివాలయ ప్రారంభోత్సవం. జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాల ప్రారంభాలు... వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు... తదితర కార్యక్రమాలన్నీ ముందస్తు ఎన్నికల కోసమేననే టాక్ వినిపిస్తోంది. ఇలాంటి కార్యక్రమాలతో ఎలక్షన్ యుద్ధంలో అనుకూల వాతావరణం సృష్టిస్తున్నారనే చర్చ నడుస్తోంది. ప్రతి ఏడాది మార్చిలోనే బడ్జెట్ సమావేశాలు ఉంటాయని, ఈ సారి ఫిబ్రవరిలోనే పెట్టడం వెనుక ముందస్తు ఎన్నికల వ్యూహం ఉందని, బడ్జెట్ సమావేశాల ముగింపు తర్వాత మంచి ముహూర్తం చూసుకొని అసెంబ్లీని రద్దు చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

కేసీఆర్ ప్రణాళికలు అనూహ్యం

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా వద్దా అనేది సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేస్తే రెండు, మూడు నెలల్లో ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఒక వేళ రద్దు చేయకపోయినా నవంబర్- డిసెంబర్‌లో జరుగుతాయి. అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడానికి మరోసారి ముందే ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.. ఒకవేళ అదే నిజమైతే కేసీఆర్ అన్ని రకాల సన్నాహాలు పూర్తి చేసుకుని సిద్ధమై ఉంటారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ముందు కేసీఆర్ అభ్యర్థులపై కూడా కసరత్తు పూర్తి చేసుకుని వ్యూహం ప్రకారం రంగంలోకి దిగి ఎక్కడా వెనుతిరిగి చూడకుండా . రెండోసారి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు.. ఈ సారి కూడా ముందస్తుకు వెళ్లాలనుకుంటే.. అంతకంటే మించిన భారీ ప్రణాళిక ప్రకారం ముందుస్తుకు వెళ్తారు. అందులో ఎలాంటి ధర్మ సందేహాలు ఉండవు... పైగా విపక్షాలు పూర్తిగా బలం కూడగట్టుకోకముందే.. ఎన్నికల సమరానికి శంఖారావం పూరించాలన్నది కేసీఆర్ వ్యూహంగా ఉంటున్నదని విశ్లేషకులు, ప్రతిపక్ష పార్టీల అంచనా.

ప్రతిపక్ష పార్టీలు సిద్ధమేనా?

ఎన్నికల రణరంగంలో యుద్ధ నీతిని ముందుగానే రెడీ చేసుకుని యుద్ధానికి దిగడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య...కానీ.. విపక్షాలు మాత్రం సిద్ధంగా ఉన్నాయా లేవా ఆలోచించాల్సిన విషయమే. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న రెండు పార్టీలు జాతీయ పార్టీలే కావటం. వాటి అధినాయకత్వం ఢిల్లీలో ఉండటం, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా అక్కడి నుంచే తీసుకోవాల్సిన అవసరం వుంటున్నది. అందుకే బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ తీసుకున్నంత చురుకుగా,వేగంగా జాతీయ పార్టీలు నిర్ణయాలు తీసుకోలేక పోతున్నాయి.. నిజం చెప్పాలంటే.. ముందస్తుగా కసరత్తులు కూడా చేసుకోలేని పరిస్థితీ. ప్రస్తుతం అపర చాణక్యుడు కేసీఆర్ స్థాయిలో ఎన్నికల యుద్ధాన్ని ప్రారంభించలేని పరిస్థితి మాత్రం ఉంటోంది. ప్రతిపక్షాలలో కనిపిస్తున్న నగ్నసత్యమిది.

కాంగ్రెస్ సిద్ధమవదా?

కాంగ్రెస్ పార్టీకి ముందస్తు ఎన్నికలు వచ్చినా... సమయానికే ఎన్నికలు వచ్చినా ముందస్తు కసరత్తులు కనపడవు. ఎన్నికల తేదీలు.. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కూడా అభ్యర్ధుల వడబోతలు జరుగుతూనే ఉంటాయి.. నిజం చెప్పాలంటే.. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే వరకు టిక్కెట్ల లొల్లి జరుగుతూనే ఉంటుంది... ఇలాంటి నేపథ్యమున్న కాంగ్రెస్ పార్టీలో ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకపోయినా పెద్దగా మార్పేమీ ఉండవు. కాని ఈ సారి కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డి నాయకత్వం వహించడంతో పార్టీ నేతల్లో పెద్ద ఎత్తున విశ్వాసంతో పాటు జోడో యాత్రల వస్తున్న పాజిటివ్ వేవ్‌తో ముందస్తు ఎన్నికలకు సిద్ధమని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. సీనియర్ల సహాయ నిరాకరణను కాదని ఒంటరి పోరు చేస్తూనే వారం రోజుల కిందటే రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర ప్రారంభించారు. ఇప్పటికిప్పుడు ముందస్తు ఎన్నికలు వస్తే సీనియర్ల సహాయ నిరాకరణ, అంతర్గత కోవర్టుల మోసాలను, గెలిపిస్తే పార్టీ మారుతారనే అపవాదుల నుంచీ ఎన్నికలను ఎదుర్కోవటం అంతా ఆషామాషీ కానే కాదు..

నియోజకవర్గాల్లోనే బీజేపీ ..

ఇక అధికారంలోకి వచ్చేస్తున్నామని ప్రకటనలు చేస్తున్న బీజేపీ నేతలకు కొన్ని నియోజకవర్గాల్లో సెంటిమెంట్, కార్యకర్తల బలమున్నప్పటికి , 18 నుంచి 35 ఏళ్ల మెజారిటీ యువత బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. చాలా నియోజకవర్గాల్లో పేరున్న అభ్యర్థులు లేకపోవడం, గట్టి పట్టున్న నియోజక వర్గాల్లో చాలామంది పోటీలో ఉండటం కచ్చితంగా మైనస్ పాయింటే. స్థానికంగా పేరున్న తటస్తులు, మేధావులు, సామాజిక ఉద్యమకారులను పట్టించుకోక పోవటం, వాళ్ళు చేరితే భవిష్యత్తులో తమకు సీట్లు రావనే భయం, గతంలో జరిగిన చేరికలు, అనుభవాలు కూడ కొత్త చేరికలకు అడ్డు వస్తుందనే అపవాదు ఉంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధమేనని బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నప్పటికీ, గ్రౌండ్‌లో మాత్రం స్వంతంగా మెజారిటీ వచ్చే అవకాశాలు తక్కువే. కానైతే కేంద్రంలోని పెద్దల వ్యూహాలు తమను గట్టెక్కిస్తాయని రాష్ట్ర బీజేపీ ఆశిస్తుంది.

ప్రభుత్వంపై వ్యతిరేకత...

గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే నాటికి సీఎం కేసీఆర్ నాడు ఇచ్చిన హామీలను దాదాపుగా పూర్తి చేశారు. కొత్తగా రైతు బంధు ప్రకటించి.. మంచి మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చారు... రెండోసారి ఇచ్చిన కొన్ని హామీలు అమలు కాలేదన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా రూ. లక్ష రైతు రుణమాఫీ పూర్తి కాలేదని... నిరుద్యోగ భృతి ఊసేలేదని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ ఆశించిన స్థాయిలో సాగడం లేదని... సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందలేదని, నిరుద్యోగ యువత కేవలం నోటిఫికేషన్లతో శాంతించే పరిస్థితి లేదనే విమర్శలు వస్తున్నాయి. గిరిజన బంధు కూడా ఇస్తామని ఆశలు కల్పించిన సర్కార్.. ఆ దిశగా బడ్జెట్‌లో ఎలాంటి కసరత్తు లేని నేపథ్యంలో అబ్బురపరిచే సరికొత్త పథకంతో ముందస్తుకు వెళ్ళినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకుల టాక్..

కేసీఆర్ స్ట్రాటజీ ఏమిటి ?

ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ముందస్తు ఎన్నికలకు అనుమతి విషయమై ఎన్నికల కమిషన్‌కి స్వేచ్ఛ ఉది. అయితే బీజేపీకి బిఆర్ఎస్ఎస్‌కి చెడిన సంబంధాల మూలంగా కేంద్రం అడ్డుపుల్ల వేయవచ్చని, వాస్తవంగా నవంబర్ - డిసెంబర్‌లలో తెలంగాణలో ఎన్నికలు జరగాల్సి ఉండగా,.. అప్పటి వరకూ వెయిట్ చేస్తే షెడ్యూల్ ప్రకారం ఎన్నికల సంఘం నిర్వహించలేదేమోనన్న అనుమానం కేసీఆర్ లో బలంగా ఉంది. డిసెంబర్ వరకూ వెయిట్ చేస్తే బంతి కేంద్రం కోర్టులో పడుతుంది, ఎందుకంటే పార్లమెంట్ కు 2024 ఏప్రిల్ - మేలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి తెలంగాణ ఎన్నికలను కూడా మరో ఆరు నెలల నుంచి ఏడాది పాటు పొడిగించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంది.

ఆ క్లాజ్‌ను ఉపయోగించి తెలంగాణ ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలతో పాటు నిర్వహిస్తారేమోనని బీఆర్ఎస్ పార్టీ అధినేతలు అనుమానిస్తున్నారు. అందులో భాగంగా ముందే అసెంబ్లీని రద్దు చేసి, ఏప్రిల్- మే నెలలో జరిగే కర్ణాటకతో పాటు ఎన్నికలకు వెళ్లే అవకాశాల గురించి తర్జన భర్జనలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాబట్టి సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర ముందుగానే అసెంబ్లీని రద్దు చేస్తే బంతి తమ కోర్టులోనే ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఒక వేళ అంతర్గతంగా కేంద్రంతో సఖ్యత కుదిరితే ముందస్తుకు పోవడం ఖాయం.. ఏది ఏమైనా మరోసారి మొదలైన ముందస్తు ముచ్చట్లు గతంలో మాదిరిగా కొన్నిరోజులకి సైలెంట్ అవుతాయా ? లేక ఊహాగానాలు మరింత బలపడేలా రాష్ట్ర అధినేతలు అడుగులు వేస్తారా? అన్నది కొద్దిరోజుల్లోనే కచ్ఛితంగా తెలియబోతోంది !

డా. బి. కేశవులు నేత. ఎండి

చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం.

స్టేట్ యాంటీ కరప్షన్ ఫోరమ్.

85010 61659

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672


Next Story

Most Viewed