పీఆర్సీ - డీఏ విలీనం.. ఉద్యోగులకు నష్టమే!

by Ravi |   (  Updated:2026-05-17 00:45:42  IST  )

తెలంగాణ 2వ పీఆర్సీ, డీఏ విలీనం ఉద్యోగులకు నిజంగా లాభమా? బేస్ ఇయర్, ఫిట్మెంట్, లింకింగ్ ఫ్యాక్టర్, పెండింగ్ డీఏ బకాయిల ప్రభావంపై విశ్లేషణాత్మక కథనం. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ ప్రయోజనాలపై పూర్తి వివరాలు.

పీఆర్సీ - డీఏ విలీనం.. ఉద్యోగులకు నష్టమే!
X

క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ ఆశయాలను అమలు చేస్తూ, పగలు రేయి శ్రమిస్తున్న ఉద్యోగులు ఈ పరిపాలనా యంత్రాంగానికి వెన్నెముక వంటివారు. ఉద్యోగుల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలను కేవలం ఆర్థిక భారంగా చూడటం అంటే, అది ఒక వర్గానికి చేసే అన్యాయం మాత్రమే కాదు, మొత్తం పరిపాలనా వ్యవస్థనే నిర్వీర్యం చేయడమే అవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన 2వ పీఆర్సీ (PRC), డీఏ (DA) విలీన ప్రక్రియపై శాస్త్రీయ విశ్లేషణ అవసరం.

డీఏ విలీనం ఒక ఆర్థిక వ్యూహం?

తెలంగాణలో 2వ పీఆర్సీ అమలు తేదీ జులై 1, 2023. నిబంధనల ప్రకారం ఆ తేదీ నాటికి ఉన్న 33.67% డీఏను మాత్రమే బేసిక్ పేలో విలీనం చేయాలి. కానీ, ప్రభుత్వం రాబోయే 5 పెండింగ్ డీఏలను (సుమారు 12.74%) కూడా కలిపి మొత్తం 46.41% డీఏను బేసిక్ పేలో విలీనం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది పైకి జీతం పెరిగినట్లు కనిపించినా, లోతుగా పరిశీలిస్తే ఉద్యోగులకు శాపంగా మారే ప్రమాదం ఉంది. ఇలా పెండింగ్ డీఏలను విలీనం చేయడం వల్ల ఉద్యోగికి రావాల్సిన భారీ ‘బకాయిలు’ (Arrears) నగదు రూపంలో అందవు. దీనివల్ల ఉద్యోగి తక్షణ ఆర్థిక వెసులుబాటును కోల్పోతాడు. అంతేకాకుండా, పీఆర్సీ అమలు తేదీ తర్వాత వచ్చే డీఏలను ముందే విలీనం చేయడం సర్వీస్ రూల్స్‌కు విరుద్ధం.

బేస్ ఇయర్ - గణాంకాల మాయాజాలం

ద్రవ్యోల్బణాన్ని, నిత్యావసర ధరల పెరుగుదలను కొలిచే ప్రాతి పదిక ‘బేస్ ఇయర్’. కేంద్రం ఇప్పటికే 2016ను ప్రాతిపదికగా తీసుకుని వేతన సవరణలు చేస్తోంది. కానీ మన రాష్ట్రంలో ఇంకా పాత 2001 బేస్ ఇయర్‌ను ప్రామాణికంగా తీసుకుంటే ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుంది. 2001 నాటి లెక్కల్లో కేవలం ఆహార పదార్థాలకే ఎక్కువ వెయిటేజీ ఉంది. కానీ నేటి ఆధునిక జీవనంలో విద్య, వైద్యం, రవాణా ఖర్చులు 30% పైగా పెరిగాయి. పాత బేస్ ఇయర్‌ను వాడటం అంటే, పెరిగిన ఈ ఆధునిక ఖర్చులను ప్రభుత్వం లెక్కలోకి తీసుకోనట్లే. ఫలితంగా ప్రకటించే ‘ఫిట్మెంట్’ ఎంత ఉన్నా, వాస్తవ ‘కొనుగోలు శక్తి’ పెరగదు.

లింకింగ్ ఫ్యాక్టర్, రిటైర్మెంట్ ప్రయోజనాలు..

విలీన ప్రక్రియలో ‘లింకింగ్ ఫ్యాక్టర్’ను (ప్రస్తుతం 2.88) శాస్త్రీయంగా నిర్ణయించకపోతే, కొత్త వేతన స్కేళ్లలో ఉద్యోగి పొందే ‘రియల్ వేతనం’ ప్రస్తుత ధరల కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. దీని ప్రభావం కేవలం నెలవారీ జీతంపైనే కాదు, రిటైర్మెంట్ ప్రయోజనాలపై తీవ్రంగా ఉంటుంది. గ్రాట్యుటీ, కమ్యుటేషన్, పెన్షన్ లెక్కలు అన్నీ మూల వేతనం (Basic Pay) పైనే ఆధారపడి ఉంటాయి. బేసిక్ పే పెరుగుదల శాస్త్రీయంగా లేకపోతే, పదవీ విరమణ సమయంలో వచ్చే లక్షలాది రూపాయల ప్రయోజనాలు ఆవిరైపోతాయి. ఇది ఉద్యోగి వృద్ధాప్య భద్రతను ప్రశ్నార్థకం చేస్తుంది.

ముగింపు - పరిష్కార మార్గాలు..

ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి తక్షణమే కొన్ని చర్యలు చేపట్టాలి. కచ్చితమైన ద్రవ్యోల్బణ అంచనా కోసం 2016 బేస్ ఇయర్‌ను ప్రామాణికంగా తీసుకోవాలి. పెరిగిన ధరలకు, ఉద్యోగుల పనిభారానికి అనుగుణంగా గౌరవప్రదమైన ఫిట్మెంట్ ప్రకటించాలి. 2023 జులై 1 నాటి డీఏను మాత్రమే విలీనం చేసి, మిగిలిన 5 పెండింగ్ డీఏలను బకాయిలుగా విడుదల చేయాలి. ఇక ప్రభుత్వం తన ఉద్యోగులను కేవలం ఒక ‘ఖర్చు’గా కాకుండా, సంక్షేమ రాజ్య స్థాపనలో భాగస్వాములైన ‘పెట్టుబడి’గా చూడాలి. ఉద్యోగి ఆర్థికంగా సంతృప్తిగా ఉన్నప్పుడే పరిపాలన పారదర్శకంగా, వేగంగా సాగుతుంది. రథ చక్రాలు బలంగా ఉంటేనే అభివృద్ధి రథం ముందుకు సాగుతుంది.

-కృష్ణ మోహన్ కోల

రిటైర్డ్ ప్రభుత్వ అధికారి

Next Story