స్నేహం చిగురించింది.. ఆకు చాటు కమలం!

by Ravi |   (  Updated:2025-04-23 00:45:28  IST  )

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి

స్నేహం చిగురించింది.. ఆకు చాటు కమలం!
X

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రకటన తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీ పోరు నష్టం పొందు లాభం అన్న నానుడిని అర్థం చేసుకుందో లేదా అనువుగాని చోట అధికులమనరాదు అన్న తత్వం బోధపడిందో కానీ. కొండ అద్దమందు కొంచెమై ఉన్నా సర్దుకు పోదాం అన్న ధోరణితో దక్షిణాదిన బలో పేతం కావాలన్న సంకల్పంతో బీజేపీ ఆకు చాటు కమలమై పరిమళించాలని ప్యూహం పన్నుతోంది. శాశ్వత మిత్రత్వం శాశ్వత శత్రుత్వం ఉండవని మరోసారి ఈ పొత్తు నిరూపించింది.

బెడిసికొట్టిన ఎడబాటు

2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత సత్సంబంధాల ఆవశ్యకత స్పష్టమైంది. 2019 సార్వత్రిక, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో ఉన్న అన్నాడీఎంకే, బీజేపీలు 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు విడిపోయాయి. ముస్లిం, క్రైస్తవ ఓటర్లలో గణనీయమైన వర్గాల మద్దతును తిరిగి పొందాలనే ఆశతో, ఏఐఏడీఎంకే ఒంటరిగా ఓటర్లను ఎదుర్కోవాలని ఎంచుకుంది. అయితే, ఫలితం నిరాశపరిచింది. డీఎంకే నేతృత్వంలోని కూటమి తమిళనాడులోని 39 సీట్లనూ కైవసం చేసుకుంది, ఏఐఏడీఎంకే, బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణాలు విడివిడిగా పోటీ చేసి, కనీసం 13 నియోజకవర్గాల్లో ఓట్లను చీల్చాయి, ఒకరి అవకాశాలను మరొకటి దెబ్బతీసుకున్నాయి. దారు ణంగా, ఏఐఏడీఎంకే ఏడు నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయే అవమానాన్ని చవిచూసింది. గత 47 సంవత్సరాలలో 30 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన పార్టీకి ఇది చారిత్రాత్మక కనిష్ట స్థాయి.

తిరిగి సయోధ్య వైపు

లెక్కలకు అతీతంగా, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు క్రమంగా అన్నాడీఎంకే, బీజేపీలను సయోధ్య వైపు నెట్టాయి. డీఎంకే నేతృత్వంలోని సంకీర్ణం స్థిరంగా కనిపిస్తోంది. ఆ పార్టీలపై అంతర్గత అల్లకల్లోలంపై స్పష్టమైన సంకేతాలు లేవు. ఇంతలో నటుడు విజయ్ కొత్తగా ప్రారంభించిన తమిళ వెట్రీ కజగం, సీమాన్ నామ్ తమిళర్ కట్చి అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి ఎటువంటి మొగ్గు చూపలేదు, ఈ సందర్భంలో, అన్నాడీఎంకే, బీజేపీ రెండూ తమ భాగస్వామ్యంపై వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నాయి. అన్నాడీఎంకేకు, అధికారాన్ని తిరిగి పొందడం తక్షణ లక్ష్యం. బీజేపీకి, అన్నాడీఎంకేతో పొత్తు తమిళనాడులో తన స్వతంత్ర ఉనికిని పరిమితంగా ఉంచుకోవడానికి అత్యంత ఆచరణీయమైన మార్గంగా మిగిలిపోయింది. అయితే, అవసరానికి అనుగుణంగా ఏర్పడిన పొత్తులు ప్రజా సంక్షేమంపై దృష్టి సారించిన విధానాలకు అరుదుగా దారితీస్తాయి. ప్రజా విశ్వాసాన్ని పెంచడానికి రెండు పార్టీలు ఇంకా చాలా చేయాల్సి ఉంది.

పొత్తు లాభాలపై కొత్త లెక్కలు..

ప్రస్తుత ప్రభుత్వ విధానాలు కేంద్రంతో ఘర్షణ వైఖరి జనాభా మార్పుల ఆధారంగా లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి నిర్ణయించడం, డీలిమిటేషన్ ఇప్పుడు తమిళనాడు, దక్షిణ భారతదేశం అంతటా ఒక ప్రధాన రాజకీయ వివాదానికి కేంద్రంగా ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో అన్నాడీఎంకే బీజేపీ పొత్తు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి. వినూత్నంగా విలక్షణంగా ఆలోచించే సగటు తమిళ ఓటర్ నిర్ణయం ఏ రాజకీయ పక్షాన్ని కంచికి చేరుస్తుందో ఏ రాజకీయ పక్షానికి అధికారమిస్తుందో చూడాలి. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ఏర్పాటు ఎలా ఉభయ తారకమైందో అదే రీతిన తమిళనాట పునరావృతం కావాలన్నది ద్విదళంతో పొత్తు పెట్టుకున్న కమలదళం ఆశ, ఆశయం కూడా.

- సుధాకర్

99898 55445

Next Story