యూరియాతో రాజకీయమా?

by Ravi |   (  Updated:2025-08-24 00:30:32  IST  )

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా కొరతతో ప్రతి పక్షాలకు అధికార పక్షానికి మాటల యుద్ధం మొదలైంది. రైతుల

యూరియాతో రాజకీయమా?
X

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా కొరతతో ప్రతి పక్షాలకు అధికార పక్షానికి మాటల యుద్ధం మొదలైంది. రైతుల ఇబ్బందులను కూడా రాజకీయానికి ముడిపెట్టి రాజకీయ నాయకులు వారి స్వలాభం ఉపయోగిస్తున్నారు. ఏ పంటకైనా యూరియా సరైన సమయంలో అందకపోతే పంట దిగుబడి తగ్గుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వ్యవసాయాధారితమైన భారతదేశంలో పంటలకు అనుగుణంగా ఏ పరిస్థితులలో ఏ ఎరువులు కావాలో రైతులకు ప్రభుత్వాలు అందించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా యూరియా విషయంలో జరుగుతుంది. రైతులు యూరియా కోసం క్యూ లైన్‌లలో చెప్పులు పెట్టి మరి యూరియా తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నవి. ఈ కొరతతో ప్రైవేట్ మార్కెట్‌లో యూరియా ధర ప్రభుత్వం ప్రకటించిన దాని కన్నా ఎక్కువ చేసి విక్రయిస్తున్నారు. దీనిని అధిగమించే దిశగా కేంద్ర ప్రభుత్వం నానో యూరియా లిక్విడ్‌ను ప్రవేశపెట్టింది. కానీ రైతులు నానో యూరియా వైపు మొగ్గుచూపడం లేదు. నానో యూరియాను స్ప్రే చేయాల్సి ఉండగా రైతులు స్ప్రే చేయడానికి ఖర్చు అధికమవుతుందని అందువలన దానిని వినియోగించడం లేదని తెలుస్తోంది. ఈ యూరియా కొరతతో రాష్ట్రంలో రాజకీయాలు మొదలయ్యాయి. అధికార పక్షం, ప్రతిపక్షాలలో యూరియా రాజకీయాలు నడుస్తున్నాయి. ఓ వైపు యూరియా సరఫరా బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అని, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రానికి యూరియా సరఫరా కావడం లేదని రాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగానే విమర్శలు చేస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి ఎంత అవసరమో.. అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం కావాలని యూరియా కొరత సృష్టిస్తోందని విమర్శిస్తోంది. మధ్యలో బీఆర్ఎస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల సంక్షేమం గురించి పట్టింపు లేదని విమర్శిస్తోంది. ఏది ఏమైనా ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పంటకు యూరియా వేసే సమయం దాటిపోతే పంట దిగుబడి చాలా తగ్గుతుంది. అందుకే రైతులందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో యూరియా అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

- సింగిరెడ్డి అశోక్ రెడ్డి

76618 01107

Next Story