- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేనేత సొసైటీలతో రాజకీయ శిక్షణ!
రాష్ట్రంలో టెస్కో ఉందా? లేదా? హ్యాండ్లూమ్, పవర్ లూం కార్పొరేషన్లు పని చేస్తున్నాయా? ఈ ప్రశ్నలు ప్రతి చేనేత

రాష్ట్రంలో టెస్కో ఉందా? లేదా? హ్యాండ్లూమ్, పవర్ లూం కార్పొరేషన్లు పని చేస్తున్నాయా? ఈ ప్రశ్నలు ప్రతి చేనేత, నేత కార్మికులు, మాస్టర్ వీవర్లలో వినిపిస్తున్నాయి. చేనేత సహకార సంఘాల పదవీకాలం 2018 ఫిబ్రవరి నెలలో ముగిసింది. అప్పటి నుంచి ప్రభుత్వాలు ఎన్నికలు ఎందుకు జరుపలేదు? కొత్త పాలక మండళ్ల ఏర్పాటుకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? సహకార రంగ వ్యవస్థ పట్ల గత ప్రభుత్వం ఎందుకు ఇష్టపడటం లేదు?
సొసైటీలకు చైర్మన్లు, ఆప్కోకు డైరెక్టర్లు లేకుండానే కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పుడేమో ఆ సొసైటీలు ఉన్నట్లా? లేనట్లా? అంతు చిక్కడం లేదు. చేనేత, నేత సహకార సొసైటీల అవసరం ఉన్నదా? లేదా? లేకపోతే మాత్రం భవిష్యత్తులో పద్మశాలి వర్గీయులకు సొసైటీ పదవులు కూడా దక్కే అవకాశం లేకుండా పోతున్నది.
కార్పొరేషన్ల ఉనికి కనిపించదేం?
రెండు కార్పొరేషన్ల పేరిట ఇద్దరు రాజకీయ నాయకులకు పదవులను కట్టబెట్టేందుకు వ్యూహరచన చేసినా.. అది ఎందుకో గానీ ఆశించిన స్థాయిలో ఉనికిని సాధించలేదు. ఆ కార్పొరేషన్లు ఉన్నాయని గుర్తించడమే కష్టమవుతున్నది. సహకార సంఘా లకు పని కల్పించడం, వారి నుంచి వస్త్రాలను కొనుగోలు చేసేందుకు టెస్కో ఉన్నది. కానీ తెలంగాణ హ్యాండ్లూం కార్పొరేషన్, పవర్ లూం కార్పొరేషన్ చైర్మన్లుగా కొంత కాలం పని చేసిన నాయకులు ఏం సాధించారు? కార్మికులకేమైనా మేలు చేశారా? కనీసం వారు పద్మశాలి, చేనేత, నేత కార్మిక సంఘాల నాయకులు, నిపుణులతో చర్చించిన దాఖలాలు లేవు. ఈ సొసైటీలు కార్మికులకు ఎంత వరకు పని కల్పించినా, ఎంత ఆర్థిక స్వావలంబన సాధించినా.. ఆ సొసైటీ ఎన్నికల ద్వారా మాత్రం పద్మశాలీయులకు రాజకీయ శిక్షణ నిస్తుంది. తక్కువ స్థాయిలో ఓటర్లకు జరిపే ఎన్నికల్లో పోటీ, పోల్ మేనేజ్మెంట్, ప్రచారం, పదవీ బాధ్యతల నిర్వహణ వంటి అంశాల్లో రాణించేందుకు ఉపయోగపడుతుంది. అది ఎనిమిదేండ్ల నుంచి లేకపోవడం వల్ల రానున్న రోజుల్లో ఈ వర్గం నుంచి నాయకత్వ లక్షణాలను అలవర్చుకునేందుకు మార్గాలు తక్కువే. స్థానిక సంస్థలు, శాసనసభ, లోక్‌సభ వంటి ఎన్నికల్లో పోటీ చేసేంత శక్తి కలిగిన నాయకుల సంఖ్య పద్మశాలీయుల్లో అతి తక్కువ. అందుకే సొసైటీ ఎన్నికల ద్వారా జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగిన వారెందరో ఉన్నారు.
సొసైటీలపై వివక్ష
రాష్ట్రంలో మత్స్యకార, వ్యవసాయ పరపతి సహకార సంఘాలు పని చేస్తున్నాయి. అవన్నీ కొనసాగుతున్నప్పుడు చేనేత/నేత కార్మిక సహకార సొసైటీలపైనే ఎందుకు చిన్న చూపు చూస్తున్నారనేది అర్థం కాని అంశం. రాజకీయంగా, ఆర్థికంగా బలంగా లేని పద్మశాలి వర్గాన్ని మరింత నిర్వీర్యమవుతున్నది. సహకార వ్యవస్థతో ఉపాధి అవకాశాలు లేవనుకుంటే, ఆర్థిక పురోగతి లేదనుకుంటే.. అన్ని సొసైటీలను రద్దు చేయాలి కదా! అన్ని రాజకీయ పార్టీలు కేవలం చేనేత సామా జిక వర్గం పట్ల ఎందుకు వివక్షను చూపిస్తున్నాయి. 2018 నుండి ఇప్పటి దాకా ఎన్నికలు జరపకుండా కాలయాపన చేస్తున్నారు. దానికి తోడు టెస్కోను, సొసైటీలను కార్పొరేషన్లలో విలీనం చేసేందుకు అధికారులు విఫలయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. దీనిపై సొసైటీ అధ్య క్షులు, ఆప్కో డైరెక్టర్లుగా పని చేసిన వారితో కనీసం ఐఏఎస్ అధికారులు కూడా చర్చించడం లేదు.
కార్పొరేషన్లతో లాభమెవరికి?
2018 ఏప్రిల్17న టెస్కో మనుగడలో ఉండగానే కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. సుదీర్ఘ కాలంగా సొసైటీలు, డైరెక్టర్లు, పాలక వర్గాలతో కళకళలాడిన సంస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ఏ ప్రాతిపదికన, ఎలాంటి ప్రయోజనాలు ఆశించి ఎవరిని సంప్రదించకుండా కేవలం చేనేత, జౌళి శాఖ సంచాలకుల సిఫారసు మేరకు జీఓ నం.28 ద్వారా తెలంగాణ పవర్‌లూం అండ్ టెక్స్ టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, జీఓ నం.29 ద్వారా తెలంగాణ హ్యాండ్లూం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లను ఏర్పాటు చేశారు. ఇక పదేండ్లుగా జియో ట్యాగింగ్, త్రిఫ్ట్ ఫండ్ వంటి అమలు ఏ పాటిదో ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ప్రభుత్వం ప్రతి ఏటా చేనేత రంగానికి కేటాయించిన నిధులు, ఖర్చు చేసిన వ్యయంలో అంతులేని వ్యత్యాసం ఉన్నది. కానీ పాలకులు చేనేత కార్మికుల పాలిట తాము చేస్తోన్న కృషి మరే ప్రభుత్వం చేయలేదంటూ ప్రచారం చేసుకుంటున్నారు. నిజా నికి వ్యయం, లబ్ధిదారుల లెక్కను సమాజానికి చేరవేస్తే చేనేత రంగానికి ఎంత మేరకు న్యాయం దక్కిందో అందరికీ తెలుస్తుంది.
రాజకీయ శిక్షణ
టెస్కోకు ఎంతో మేథో సంపత్తి కలిగిన ఉద్యోగులు, అధికారులు ఉన్నారు. స్థిర, చరాస్తులు ఉన్నాయి. టెస్కోను ఏం చేస్తారో, ఏం చేయనున్నారో ఎవరినీ అడగడం లేదు.. ఎవరికీ చెప్పడం లేదు. దశాబ్దాలుగా కార్మికులకు భరోసానిచ్చిన సొసైటీల గమ్యం ఎటో ఎవరూ నిర్వచించడం లేదు. అలాగే పాలక మండళ్లపై ఊసే లేకుండా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగిన ఆప్కో పాలక మండళ్లను పక్కన పెట్టి అధికారులే పాలన చేస్తున్నారు. ఆప్కోకు దీటుగా టెస్కోను నడిపించలేకపోతున్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డికి సహ కార వ్యవస్థపై పూర్తి అవగాహన ఉన్న లీడర్. గత ప్రభుత్వ వివక్ష చూపించిన చేనేత సొసైటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటారన్న ఆశ ఉంది. ఈ ఎన్నికలతోనైనా రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు పద్మశాలీయులకు కాస్తయినా అవకాశం లభిస్తుంది. ఇది రాజకీయ శిక్షణగా దోహదపడుతుంది.
-శిరందాస్ ప్రవీణ్‌కుమార్,
80966 77450






