జగన్‌కి గుబులు పుట్టిస్తున్న సర్వేలు

by Disha edit |
జగన్‌కి గుబులు పుట్టిస్తున్న సర్వేలు
X



ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలూ మనమే గెలుస్తాం. గెలుపు సాధించాలి కూడా అని వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి ఢంకా బజాయించి చెబుతున్నారు. కానీ ప్రభుత్వ పనితీరుపై సీఎం వైఎస్ జగన్‍కి ఐప్యాక్ సంస్థ ఇచ్చిన తాజా నివేదిక వైసీపీ ప్రజా ప్రతినిధులకు, కార్యకర్తలకు గుబులు పుట్టిస్తోంది. 45 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా అసమ్మతి తీవ్రంగా ఉందని, రాబోయే ఎన్నికల్లో వారికి సీట్లు ఇవ్వకూడదని సీఎంకి ఐప్యాక్ నివేదిక స్పష్టంగా తెలియజేయడంతో ఎమ్మెల్యేలలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, తెలుగుదేశం-జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తే అధికారంలోకి రావడం ఖాయమని, ఆ పార్టీలు పొత్తులో భాగంగా ఎన్నికలకు వెళ్తే వైసీపీకి 65 స్థానాల్లో మాత్రమే గెలుపొందే అవకాశం ఉందని శ్రీ ఆత్మసాక్షి తాజా సర్వే వెల్లడించింది. వైసీపీ ప్రభుత్వం తన విధానాలపై పున:సమీక్ష చేసుకోవలసిన అవసరాన్ని ఇవి తేటతెల్లం చేస్తున్నాయి.

చ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 'వైనాట్ 175'.. అన్ని సీట్లూ ఖచ్చితంగా గెలుస్తామని వైసీపీ ఆధినాయకుడు ధీమా వ్యక్తం చేస్తున్నా, వైసీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఘీంకరిస్తున్నా వైసీపీలోని మధ్యశ్రేణి నాయకులు అదే రీతిన స్పందించలేని పరిస్థితి. ప్రభుత్వ విధానంపై కార్యకర్తలలో అయోమయ పరిస్థితి నెలకొంది. నివురుగప్పిన నిప్పులా అసమ్మతి. ప్రజలకు చేరువవ్వని పథకాలు.. ప్రభుత్వ పనితీరుని ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో కొంత వైఫల్యం. ప్రభుత్వ తీరుపై పలుమార్లు అసహనం వ్యక్తం చేసిన న్యాయస్థానాల తీర్పు. రాష్ట్ర అభివృద్ధి పై కొరవడిన దార్శనికత. మంత్రులు, ప్రజాప్రతినిధుల పొంతనలేని ప్రకటనలు. పరుష పదజాలంతో వ్యక్తిగత విమర్శలు. వాస్తవ పరిస్థితులను దాచిపెట్టి తతంగం నడిపే కోటరీ. వెరసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపనున్నాయి.

సీఎం చేతిలో ఐప్యాక్ రిపోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజ‌కీయ వ్యూహ‌క‌ర్తగా ఐప్యాక్ టీం ప‌నిచేస్తోంది. ఈ సంస్థ ప్రభుత్వ పనితీరుపై అనేక అంశాలు రూపొందించుకొని ప్రతి మూడునెల‌ల‌కు స‌మగ్రంగా స‌ర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక‌లందిస్తుంటుంది. ఇందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి ప‌నితీరు ఎలా ఉంది, ఎమ్మెల్యేల గురించి నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్రజలేమనుకుంటున్నారు? ఏ ఎమ్మెల్యేల‌పై వ్యతిరేకత ఎలా ఉంది? ప్రభుత్వ ప‌థ‌కాల‌పై ప్రజల స్పంద‌న‌... ఇలా ప‌లు అంశాల‌పై స‌ర్వే జ‌రుగుతుంటుంది. తాజాగా ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నిక‌లు జ‌రిగితే ప‌రిస్థితి ఏమిటి అనే అంశంపై స‌ర్వే నిర్వహించి నివేదిక‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అంద‌జేసిన‌ట్లు తెలుస్తోంది.

అధికారంలోకి వచ్చేనా?

ఐప్యాక్ నివేదిక 45 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత తీవ్రంగా ఉంద‌ని, వారికి రాబోయే ఎన్నిక‌ల్లో సీటు ఇవ్వకూడదని వైసీపీ అధిష్టానానికి స్పష్టంగా తెలియజేసింది. 20 నియోజ‌క‌వ‌ర్గాల్లో గ్రూపు త‌గాదాలు ఎక్కువగా ఉన్నాయని, అర్భన్ ప్రాంతాలు, నిరుద్యోగులు, వ్యాపార వ‌ర్గాలు, రైతులు, ఉద్యోగుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని. ఆయా చోట్ల వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలనే దానిపై కొన్ని సూచనలు చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే రాయ‌ల‌సీమ‌లో వైసీపీకి 38 నియోజ‌క‌వ‌ర్గాలు వ‌స్తాయ‌ని, కోస్తాలో 26, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో 10, ఉత్తరాంధ్రాలో 15 సీట్లలో విజ‌యావ‌కాశాలున్నాయ‌ని తెలిపింది. మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను 89 నుంచి 100 లోపు వైసీపీ సాధిస్తుంద‌ని పీకే టీం తన నివేదికలో వెల్లడించింది.

తాజా సర్వే కూడా అలాగే చెప్పింది

అయితే నిన్న విడుదల చేసిన శ్రీ ఆత్మసాక్షి సర్వే కూడా దాదాపు ఇదే విషయాన్ని ప్రస్తావించింది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం-జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తే అధికారంలోకి రావడం ఖాయమని, ఆ పార్టీలు పొత్తులో భాగంగా ఎన్నికలకు వెళ్తే వైసీపీకి 65 స్థానాల్లో మాత్రమే గెలుపొందే అవకాశం ఉందని తాజా సర్వే వెల్లడించింది. అప్పుడు టీడీపీ-జనసేన పార్టీలు కలిసి 110 స్థానాల్లో గెలుపొంది అధికారం చేపడతాయని అంచనా వేసింది. మరోవైపు టీడీపీ-జనసేన-వామపక్షాలు కలిసి పోటీ చేసినా ఈ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని తేల్చేసింది. ఈ మూడు పార్టీలు పొత్తులో భాగంగా ఎన్నికలకు వెళ్లే వైసీపీ 60 సీట్లకే పరిమితమవుతుందని టీడీపీ-జనసేన-వామపక్ష పార్టీలు 116 చోట్ల గెలుపొందుతుందని తెలిపింది.

మొత్తం మీద ప్రతిపక్ష పార్టీలు ఒంటరిగా పోటీ చేయాలని అధికార పక్షం కోరుకోవాలి అప్పుడే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి అది వైసీపీకే అనుకూలిస్తుంది. అందుకే వైసీపీ మరోమారు అధికారంలోకి రావాలన్నా, ఆశించిన ఫలితాలు రాబట్టాలన్నా వైసీపీ అధినాయకుడు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. విపక్షాలు విమర్శలు చేస్తే వాటికి సకారాత్మక రీతిలో సమాధానం చెప్పాలి. రాష్ట్ర భవిష్యత్తు, సంక్షేమం, అభివృద్ధిపై పారదర్శకమైన ప్రభుత్వ విధానాన్ని జగన్ ప్రకటించాలి. అలాగే రాష్ట్ర ఉద్యోగుల సమస్యలను పరిష్కరించటం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించవచ్చు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి సరైన రీతిలో పనిచెస్తే నీ విజయాన్ని ఎవ్వరూ అపలేరు జగనన్నా...!

-శ్రీధర్ వాడవల్లి

99898 55445


Next Story

Most Viewed