నేతలకు పట్టని..నేతన్నల గోడు

by Ravi |   (  Updated:2025-01-19 01:15:37  IST  )

అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి రాణి ఎలిజిబెత్‌నూ, ప్రపంచాన్నీ అబ్బురపర్చిన చరిత్ర సిరిసిల్ల నేత కార్మికులది.

నేతలకు పట్టని..నేతన్నల గోడు
X

అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి రాణి ఎలిజిబెత్‌నూ, ప్రపంచాన్నీ అబ్బురపర్చిన చరిత్ర సిరిసిల్ల నేత కార్మికులది. తదనంతర కాలంలోనూ తమ ప్రతిభతో ఎన్నో అద్భుతాలు సృష్టించి సిరిసిల్ల ఖ్యాతిని యావత్ దేశానికి చాటిన ఘనత ఇక్కడి నేతన్నలది. అలాంటి నేతన్నల గోడు నేడు నేతలెవరికీ పట్టడం లేదు. ఫలితంగా నిత్యం రణగొణ ధ్వనులతో మారుమోగే సిరిసిల్ల కార్మిక క్షేత్రం క్రమంగా కునారిల్లుతోంది. ఇక్కడి వస్త్ర పరిశ్రమ నేడు నిరాదరణకు గురవుతోంది. సమస్యల పరిష్కారానికి సమ్మెలు, ఆందోళనలతో మరమగ్గాలు ఆర్నెల్లకోసారి మూగబోతున్నాయి.

ఫలితంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడిన సుమారు 40 వేల మంది కార్మికుల బతుకులు దుర్భరంగా తయారయ్యాయి. ఇక్కడి కార్మికుల బతుకులు రోజురోజుకూ చితికిపోతున్నాయి. కార్మికులు నిత్యం ఈ విధానాలకు వ్యతి రేకంగా పోరాడుతూనే ఉన్నారు. పొట్టకూటి కోసం సైతం పోరు తప్పని దుస్థితి. దేశంలోని ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న సంక్షేమ చర్యలు సైతం ఇక్కడ చేపట్టకపోవడం గమనార్హం. ఏడాదిలో మూడ్నెల్లు రోడ్లపైకి రావాల్సిందే. ఇటీవలి కాలంలో ఈ పరిస్థితులు కొంత తగ్గినా ఏ ఉరుమొచ్చి, ఏ పిడుగొచ్చి పడితే ఏం జరుగుతుందో అన్న ఆందోళన కార్మికులను వెంటాడుతూనే ఉంటుంది.

నేతన్నల పరాయీకరణ..

సిరిసిల్లాలో మూడంచెల వ్యవస్థ ఉంది. ముడిసరుకును కొంత మంది పెట్టుబడిదారులు అందజేస్తారు. వీరినే యజమానులు లేదా మాస్టర్ వీవర్స్ అంటారు. వీరి కింద ఆసాముల వ్యవస్థ ఉంటుంది. ఆ ఆసాములు సొంతంగా మర మ గ్గాలు (లూమ్స్) కొని బట్టను ఉత్పత్తి చేస్తారు. ఆసాముల దగ్గర బట్టనేసేందుకు కార్మికులు కూలీలుగా పని చేస్తారు. వేసిన గుడ్డకు కార్మికులకు ఆసాములు కూలి చెల్లిస్తే.. ఆ గుడ్డను తిరిగి యజమానులకు అప్పగించినందుకు గాను ఆసాములకు మీటరుపై ఓ లెక్కన యజమానులు చెల్లిస్తారు. కింద ఉండే కార్మికులకు గాని, ఆసాములకు గాని మార్కెట్‌తో సంబంధమే ఉండదు. ఆ గుడ్డను మాస్టర్ వీవర్స్‌కి అందించే వరకే వీరి పని, కొంత మంది ఆసాములు మగ్గాలను కూడా మాస్టర్ వీవర్స్ నుండే నెలకు రూ.1200 అద్దె చెల్లించి వాడుతుంటారు. ఇక్కడి యజమానులు తమ వరకు లాభసాటిగానే ఉందన్న భావనతోనే ఇదే మగ్గాలపై వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారనే విమర్శ కూడా ఉంది.

పాత మరమగ్గాలు.. నాసిరకం నేత

సిరిసిల్ల శివారులో ఏర్పాటు చేసిన టెక్స్ టైల్ పార్క్ నామ మాత్రంగా పనిచేస్తుంది. దాని అభివృద్ధి పట్ల చర్యలు లేవనే చెప్పొచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన పాత రకం మరమగ్గాలనే సిరిసిల్లలో ఆసాములు వాడుతున్నారు. భీవండి, సోలాపూర్‌లలో స్క్రాప్ (పనికి రాని చెత్త) కింద తొలగించిన వాటిని తెచ్చి వాడుతున్నారు. కానీ వీటిపై తయారయ్యే గుడ్డ మాత్రం ముతక రకం. ఏ మాత్రం నాణ్యత లేనిది. అయినా ఇదే ఉత్పత్తిని ఇక్కడి యాజమాన్యాలు ప్రోత్సహిస్తున్నాయి. కొనసాగిస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. వారికీ ప్రభుత్వం నుండి ఆశించిన ప్రోత్సాహం లేదు. ఉన్నంతలో దీనిలో కొంత లాభాలు వస్తున్న తరుణంలో వీటివైపే మొగ్గుచూపుతున్నారు.

నేతన్నపై పిడుగుపాటు

విపత్తు ముంచుకొచ్చినప్పుడల్లా ఉపశమన చర్యలు చేపట్టడం మినహా వస్త్ర పరిశ్రమను ఆదుకునే శాశ్వత చర్యలు లేవనే చెప్పొచ్చు. పైగా 2012లో అప్పటి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి మరింత భారం వేసింది. అదే క్రమంలో అప్పటి వరకు అమలైన విద్యుత్ సబ్సిడీలోనూ కోత పెట్టింది. మరమగ్గాలపై వాడే కరెంటుకు కొద్ది పాటి సబ్సిడీ ఇచ్చినప్పటికీ అంతకు మించి సర్ ఛార్జీల రూపంలో వసూలు చేసింది. దీంతో యథాతథంగా బిల్లులు వస్తున్నాయి. ఈ స్థితిలోనూ బక్కచిక్కిన నేతన్నపై 2013 ప్రారంభంలో మరో పిడుగు పడింది. బట్ట నేత కోసం వాడే ముడిసరుకులైన యార్న్(దారం), రంగుల ధరలు భారీగా పెరిగాయి. ఫలితంగా మరింత సంక్షోభంలోకి పరిశ్రమ నెట్టబడి వస్త్ర పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ తగిలింది. నేతల హామీలు, ప్రభుత్వ పథకాలు ఏ మాత్రం భరోసా ఇవ్వలేకపోయాయి. దీంతో మగ్గాలపై నేస్తున్న నూలు పోగులే ఉరితాళ్లయ్యాయి. మగ్గాల మధ్యే ఉరేసుకున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. కానీ ఆత్మహత్యల నివారణ దిశగా నాటి నుండి నేటి వరకు ప్రభు త్వాలు తీసుకున్న శాశ్వత చర్యలు ఏ ఒక్కటీ లేదన్నది వాస్తవం.

ప్రభుత్వం ఏం చేయాలి?

ప్రస్తుతం ఆసాములు వాడుతున్న పాత మగ్గాల స్థానంలో ఆధునిక మగ్గాలు వాడాలి. ప్రభుత్వమే వాటిని అందించాలి. వీటి ఏర్పాటుకు రూ.600 కోట్లు అవసరమని జిల్లాలోని చేనేత జౌళి శాఖ అధికారులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు నివేదించారు. చాలా కాలంగా ఈ ఫైల్ పెండింగ్‌లో ఉంది. కానీ ఇప్పటి వరకు పైసా ఇచ్చిన పాపాన పోలేదు. నాణ్యమైన వస్త్రో త్పత్తి దిశగా చర్యలు చేపట్టాలి. గుడ్డ నాణ్యంగా, దారం సన్నగా రావాలంటే సైజింగ్ యూనిట్లు, ఆటోమేటిక్ యూనిట్లు అవసరం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ శాశ్వత నష్టం, ఆత్మహత్యల నివారణ కోసం ప్రభుత్వం ఈ పని చేయక తప్పదు. గుడ్డ తయారీ తరువాత ప్రాసెసింగ్ అవసరం. ప్రాసెసింగ్ యూనిట్లూ ఇక్కడే ఏర్పాటు చేయాలి. ఒక్కో యూనిట్‌కు సుమారు 10 కోట్లు అవసరం. ఇలాంటివి రెండు నుండి మూడు ఉంటే జిల్లాకు సరిపోతాయని జౌళి శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెటింగ్ కోసం ప్రత్యేకంగా అపెరల్ పార్క్ ఏర్పాటు చేయాలి. అక్కడే గార్మెంట్ యూనిట్ పెట్టాలి. స్థానికులకే ముఖ్యంగా మహిళలకు ఇందులో పని దొరుకుతుంది. ఒక కుటుంబంలో భార్యా భర్తలకు ఉపాధి దొరుకుతుంది. ఫలితంగా ఆర్థికంగా కొంత నిలదొక్కుకునే వాతావరణం నెలకొంటుంది.

దూరమవుతున్న కొత్త తరం

పరిశ్రమలో వస్తున్న సంక్షోభం, ఆటుపోట్ల మూలంగా వరుస ఆత్మహత్యల నేపథ్యంలో కొత్త జనరేషన్ ఇటు దిక్కు చూడడం లేదు. ఈ స్థితిలో అపెరల్ పార్క్ ఏర్పాటు అనేది వారినీ ఈ రంగంలోకి ఆకర్షించడానికి తోడ్పడుతుంది. సాధ్యమైనంత వరకు ఇక్కడ ఉత్పత్తి అయిన వస్త్రాలను ప్రభుత్వ విభాగాలే కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాలకు సరిపడా వస్త్రం ఇక్కడి నేతన్నలు ఉత్పత్తి చేస్తున్నారు. తమిళనాడు లో పరిశ్రమను ప్రోత్సహించేందుకు మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచిత విద్యుత్తు ఇస్తోంది. యార్న్ డిపోలను ప్రభుత్వమే ఏర్పాటు చేసి సబ్సిడీపై కార్మికులకు అందజేస్తుంది. ఉత్పత్తి అయిన గుడ్డను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. తమిళనాడు సహా ఇతర అన్ని రాష్ట్రాల్లో వర్క్ షెడ్ ఏర్పాటు సహా యంత్రాల ఆధునీకరణకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలిస్తాయి. కావున ఇక్కడ తమిళనాడు తరహా ప్రత్యేక సహాయక చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం.

డాక్టర్. బి. కేశవులు

ఎండి. సైకియాట్రీ

85010 61659

Next Story