వందేమాతరంపై మళ్లీ రాజకీయ వివాదం.. నిజాలు ఏవి.. అపార్థాలు ఏవి?

by Ravi |   (  Updated:2025-11-25 01:00:46  IST  )

దేశ చరిత్ర, సంస్కృతి, స్వాతంత్ర్య పోరాటాన్ని కలుపుతూ నిలిచే ప్రతీకల్లో ‘జన గణ మన’, ‘వందేమాతరం’ అగ్రస్థానంలో ఉంటాయి. ఈ సంవత్సరం వందేమాతరం గీతం ప్రచురితమై 150 ఏళ్లు పూర్తవుతుండగా

వందేమాతరంపై మళ్లీ రాజకీయ వివాదం.. నిజాలు ఏవి.. అపార్థాలు ఏవి?
X

దేశ చరిత్ర, సంస్కృతి, స్వాతంత్ర్య పోరాటాన్ని కలుపుతూ నిలిచే ప్రతీకల్లో ‘జన గణ మన’, ‘వందేమాతరం’ అగ్రస్థానంలో ఉంటాయి. ఈ సంవత్సరం వందేమాతరం గీతం ప్రచురితమై 150 ఏళ్లు పూర్తవుతుండగా, దేశవ్యాప్తంగా సంబరాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ వేడుకల నడుమ, దేశాన్ని కలుపుకోవాల్సిన ఈ గీతం మళ్లీ రాజకీయ వివాదాల కేంద్రంగా మారింది. దీంతో వందేమాతరం చరిత్ర, దాని సంక్షిప్తీకరణ, స్వాతంత్ర్య సమరయోధుల నిర్ణయాలు.. ఇవి మరోసారి ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

నవంబర్ 7న దేశ రాజధాని ఢిల్లీలో వందేమాతర సంబ రాలని అధికారికంగా ప్రధాని మోడీ ప్రారంభించారు. అయితే దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన వందేమాతర సంస్మృతి సందర్భాన్ని సైతం నరేంద్ర మోడీ అనవసర వివాదాలకు, విభజన రాజకీయాలకూ వేదికగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగా..

ఇందులో తప్పులు వెతుకుతారా..?

'90 యేళ్ల క్రితం..1937లో నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా వందేమాతరం పాటను ముక్కలు చేసింది, పాటలోని కొన్ని చరణాలను తొలగించింది, దాని కారణంగా పాట ఆత్మ వేరు చేయబడింది, ఈ చర్య దేశ విభజనకు బీజం లాంటిది’ అంటూ మోడీ అన వసర వివాదానికి తెర లేపారు. పైగా వందేమాతర గీతానికి జరిగిన అన్యాయం గురించి నేటి యువతరం తెలుసుకో వాలని, కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలని మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే గతంలోని పాలకులు అధికారాన్ని అనుభవిస్తూ, ఏమైనా తప్పులు చేసి ఉంటే.. ప్రశ్నించడంలో అర్ధం ఉంది కానీ, దేశం బ్రిటిష్ వాడి దాస్య శృంఖలాల్లో నలిగిపోతున్న వేళ.. స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుంచి నడిపించి, దేశ ప్రజలకు మార్గ నిర్దేశనం చేస్తున్న సమయంలో.. ఆ స్వాతంత్ర్య సమర యోధులు చేసిన పనులలో తప్పులు వెదకడమంటే.. దుస్సాహసమే అవుతుంది! 1937లో మన స్వాతంత్య్ర సమర యోధులు చేసింది వందేమాతరం పాటను ముక్కలు చేయడం కాదు.. దేశవ్యాప్త స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా సామాన్య ప్రజలు పాడడానికి అనుకూలంగా ఉన్న చరణాలను మాత్రమే స్వీకరించి, బాణీ కట్టి సంగీతాన్ని జోడించి ప్రచారం చేసారు..

ఆరు చరణాల పాటతో ప్రచారం చేస్తారా?

బంకించంద్ర చటర్జీ రాసిన వందేమాతర గీతాన్ని మొదట 1875లో నాటి ప్రముఖ బెంగాలీ పత్రిక ‘బంగ్లా దర్శన్’ అనే పత్రికలో అచ్చు వేసారు. బంగ్లా దర్శన్‌లో దర్శన‌మిచ్చిన వందేమాతర గీతంలో కేవలం రెండు చరణాలు మాత్రమే ఉన్నవి. 1883లో బంకించంద్ర రచించిన ‘ఆనంద మఠ్’ నవలలో ఈ పాటను జతపరిచారు. నవలలో జతపరిచే నాటికి.. మరో నాలుగు చరణాలు జోడించ‌బడి, పాట నిడివి ఆరు చరణాలకు పెరిగింది. ఇది నాటి అవిభక్త బెంగాల్ ప్రాంతాన్ని మాతగా వర్ణిస్తూ సాగిన పాట అది. నేటి ఒడిశా, బీహారులతో పాటు ప్రత్యేక దేశంగా మారిన బంగ్లాదేశ్ ప్రాంతం కూడా నాటి అవిభక్త బెంగాల్‌లో భాగంగా ఉండేవి. అప్పడు ఆ ఉమ్మడి రాష్ట్రం జనాభా ఏడు కోట్లు.. అందుకే వందేమాతర గీతం మూడవ చరణం మొదటి పంక్తిలో ‘సప్తకోటి కంఠ కలకల నినాద కరలే’ అని ఉంటుంది. ఆరు చరణాల పాటను సామాన్య ప్రజల్లో ప్రచారం చేయడం కష్టం. ఉద్యమ అవసరాల కోసం.. ఉత్తేజపరిచే ఆ గీతాన్ని ప్రజలకి మరింత చేరువ చేయాలనే సదుద్దేశంతోనే.. వందేమాతర గీతపు మొదటి రెండు చరణాలకు బాణీ కట్టించి.. స్వాతంత్ర ఉద్యమ సభలలో వినిపించడం మొదలు పెట్టారు.

ఇది అందరి సమిష్టి నిర్ణయం..

నాడు మన జాతీయ నాయకులు చేసిన ఆ చర్యను ‘ముక్కలు చేయడం’ అని బుద్ధి ఉన్నవాడెవడూ అనలేడు. దానికి సంక్షిప్తీకరణ (అబ్రిడ్జిమెంట్) అనే గౌరవనీయమైన పేరు ఉన్నది. ప్రజా శ్రేణులను కదిలించడానికి.. ఉద్యమ గీతాల సంక్షిప్తీకరణ అంతటా జరుగుతున్నదే. అది తప్పెలా అవుతుంది? ఈ సంక్షిప్తీకరణ నిర్ణయాన్ని తీసుకున్న నాటి కాంగ్రెస్ సబ్ కమిటీలో జవహర్‌లాల్ నెహ్రూతో పాటు సుభాష్ చంద్రబోస్, ఆచార్య నరేంద్ర దేవ్, గురుదేవ్ రవీంద్ర‌నాద్ ఠాగూర్, అబుల్ కలాం ఆజాదులూ ఉన్నారు. వారందరి సమిష్టి నిర్ణయం అది. జనగణమన గీతపు సంక్షిప్తీకర‌ణను నేటికీ మన కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్య క్రమాలలో వాడుతున్నాం. అందులో ఎలాంటి తప్పును ఎవ్వరూ వెతకడం లేదు. వందేమాతర గీత సంక్షిప్తీకరణ నిర్ణయాలు మన దేశ చరిత్రలో రెండుమార్లు జరిగాయి. మోడీ ఉటంకించిన 1937తో పాటు..1950లోను జరిగింది. ఈ మారు ఆ పని చేసింది భారతదేశపు రాజ్యాంగ సభ. దేశ స్వాతంత్ర్య సిద్ధి తర్వాత.. ప్రజలెన్నుకున్న రాజ్యాంగ‌సభ కొలువు తీరినప్పుడు.. స్వతంత్ర్య భారత జాతీయ గానంగా జనగణమనకు, జాతీయ గీతంగా వందేమాతరంకు అధికారికంగా గుర్తింపు ఇవ్వడం జరిగింది.

ప్రజలను రెచ్చగొట్టడం కోసం..

వందేమాతర గీతానికి అధికారిక గుర్తింపు ఇచ్చే సమయంలోనూ బంకింగ్‌చంద్ర చట్టర్జీ రచించిన మొత్తం 6 చరణాలలో మొదటి రెండు చరణాలను మాత్రమే స్వీకరించారు. మోడీ భాషలో చెప్పా లంటే 1937లో ఆ గీతానికి గాయ మైతే.. 1952లోనూ గాయమ యినట్టే! రాజ్యాంగ సభలో వందేమాతర సంక్షిప్తీకరణ నిర్ణయాన్ని ప్రతిపాదించింది బాబూ రాజేంద్రప్రసాద్ కాగా.. సమర్థించింది బీజేపీ పార్టీకి పూర్వరూపమైన భారతీయ జన సంఘ్ నాయకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ! మోడీ ఆవేదన నిజంగా వందేమాతర గీతం గురించే అయి ఉంటే.. మొదటి నిర్ణయం తీసుకున్న నాయకులతో పాటు రెండో నిర్ణయం తీసుకున్న నాయకులను కూడా ఆయన విమర్శించి ఉండేవారు.. కానీ ఆయన అలా చేయలేదు. దీంతో ఆయన మనసులో ఉన్నది వేరే అని చెప్పకనే చెప్పారు! నేడు ప్రజల్ని రెచ్చగొట్టడం కోసం.. నాలుగు ఓట్ల కోసం.. మోడీ నెహ్రూని తిట్టగలరు కాని.. బాబూ రాజేంద్ర ప్రసాద్‌ను, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని ఏమీ అనలేరు పాపం! అదీ ఆయనకున్న సంకట స్థితి. అందుకే 1937 నిర్ణయం గురించి బాధతో మాట్లాడిన మోడీ.. 1950 నిర్ణయం గురించి వ్యూహాత్మకం‌గా మౌనం పాటించారని మనం అనుకోవాలి. ఏదేమైనా భారతదేశపు జాతీయ ఉద్యమ నాయకులు.. స్వాతంత్ర్య పోరాట సమయంలో చేసిన పనులలో తప్పులు వెతకడాన్ని, సమున్నత హిమాలయ శిఖరాలను చిన్నవిగా చూపించేందుకు ప్రయత్నించడాన్ని.. దేశ ప్రజలు క్షమించరు!

-ఆర్. రాజేశమ్,

కన్వీనర్, సామాజిక న్యాయ వేదిక

94404 43183

Next Story