పోలీస్ స్టేషన్లు.. ప్రాణాలు తీసే నిలయాలా?

by Ravi |   (  Updated:2025-12-16 01:08:37  IST  )

‘చట్టం ఎవరి కోసం?’ అనే ప్రశ్న ఈ రోజు తెలంగాణ సమాజంలో ప్రతి సామాన్యుడినీ, ముఖ్యంగా బడుగు వర్గాలను తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వాలు ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ అంటూ ఎన్ని నినాదాలు చేస్తున్నా

పోలీస్ స్టేషన్లు.. ప్రాణాలు తీసే నిలయాలా?
X

‘చట్టం ఎవరి కోసం?’ అనే ప్రశ్న ఈ రోజు తెలంగాణ సమాజంలో ప్రతి సామాన్యుడినీ, ముఖ్యంగా బడుగు వర్గాలను తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వాలు ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ అంటూ ఎన్ని నినాదాలు చేస్తున్నా, ఆచరణలో మాత్రం పోలీస్ స్టేషన్లు సామాన్యులకు హింసా కేంద్రాలుగానే మిగిలిపోతున్నాయి. పోలీస్ స్టేషన్లు న్యాయం జరిగే నిలయాలుగా కాకుండా, సామాన్యుల పాలిట మరణ శాసనాలుగా మారుతున్న వైనం ప్రజాస్వామ్య వాదులను ఆందోళనకు గురిచేస్తోంది.

భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి ప్రసాదించబడిన 'జీవించే హక్కు'ను కాపాడాల్సిన పోలీసులే, ఆ హక్కును కాలరాస్తూ లాకప్‌లలో ప్రాణాలు తీస్తుంటే.. దిక్కులేని ఆ అభాగ్యుల ఆర్తనాదాలు ఎవరికి వినిపి‌స్తాయి? రక్షకులే భక్షకులుగా మారినప్పుడు సామాన్యుడు న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలి అన్నది జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోయింది.

నిందితుడిగా వెళ్లి శవమై తిరిగొచ్చి..

తెలంగాణలో కస్టోడియల్ మరణాలు (పోలీసు కస్టడీలో మరణాలు) ఒక పునరావృత సమస్యగా మారాయనడానికి గణాంకాలే ప్రబల సాక్ష్యం. దేశవ్యాప్తంగా అధిక సంఖ్యలో మరణాలు నమోదవుతున్నప్పటికీ, ఒక ప్రగతిశీల రాష్ట్రంగా, ఐటీ హబ్‌గా చెప్పుకునే తెలంగాణలో ఈ సంఖ్య తగ్గకపోగా, పెరుగుతుండటం వ్యవస్థలోని డొల్లతనాన్ని, జవాబుదారీతనం లేనితనాన్ని ఎత్తిచూపుతోంది. ఈ మరణాలను నిశితంగా పరిశీలిస్తే, బాధితుల్లో అత్యధికులు షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలే ఉంటున్నారు.. సామాజికంగా, ఆర్థికంగా అట్టడుగు వర్గాల వారిని అణ చివేస్తే తమను ప్రశ్నించేవారు ఉండరనే ధీమా, చట్టం తమ చుట్టమనే అహంకారం ఖాకీల నరనరాన జీర్ణించుకుపో వడమే ఈ దారుణాలకు అసలు కారణం.. తాజాగా 2025 నవంబర్‌లో సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన 30 ఏళ్ల యువకుడు కర్ల రాజేశ్ ఉదంతాన్ని తీసుకుంటే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు ఫోర్జరీ వ్యవహారంలో ఒక నిందితుడిగా పేరున్న రాజేశ్, స్టేషన్ నుండి శవమై తిరిగి రావడం అత్యంత బాధాకరం. పోలీస్ కస్టడీలో ఉండగానే అతను అస్వస్థతకు గురై గాంధీ ఆసుపత్రిలో మరణించాడు. పోలీసులు తమపై ఆరోపణలను ఖండిస్తున్నా, రాజేశ్ మరణం పోలీసుల దెబ్బల వల్లే జరిగిందని కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు గట్టిగా ఆరోపిస్తున్నాయి..

గతంలో ఎన్నో ఘటనలు..

దీనికి ముందు, 2025 మార్చిలో నిజామాబాద్‌లో సైబర్ నేరం ఆరోపణపై అదుపులోకి తీసుకున్న ఆలకుంట సంపత్ కస్టడీలో మరణించడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ‘గుండెపోటు’ అని పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా, అతని శరీరంపై గాయాలున్నాయని, చనిపోయే ముందు తన ప్రాణాలకు ముప్పు ఉందని సంపత్ భయపడ్డాడని కుటుంబ సభ్యులు వాపోయారు. నిజానికి, ఈ విషాదకర ఘటనల పరంపర ఈనాటిది కాదు, గత కొన్ని సంవత్స రాలుగా కొనసాగుతూనే ఉంది. 2023 ఏప్రిల్‌లో తుకారాం గేట్ పోలీస్ స్టేషన్‌లో ఆటో డ్రైవర్ చిరంజీవి మరణంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. దొంగతనం కేసులో అదుపు‌లోకి తీసుకున్న అతని మరణం ‘థర్డ్ డిగ్రీ’ వల్ల జరిగిందేనని ప్రాథమికంగా నిర్ధారించిన న్యాయస్థానం, ఇది ‘ఆమోదయోగ్యం కాదని’ వ్యాఖ్యానించింది. అలాగే, 2023 ఫిబ్రవరిలో మెదక్ జిల్లాకు చెందిన ఖదీర్ ఖాన్ ఘటన మన ‘టెక్నాలజీ పోలీసింగ్’‌లోని లోపాలకు, మతపరమైన వివక్షకు నిదర్శనంగా నిలిచింది. కేవలం సీసీటీవీ ఫుటేజీలో పోలికలు ఉన్నాయన్న అనుమానంతో, ఒక రోజు కూలీని అక్రమంగా నిర్బంధించి, ఐదు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారు. చివరకు అతను నిర్దోషి అని తేలి వది లేసినా, పోలీసుల దెబ్బలకు అతని కిడ్నీలు దెబ్బతిని ఆసు పత్రిలో మరణించాడు. ఇక 2021 జూన్‌లో రక్షక భట నిలయంలో పేద మహిళ మరియమ్మను చిత్రహింసలు పెట్టి చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. దొంగతనం ఆరోపణపై ఒక మహిళ పట్ల పోలీసులు ప్రవర్తిం చిన తీరు, ఆమె కుమారుడిని కూడా కొట్టడం సభ్యసమాజం తలదించుకునేలా చేసింది.

పోలీసులకు శిక్ష పడదనే ధైర్యంతో..

ఈ మరణాలకు పోలీసుల తరపు నుంచి వస్తున్న వివరణలు ‘ప్రమాదవశాత్తు జరిగిన మరణాలు’ లేదా ‘ఆరోగ్య సమస్యలు’ అని. అయితే అవి నమ్మశక్యంగా లేవు. ఈ మరణాల వెనుక బలమైన వ్యవస్థాగత వైఫల్యాలు ఉన్నాయి. ప్రధానంగా పోలీసుల్లో ‘శిక్ష పడదనే ధైర్యం’ పెరిగిపోయింది. కస్టడీ మరణాలకు కారణమైన పోలీసు అధికారులపై హత్యానేరం కింద కేసులు నమోదు కావడం లేదు. చాలా సందర్భాల్లో విచారణ పేరుతో జాప్యం చేసి, సాక్ష్యాలను తారుమారు చేసి, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన డీ.కే. బసు గైడ్‌లైన్స్ ప్రకారం అరెస్టు సమాచారం కుటుంబానికి ఇవ్వడం, న్యాయవాదిని అనుమతించడం, వైద్య పరీక్షలు చేయించడం వంటివి చాలా స్టేషన్లలో అమలు కావడం లేదు. చట్టం ప్రకారం కస్టడీ మరణాలపై తప్పనిసరిగా జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ, మొక్కుబడిగా రెవెన్యూ అధికారులతో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌తో విచారణ జరిపించి చేతులు దులుపు‌కుంటున్నారు. అంతేకాక, స్టేషన్లలో సీసీటీవీలు ఉండాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పట్టించుకోవడం లేదు. అవి ఉన్నా, కీలకమైన కస్టడీ మరణం జరిగినప్పుడే అవి ‘పనిచేయడం లేదని’ పోలీసులు చెప్పడం సాక్ష్యాలను మరుగుపరుస్తున్నారనే అనుమానాలకు తావిస్తోంది.

ఖాకీ హత్యలను అడ్డుకోకపోతే..

రాష్ట్ర ప్రభుత్వం ఈ దారుణాలపై తక్షణం మేల్కొని, గట్టి చర్యలు చేపట్టాలి. కేవలం పరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంటే సరిపోదు. కర్ల రాజేశ్ మరణంతో సహా, ఇటీవలి అనుమానాస్పద కస్టడీ మరణాలన్నింటిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో నిష్పక్షపాత న్యాయ విచారణ జరిపించాలి. బాధ్యులైన పోలీసు అధికారులను సర్వీస్ నుండి తక్షణమే డిస్మిస్ చేసి, వారిపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపాలి. పోస్టుమార్టం పరీక్షలను వీడియో రికార్డింగ్ చేయాలి, నివేదికలను కుటుంబ సభ్యులకు తక్షణమే అందించాలి. బడుగుల పట్ల పోలీసుల వైఖరిలో మార్పు తెచ్చేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలి. రాజ్యాంగం అందరికీ సమానమే. ఈ ‘ఖాకీ హత్యలను’ అడ్డుకోకపోతే, చట్టంపై ప్రజలకు నమ్మకం పోతుంది. బంగారు తెలంగాణ అంటే బడాబాబుల సౌధాలే కాదు, బడుగు జీవుల గుండెల్లో భరోసా నింపాలి..

-డా.కట్కూరి

సైబర్ సెక్యూరిటీ న్యాయ నిపుణులు

Next Story