- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుట్టలుగా అస్థిపంజరాలు.. ఇది ధర్మస్థలమేనా?
ధర్మస్థల హిందువుల పవిత్రక్షేత్రం. ఇది కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో బెళ్తంగడి తాలూకాలో నేత్రావతి నదీతీరంలో ఉంది

ధర్మస్థల హిందువుల పవిత్రక్షేత్రం. ఇది కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో బెళ్తంగడి తాలూకాలో నేత్రావతి నదీతీరంలో ఉంది. ఇక్కడే ప్రసిద్ధి చెందిన ధర్మస్థల ఆలయం ఉంది. అయితే ఆ ధర్మస్థల ప్రాంతంలో శవాల పుట్టలు పగులుతున్నా, ఈగలు కూడా వాలనంత నిర్లక్ష్యం, నిస్సత్తువ మన ప్రజాస్వామ్యాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ పారిశుధ్య కార్మికుడి సంచలన వాంగ్మూలం మతపరమైన సంస్థల్లో పేరుకుపోయిన చీకటి కోణాలను, వ్యవస్థీకృత నేరాలను బట్టబయలు చేసింది.
ఆ దేవాలయ పారిశుధ్య కార్మికుడు చెప్పిన మాటలు గుండెల్ని పిండేస్తున్నాయి. 1995 నుంచి 2014 మధ్య కాలంలో ధర్మస్థల ప్రాంతంలో తాను వందకు పైగా మృత దేహాలను ఖననం చేశానని, వాటిలో చాలామంది మహిళలు, బాలికల శవాలు ఉన్నాయని, వారిపై లైంగిక హింస జరిగినట్టు స్పష్టమైన ఆనవాళ్లు ఉన్నాయని వెల్లడించాడు. ఈ ఫిర్యాదు కేవలం ఆరోపణ కాదు.. తనే స్వయం గా ఒక సమాధిని తవ్వి ఆధారాలు చూపించి, మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ సాహసోపేతమైన చర్య, దశాబ్దాల చీకటిని చీల్చి వెలుగులోకి తెచ్చింది.
మత ముసుగులో దారుణాలు..
ఇక్కడ తలెత్తే ప్రశ్న ఒక్కటే.. పవిత్ర క్షేత్రంగా పూజించబడే ప్రదేశంలో, మానవ మృతదేహాలను రహస్యంగా పూడ్చి పెడుతుంటే, ఇన్నేండ్లుగా ఎవ్వరూ ఎందుకు పట్టించుకోలేదు? ధర్మానికి ప్రతీకగా నిలవాల్సిన స్థలాలు రహస్య హత్యల బురద తిన్నెలుగా మారడం అత్యంత బాధాకరం. ఇది కేవలం ధర్మస్థల సమస్య కాదు. దేశంలోని ఎన్నో మత సంస్థలు, ఆశ్రమాల పేరుతో జరిగే దారుణాలకు ఇది ప్రతిబింబం. ధర్మస్థల ఘటన భారతదేశంలో మత ముసుగులో జరుగుతున్న నేరాలకు ఒక ఉదాహరణ మాత్రమే.. గతంలోనూ ఎన్నో వ్యవస్థీకృత నేరాలు, అధికార దుర్వినియోగాలు వెలుగు చూశాయి. కానీ వాటిపై పూర్తిస్థా యి చర్యలు తీసుకోకపోవడం, ప్రజలు త్వరగా మర్చిపోవడం వంటివి ఈ నేరగాళ్లకు అండగా నిలుస్తున్నాయి. 2010-2022 మధ్యకాలంలో 400కి పైగా మత సంస్థలు లైంగిక, ఆర్థిక కుంభకోణాల్లో ఇరుక్కున్నాయి. ఈ గణాంకాలు మత సంస్థల పేరుతో జరుగుతున్న దురాగతాల తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఈ కేసులు రాజకీయ పలుకుబడి, ఆర్థిక బలం కారణంగా నీరు గారిపోతున్నాయి. ధర్మస్థల కేసులో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.
ఎన్నో ఆరోపణలు ఉన్నప్పటికీ..
భారతదేశంలో నమోదవుతున్న లైంగిక దాడులు, మహిళలు, బాలికల అదృశ్యం కేసులు, మతపరమైన సంస్థలపై నేరారోపణలు మరింత కలవరపెడుతున్నాయి. అవి ఈ దారుణాలకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రతి సంవత్సరం 60,000కి పైగా మహిళలు, బాలికలు అదృశ్యమవుతుండగా, వీరిలో చాలామంది తిరిగి కనిపించడం లేదు. 2019-2021 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 13.13 లక్షల మంది మహిళలు, బాలికలు అదృశ్యమయ్యారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది.
వీరిలో చాలామంది మానవ అక్రమ రవాణాకు, లైంగిక దోపిడీకి గురవుతున్నారు. ధర్మస్థల కేసులో బయటపడిన మృతదేహాలు ఈ అదృశ్యమయ్యే జీవితాలకు ఒక భయంకరమైన ముగింపును సూచిస్తున్నాయి. అయితే ధర్మస్థలపై ఇటువంటి ఫిర్యాదులు కొత్తేమీ కాదు. ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ, ఈ సంస్థలకు రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలు, భారీ విరాళాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు న్యాయ వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. ఫలితంగా బాధితులకు న్యాయం అందడం లేదు, నేరగాళ్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారు.
ఈ ధర్మస్థలంలో న్యాయం జరిగేనా?
ధర్మస్థల ఘటనపై ఫిర్యాదుదారుడి ప్రాణ భయాన్ని దృష్టిలో పెట్టుకొని, అతనికి పూర్తి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. అతని వాంగ్మూలం ఎన్నో అదృశ్య జీవితాల రహస్యాలను బయటపెట్టే అవకాశం ఉంది. ఈ దర్యాప్తు పార దర్శకంగా, నిష్పక్ష పాతంగా జరగాలి. ఈ కేసులో మత సంస్థల నిర్వహణ విధానాలను, ఆర్థిక లావాదేవీలను, భద్రతా వ్యవస్థను వాటి ఆస్తులు, ఆదాయాలను సమగ్రంగా పరిశీలించాలి. అలాగే ఆలయ ప్రాంగణాల్లో భద్రత ఎలా ఉంది? మహిళలు, పిల్లల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకాలి. ఇది కేవలం ధర్మస్థల ఘటన కాదు. ఇది భారత ప్రజాస్వామ్య బలహీనతను నిండుగా అద్దంలో చూపిస్తున్న క్షణం. శవాల పుట్టలు పగులుతున్నా, ఈగలు కూడా వాలనంత నిర్లక్ష్యం మన సమాజాన్ని, వ్యవస్థలను ఆవరించింది. ఈ మౌనాన్ని వీడి, న్యాయం కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. అంతిమంగా ఒకటే ప్రశ్న. ఇది ధర్మస్థలమేనా?
- మేకల ఎల్లయ్య,
99121 78129






