పిక్టోరియల్ హైదరాబాద్ గ్రంథ సృష్టికర్త కొర్వి కృష్ణస్వామి

by Bhoopathi Nagaiah |

అగ్రవర్ణాల ఆదిపత్యంలో పీడనానికి గురవుతున్న హైదరాబాద్ సంస్థానంలోగల మరట్వాడలోని జల్నా అనే మారుమూల గ్రామంలో 1893 ఆగస్టు 25న పేదరైతు కుటుంబంలో కొర్వి కృష్ణస్వామి జన్మించాడు.

పిక్టోరియల్ హైదరాబాద్ గ్రంథ సృష్టికర్త కొర్వి కృష్ణస్వామి
X

అగ్రవర్ణాల ఆదిపత్యంలో పీడనానికి గురవుతున్న హైదరాబాద్ సంస్థానంలోగల మరట్వాడలోని జల్నా అనే మారుమూల గ్రామంలో 1893 ఆగస్టు 25న పేదరైతు కుటుంబంలో కొర్వి కృష్ణస్వామి జన్మించాడు. చాదర్ ఘాట్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ పూర్తిచేసి, నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి, హైదరాబాద్ రాజ్య ప్రధానమంత్రి మహారాజ్ కిషన్ ప్రసాద్ వద్ద అంతరంగిక కార్యదర్శిగా సేవలందించారు. ఆ తరువాత ఆడిటర్ జనరల్ కార్యాలయంలో ఉద్యోగం చేపట్టారు. అనేక ఆంగ్ల, ఉర్దూ పత్రికలకు సంపాదకుడిగా పనిచేశారు. ఎన్నో కాలమ్స్ రాశారు హైదరాబాద్ చరిత్ర, గోవా స్వాతంత్రోద్యమం తదితర అంశాలపై అనేక పుస్తకాలు రచించాడు.

చరిత్రాత్మక గ్రంథ రచన

బొంబాయిలో ముద్రణ, ప్రచురణ సాంకేతికకోర్సులో చేరి, దానిని పూర్తిచేసి తనమేధస్సుకు మరింత పదునుపెట్టారు 1925లో హైదరాబాద్ చేరుకొని గౌలిగూడలో చంద్రకాంత్ ముద్రాలయం స్థాపించి, లండన్ నుండి ప్రత్యేకమైన పేపర్ దిగుమతి చేసుకున్నారు. హైదరాబాద్ గొప్పతనాన్ని రచనతోపాటు చిత్రాలతో ముద్రించి, బైండింగ్‌పై బంగారపురంగుల అక్షరాలతో ఆకర్షణీయంగా, నాణ్యతయుతంగా 1200 పేజీలు కలిగిన పిక్టోరియల్ హైదరాబాద్ గ్రంథాన్ని 2 వాల్యూమ్ లుగా తీసుకురావడానికి దశాబ్దంపైగా సమయాన్ని వెచ్చించి 1929లో మొదటి వాల్యూమ్, 1934లో రెండవ వాల్యూమ్ లను ప్రచురించారు.

అంతర్జాతీయ ప్రశంసలు

అలాగే ఈ చారిత్రాత్మకమైన గ్రంథాన్ని పలుజాతీయ, అంతర్జాతీయ పత్రికలన్నీ ప్రశంసలతో ముంచెత్తాయి. తర్వాతి కాలంలో ఈగ్రంథం రిఫరెన్స్ గ్రంథంగా చాలాప్రసిద్ధి చెందింది. సాంకేతికతోకూడిన నాణ్యతను సమాజానికి పరిచయం చేసిన వ్యక్తిగా పేరుగాంచారు. కుతుబ్షాహి కాలంనుండి అసఫ్ జాహీల కాలంవరకు ఎవ్వరూ చేయలేని విధంగా, నాణ్యతయుతమైన ప్రచురణ వ్యవస్థను రూపొందించి, పిక్టోరియల్ హైదరాబాద్‌ను ప్రచురించి, ఒకనూతన విజన్‌ను ప్రపంచానికందించి, హైదరాబాద్ చరిత్రను విశ్వవ్యాప్తంగా తెలిసేలాచేసిన ఘనత ఆయనకే దక్కింది.

తొలితరం బహుజన సంఘసంస్కర్త

భూమిలేని మనుషులు సమాజంలో అభివృద్ధి చెందాలంటే ఆధునికవిద్య ఎంతో అవసరమని భావించి, అందులో ముఖ్యంగా దళిత బహుజనులు, స్త్రీలు విద్యనభ్యసించాలని తలిచి, సామాజిక అభివృద్ధి కోసం స్త్రీని కేంద్రంగా చేసుకోవడం పూలేనుండి గ్రహించి,1921లో పాతబస్తీలో హిందీ మీడియంలో కన్యక బాలికా పాఠశాలను ప్రారంభించాడు. కుల, మతాలకతీతంగా హైదరాబాద్ సంస్థానంలోని సమకాలీనులతో పనిచేస్తూ తొలితరం బహుజనుల సంఘసంస్కర్తగా పేరుగాంచారు. 1922లో మొదటిసారిగా ముదిరాజ్ సంఘాన్ని ఏర్పాటుచేసి, తెలంగాణ వ్యాప్తంగా గ్రామాలను సందర్శించి, అక్కడి ముదిరాజుల ఆర్థిక, సామాజిక పరిస్థితులను అధ్యయనంచేస్తూ వచ్చారు. అక్కడి మూఢాచారాలు, దురాచారాలను ఖండిస్తూ, చైతన్య పరుస్తూ, దాతలను సమీకరించి, ప్రోత్సహించి ప్రత్యేక విద్యాలయాలు, హాస్టల్స్ స్థాపించి, మేధాశక్తే బానిసత్వాన్ని బద్దలుకొడుతుందని చాటిచెప్పారు.

హైదరాబాద్ మేయర్‌గా...

ప్రత్యక్షరాజకీయాలలో అడుగుపెట్టి 1933 నుండి 25 సంవత్సరాలపాటు హైదరాబాద్ నగరపాలకసంస్థలో చుడిబజార్ ప్రాంతానికి మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేశాడు.1957 నుండి 1958 వరకు హైదరాబాద్ 4వ మేయర్ గా, నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించాక మొదటి మేయర్‌గా చరిత్రలో తమపేరును శాశ్వతంగా లిఖించుకున్నాడు. హైదరాబాద్ మేయర్‌గా ఉన్నకాలంలో హైదరాబాద్‌కు మాస్టర్ ప్లాన్ రూపొందించి నగరంపై చెరగని ముద్రవేసి, భవిష్యత్ తరాలకు మార్గదర్శకులయ్యారు. నగరంలో మనిషిలాగే రిక్షాను రద్దుచేసి, దానిపై ఆధారపడి జీవనం కొనసాగించే వారికి మరో ఉపాధికల్పించారు. కాలినడకతో కార్యాలయానికి వెళ్లేవారు. 1967 డిసెంబర్ 19న మరణించారు. దహన సంస్కరణలకు కూడా చిల్లిగవ్వ లేకుంటే తనమిత్రులు ఆర్థిక సహకారం చేసి కార్యక్రమాలు చేశారంటే ఆయనకాయనే సాటి. యావత్తు జాతి కొర్వి కృష్ణస్వామిని ఆదర్శంగా తీసుకోని ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆశిద్దాం.

డా. పోలం సైదులు,

94419 30361

Next Story