పింఛన్ హక్కులను కాపాడుకోవాలి!

by Ravi |   (  Updated:2025-12-11 01:01:09  IST  )

భారతదేశంలో ప్రభుత్వ సేవ చేసిన ఉద్యోగుల జీవితంలో పింఛన్ వ్యవస్థకు అపూర్వమైన ప్రాముఖ్యత ఉంది. వృద్ధాప్యంలో గౌరవంతో, భద్రతతో జీవించేందుకు పింఛన్ ఒక ముఖ్యమైన ఆధారం. పింఛన్ అనేది కేవలం ఆర్థిక సహాయం కాదు..

పింఛన్ హక్కులను కాపాడుకోవాలి!
X

భారతదేశంలో ప్రభుత్వ సేవ చేసిన ఉద్యోగుల జీవితంలో పింఛన్ వ్యవస్థకు అపూర్వమైన ప్రాముఖ్యత ఉంది. వృద్ధాప్యంలో గౌరవంతో, భద్రతతో జీవించేందుకు పింఛన్ ఒక ముఖ్యమైన ఆధారం. పింఛన్ అనేది కేవలం ఆర్థిక సహాయం కాదు.. ఇది ప్రభుత్వ సేవ చేసిన వారందరికీ సమాజం ఇచ్చే గౌరవం, ప్రభుత్వం అందించే భరోసా, రాజ్యాంగం ఇచ్చే హక్కు. ఈ హక్కును మరింత బలపరిచిన చారిత్రాత్మక తీర్పు వెలువడిన రోజు డిసెంబర్ 17, అందుకే దేశవ్యాప్తంగా ఈ రోజును పింఛన్ దారుల దినోత్సవంగా పాటిస్తున్నారు.

ఇది పింఛన్ దారుల హక్కుల పండుగ, పోరాటాల స్మృతి, ఐక్యతా దినం, స్వాభిమానం, గౌరవ చిహ్నంగా మారింది. ఈ రోజు పింఛన్ దారులు దేశవ్యాప్తంగా తమ హక్కులను గుర్తు చేసుకుంటారు, ఉద్యమాల చరి త్రను స్మరిస్తారు, పింఛన్ వ్యవస్థను రక్షించే సంకల్పాన్ని పునరుద్ధరిస్తారు, ఐక్యతను ప్రదర్శించి బలపడతారు.

పింఛన్ వ్యవస్థకు బలమైన పునాది..

1982లో భారత సుప్రీంకోర్టు డి.ఎస్. నకారియ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన తీర్పు భారతదేశ పింఛన్ వ్యవస్థను పూర్తిగా మార్చేసింది. ఈ తీర్పు పింఛన్‌ను ‘దానం’ లేదా ‘కృతజ్ఞతా బహుమతి’ అన్న భావన నుండి తొలగించి, ఇది ఉద్యోగి సంపాదించిన సామాజిక భద్రతా హక్కు అని ప్రకటించింది. పింఛన్ చెల్లించడం ప్రభుత్వానికి రాజ్యాంగపరమైన బాధ్యత. పాత, కొత్త ఫించన్ దారుల మధ్య వివక్ష నిషిద్ధం. పింఛన్ చెల్లింపులు జీవనాధార హక్కులో భాగం. ఈ తీర్పు భారతదేశంలోని కోట్లాది పింఛన్ దారులకు గౌరవం, సమానత్వం, న్యాయం, భద్రతలను నిర్ధారించింది. అందుకే ఈ తీర్పు వెలువడిన రోజు వారి చరిత్రలో ఒక మైలురాయి. కాలక్రమేణా ఇది కేవలం ఒక జ్ఞాపకదినం మాత్రమే కాదు. పింఛన్ దారులకు నిజమైన పండుగదినంగా మారడంలో సందేహం లేదు.

ఈ బిల్లుతో వీరికి ప్రమాదం..

ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వాలిడేషన్ బిల్లు ఫించన్ దారుల హక్కులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఈ బిల్లు ప్రభుత్వ నిర్ణయాలను వెనుక తేదీ నుంచి చట్టబద్ధం (Retrospective Validation) చేసుకునే అవకాశం ఇస్తోంది. ఇది నకారియ తీర్పు ఇచ్చిన రక్షణలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అలాగే ఈ బిల్లుతో ఏర్పడే ప్రమాదాలు ఏవంటే.. పింఛన్ దారుల హక్కులు దెబ్బతినే అవకాశం, పాత-కొత్త పింఛన్ దారుల మధ్య వివక్షను చట్టబద్ధం చేసే అవకాశం. కోర్టుల్లో న్యాయం పొందే అవకాశాలు తగ్గడం. పింఛన్ వ్యవస్థలో పారదర్శకత తగ్గడం. భవిష్యత్తు పింఛన్ దారుల హక్కులు బలహీనపడటం. ఈ నేపథ్యంలో ఈ సారి జరగబోయే పింఛన్ దారుల దినోత్సవం ప్రాముఖ్యత మరింత పెరుగుతోంది. బిల్లుల రూపంలో వచ్చే ప్రమాదాల నేపథ్యంలో పింఛన్ వ్యవస్థను కాపాడేందుకు సంఘీభావంతో ముందుకురావడం అత్యవసరం.

భవిష్యత్తు తరాల కోసం..

నేటి పింఛన్ దారులు అనుభవిస్తున్న గౌరవం, హక్కు లు, సౌకర్యాలు ఇవి అన్నీ స్వయంగా వచ్చినవి కాదు. వారి సంఘాలు, నాయకులు దశాబ్దాలపాటు చేసి న ఉ ద్యమాలు, ఆందోళనలు, న్యాయపోరాటాలు, సమర సభ లు వల్లే ఇవి సాధ్యమయ్యాయి. అందుకే ఈ పోరాట చరి త్రను స్మరించడం, నాయకుల సేవలను గౌరవించడం, భవిష్యత్తు తరాలకు పింఛన్ వ్యవస్థను రక్షించడం ప్రతి పింఛన్ దారుడి పవిత్ర బాధ్యత. అందుకే ప్రతీ పింఛన్ దారుడు డిసెంబర్ 17 పింఛన్‌దారుల దినోత్సవ కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరుకావాలి. పింఛన్ ఉద్యమాలకు నేతృత్వం వహించిన నాయకుల పోరాటా న్ని గౌరవించాలి. తమ సంఘాల పట్ల సంఘీభావంను బలంగా తెలియజేయాలి. భవిష్యత్తు తరాల కోసం పింఛన్ వ్యవస్థను రక్షించేందుకు తమ వంతు కృషి చేయాలి. ఈరోజు మనం ఐక్యంగా నిలబడి పోరాటానికి సిద్ధం కాకపోతే రాబోయే తరాలు ఎదుర్కొనే భారాలు మరింత పెరుగుతాయి. ఈ పోరాటం రాబోయే తరాలకు మార్గదర్శకం.

(డిసెంబర్ 17న జాతీయ పింఛన్ దారుల దినోత్సవం సందర్భంగా)

-టి.ఎమ్.బి. బుచ్చిరాజు,

ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్

97034 25006

Next Story