పెగాసస్.. దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేయగలదా?

by Ravi |   (  Updated:2025-05-02 01:15:54  IST  )

ఒక దేశానికి దేశద్రోహుల ప్రైవసీలోకి ప్రవేశించి జొరబడి వారి పథకాలేమిటి? వారి ప్రణాళికలు ఏమిటి?

పెగాసస్.. దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేయగలదా?
X

ఒక దేశానికి దేశద్రోహుల ప్రైవసీలోకి ప్రవేశించి జొరబడి వారి పథకాలేమిటి? వారి ప్రణాళికలు ఏమిటి? అనేది తెలుసు కోవడానికి సులభమైన మార్గం కావాలి. ఈ అవసరాన్ని నేడు ఇజ్రాయిల్ దేశంలోని ఎన్ఎస్ఓ కంపెనీకి చెందిన పెగాసస్ తీర్చింది. ఆ మధ్య పెగాసస్ మన దేశాన్ని ఒక్క ఊపు ఊపింది. మన దేశంలోని వ్యక్తులపై ప్రతిపక్ష నాయకుల, కార్యకర్తల, జర్నలిస్టుల ఫోన్‌ల ప్రైవసీకి అఘాతం కలిగిందనీ, వీరి ఫోన్‌లో పెగాసస్‌ను ఇన్‌స్టాల్ చేశారనీ ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టులో పిటిషన్ సైతం దీనిపై నమోదైంది.

పెగాసస్ అనేది ఒక సాప్ట్‌వేర్. దీని కొనుగోలు అమ్మకాలు రహస్యంగా జరుగుతాయి. ఎన్ఎస్ఓ అనే కంపెనీ, మరోవైపు ఇజ్రాయిల్ రాజ్యం చెట్టాపట్టాలు వేసుకుని దేశాలను గుప్పెట్లో పెట్టుకొని సర్వే‌లైన్స్ పనుల్ని అత్యంత రహస్యంగా చేపడతాయని వీటి మీద చాలా విమర్శలు ఉన్నాయి. ఇద్దరు క్లాస్‌‌మేట్స్, స్నేహితులు ఇజ్రాయిల్‌లో పెగాసస్‌కు పునాది వేశారు. మొరాకో ముందుగా ఈ పెగాసస్ కొనుగోలు చేసింది. NSO ప్రకారం, మొరాకో దేశం పెగాసస్‌కి టెస్టింగ్ గ్రౌండ్. 2013లో మూడు ఏజెన్సీల మీద ప్రయోగం చేసింది. అనుకున్న ఫలితాలను సాధించింది. దాంతో 7.7 మిలియన్ డాలర్లు ఖర్చు చేసి మొరాకో ప్రభుత్వాధినేతకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల ఫోన్లలో ఇన్‌స్టాల్ చేశారు. ఒక పెద్ద డ్రగ్ మాఫియాను పట్టుకున్నారు. ఎంతోమంది హక్కుల కార్యకర్తలను అరెస్టు చేశారు.

ప్రభుత్వాల చేతిలో పెగాసస్

ఆ తర్వాత, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పనామా, కెన్యా, టర్కీ కూడా దీన్ని కొనుగోలు చేశాయి. ఏ దేశం కూడా మంచి పనుల కోసం కొనలేదు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న రచయితల మీద, కార్యకర్తల మీద, జర్నలిస్టుల మీద నిఘా ఉంచడానికి వీరికి పెగాసస్ బాగా పనికొచ్చింది. అందుకోసం కోట్ల కొలది డబ్బు ఖర్చు పెట్టారు. ప్రఖ్యాత వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్టు విషాదకర హత్య తెలిసిందే. జమాల్ ఖసోగ్గిని ఇస్తాన్‌బుల్‌లో చంపేశారు. ఆయన మరణం వెనుక కూడా పెగాసస్ పాత్రే ఉందని తెలిసిందే. ఆయన ఫోన్‌లో పెగాసస్‌ను ఇన్‌స్టాల్ చేసి ఆయన కదలికలను కనిపెట్టి ఎన్ఎస్ఓ కంపెనీ యుఏఈకి ఎప్పటికప్పుడు రహస్యసమాచారాన్ని అందించింది. ఆ తర్వాత, ఎన్ఎస్ఓ మీద అమెరికా కూడా ఆంక్షలు విధించింది. అయితే, అది తాత్కాలికమే. అమెరికా, ఇజ్రాయిల్ మధ్య ఉన్న బాంధవ్యం ఈ వ్యాపారానికి అడ్డుకట్ట చెయ్యలేకపోయింది.

అమెరికా, రష్యాలకూ అదే దిక్కు

ఇజ్రాయెల్ దేశం సర్వే‌లైన్స్ సేవలలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. చివరికి అమెరికా, రష్యా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇజ్రాయిల్ రూపొందించిన అనేక రకాల నిఘా సాప్ట్‌వేర్ల మీద ఆధారపడి ఉన్నాయి. అత్యంత ఉన్నతమైన సర్వే‌లైన్స్ సేవలను ఇజ్రాయిల్ నేడు ప్రపంచంలోని చాలా దేశాలకు అందిస్తుంది. పాలస్తీనాను నియంత్రించడానికి కూడా పెగాసస్‌తో పాటు ఇతర సాఫ్ట్‌వేర్‌లు ఇజ్రాయిల్‌కు పనికొస్తున్నాయి. ఈ నేపథ్యంలో, భారత దేశంలో కూడా ఆ మధ్య పెగాసస్ అనే ఒక సాఫ్ట్‌వేర్ చాలామంది మొబైల్ ఫోన్లలో ఇన్‌స్టాల్ అయినట్లు విన్నాం. అందులో, రాజకీయ నాయకులు, కార్యకర్తలూ, ప్రఖ్యాత జర్నలిస్టులూ, రచయితలూ ఉన్నారు. దీంతో ప్రభుత్వంపై ఎంతో వ్యతిరేకత వచ్చింది. వారు కోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉంది. దీనిపై నిజనిజాలు కోర్టులు తెలియజేస్తాయి.

24 గంటలూ నిఘా వేసే సీఐడీ

పెగాసస్ చాలా శక్తివంతమైన సాఫ్ట్‌వేర్. మిస్డ్ కాల్ ద్వారా లేదా ఓపెన్ చెయ్యని వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలీకుండానే ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఇది ఫోన్‌లో ఒక్కసారి ఇన్‌స్టాల్ అయితే, అవతలి వ్యక్తులు మన కదలికలను నియంత్రించగలరు. మన ఫోన్‌ను నియంత్రించగలరు. మనం వాట్సాప్‌లో నడుపుతున్న సంభాషణ ఇది ఎన్‌క్రిప్టెడ్ అయినప్పటికీ కూడా దాని వేయి ముక్కల్ని కలిపేసి మొత్తం వాక్యాలను చదవగలదు. మన కెమెరా ని ఓపెన్ చెయ్యగలదు. మనం ఎక్కడికి వెళ్తున్నామో మన ఆచూకీ అంతా కూడా తెలుసుకొని ఆయా కంపెనీలకు, ప్రభుత్వాలకు అందించగలదు. ఒక రకంగా మన కాళ్లు చేతులు కట్టేసి 24 గంటల్లో మనల్ని కనిపెట్టుకొని ఉంచే సీఐడీ పెగాసస్.

వ్యక్తుల్ని నిర్వీర్యం చేసే సాధనం

పెగాసస్ చీకటి కోణాల మీద వ్యతిరేకత ఎంత ఉందో, దాని మీద ఆధారపడడం కూడా అంతే ఉంది. దాన్ని కొనుక్కొని అవతలి వ్యక్తుల స్మార్ట్ ఫోన్‌లోకి పంపించి, వారి రహస్యాలని తెలుసుకొని, దొరికిన వారిని దొరికించుకొని తమ అవినీతి సామ్రాజ్యాలను కొనసాగించుకొనే రాజ్యాలు కూడా లేకపోలేదు. కాబట్టి, పెగాసస్ అనేది ఒక సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను మెల్లమెల్లగా ప్రజలకు దూరంగా తరిమేసే సాధనాలుగా కూడా ఇలాంటివి పనికొస్తున్నాయని తెలుస్తోంది. ప్రశ్నించడం ప్రజాస్వామ్యం లో అతి ముఖ్యమైన అంశం. పార్లమెంట్‌లో అయినా, మీడి యాలో అయినా, కోర్టులో అయినా, దేశంలో ఎక్కడైనా సరే... ప్రశ్న ద్వారానే, నిరసన ద్వారానే ప్రజాస్వామ్యం బ్యాలెన్స్ అవుతుంది. మరి ఆ ప్రశ్నల్ని వేస్తున్న పౌరుల ఫోన్లలో ఇలాంటి భయంకరమైన పెగాసస్‌లను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు ప్రశ్నించే మనిషి తనకు తెలియకుండానే బలహీనమైపోతాడు. రాజ్యం ఆ వ్యక్తిని బలహీనం చేసేసి తన్ను తాను మరింత బలపరుచుకొని ప్రజా వ్యతిరేక విధానాలను మరింత పకడ్బందీగా కొనసాగిస్తూ ప్రజలకు దూరంగా జరుగుతుంది. అంతర్జాతీయ పెట్టుబడికి కూడా ఇలాంటి రాజ్యాలే కావాలి మరి.

- కేశవ్

ఆర్థిక సామాజిక విశ్లేషకులు

98493 28496

Next Story