- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్ది కథ కాదు.. క్రీడారంగం వినాల్సిన వాస్తవం
రాంచరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా ఆత్మగౌరవం, గుర్తింపు కోసం పోరాటాన్ని ప్రతిబింబిస్తే, నిజ జీవితంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన క్రీడాకారులు ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాల అసమానతలు, సమాన ప్రోత్సాహం అవసరాన్ని ఈ వ్యాసం విశ్లేషిస్తుంది.

తాజాగా బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో రాంచరణ్ హీరోగా వచ్చిన పెద్ది సినిమా పాన్ ఇండియా స్థాయిలో సినిమా మంచి ప్రజాధరణ పొందు తున్నది. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ విజయ నగరం అడవి కొండలో పుట్టిన పీడిత కులాల వ్యక్తి అయినప్పటికీ సహజంగా శ్రామిక వర్గం ఐన భూమి పుత్రుడు కాబట్టి అగ్రకులాల కంటే దీటుగా క్రికెట్, కుస్తీ, దివ్యాంగుల పరుగు పోటీల్లో అత్యంత అద్భుతంగా విజయాలు సాధిస్తాడు. పెద్ది వంటి సినిమాలు ప్రేక్షకులను బలంగా ఆకట్టుకో వడానికి కారణం వాటిలో కనిపించే ఆత్మగౌరవం, గుర్తింపు కోసం చేసే పోరాటం. సినిమాలో హీరో తన గ్రామానికి, తన సమాజానికి గౌరవం తీసుకురావడానికి ఎన్నో అవమానాలు, అడ్డంకులను అధిగమించి విజయం సాధిస్తాడు. అలాంటి కథలు ప్రజల్లో భావోద్వేగ అనుబంధాన్ని కలిగిస్తాయి. అయితే నిజ జీవితంలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ వంటి పీడిత వర్గాలకు చెందిన అనేక మంది క్రీడాకారులు అపారమైన ప్రతిభ కలిగి ఉన్నప్పటికీ, సామాజిక, ఆర్థిక, భౌగోళిక అసమానతల కారణం గా సరైన అవకాశాలు పొందలేకపోతున్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కొరత, నాణ్యమైన శిక్షణ లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ఎంపిక ప్రక్రియల్లో పారదర్శకత లోపించడం వంటి సమస్యలు వారి ఎదుగుదలకు అడ్డంకులుగా మారుతున్నాయి. సినిమాల్లో అట్ట డుగు వర్గాల వ్యక్తి విజయాన్ని చూసి మనం చప్పట్లు కొడతాం. కానీ నిజ జీవితంలో అదే వర్గాలకు చెందిన క్రీడాకారులు గుర్తింపు, గౌరవం, అవకాశాల కోసం నిరంతరం పోరాడాల్సిన పరి స్థి తి ఇంకా పూర్తిగా మారలేదు. ప్రతిభకు కులం, మతం, ప్రాంతం అనే తేడాలు ఉండవు. అందువల్ల ప్రభుత్వాలు, క్రీడా సంస్థలు సమాన అవకాశాలు కల్పించి, గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల క్రీడాకారులను ప్రత్యేకంగా ప్రోత్సహించాలి. అలా చేస్తే భారత క్రీడా రంగానికి మరింత విస్తృతమైన ప్రతిభ అందుబాటులోకి వస్తుంది. ఫలితంగా అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్ఠ పెరగడమే కాకుండా, సామాజిక సమానత్వం మరియు న్యాయం కూడా బలోపేతం అవుతాయి.
-పుల్లెంల గణేష్
95530 41549






