నోటి మాటతో చట్టాలు... మూగబోయిన ప్రజాస్వామ్యం

by Ravi |   (  Updated:2026-02-10 01:00:33  IST  )

నాడు మహాత్ముని పిలుపుమేరకు దేశవ్యాప్తంగా సాగిన శాసనోల్లంఘన స్వాతంత్య్ర సమరంలో ఒక ఉజ్వల ఘట్టం. నేడు చట్టసభలన్నిటా కొనసాగు తున్న సభా నియమాల ఉల్లంఘన మాత్రం ఒక విపర్యం..

నోటి మాటతో చట్టాలు... మూగబోయిన ప్రజాస్వామ్యం
X

నాడు మహాత్ముని పిలుపుమేరకు దేశవ్యాప్తంగా సాగిన శాసనోల్లంఘన స్వాతంత్య్ర సమరంలో ఒక ఉజ్వల ఘట్టం. నేడు చట్టసభలన్నిటా కొనసాగు తున్న సభా నియమాల ఉల్లంఘన మాత్రం ఒక విపర్యం. గతేడాది లక్నోలో జరిగిన 86వ అఖిల భారత చట్టసభాధిపతుల (ప్రిసైడింగ్ ఆఫీసర్స్) సదస్సు (AIPOC)లో, శాసనసభలు సమర్థంగా, బాధ్యతాయుతంగా పనిచేయాలంటే సభ్యుల పనితీరును, సామర్థ్యాన్ని మెరుగు పరచాల్సిన అవసరం ఉందని స్పష్టంగా పేర్కొన్నారు.

ఏమాటకామాటే చెప్పుకోవాలి.. చట్టసభల సమయాన్ని వృధా చేసే విషయంలో ఏ రాజకీయ పక్షమూ తక్కువ తినలేదు.. అధికారంలో ఉన్నప్పుడు శ్రీరంగనీతులు వల్లిస్తారు.. ప్రతిపక్షంలోకి రాగానే, తాము గతంలో తప్పుబట్టిన పద్ధతులనే అనుసరిస్తారు.

కుదరదు.. చూద్దాంలే..

కేంద్ర కార్మిక విద్యాసంస్థ దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ విద్యా కేంద్రాల్లో నిర్వహించే కార్మిక ఉపాధ్యాయ శిక్షణ తరగతుల్లో పాటించే పద్ధతుల్లో ‘పాత్ర పోషణ’ (రోల్ ప్లే) ఒకటి. నేను విద్యాధికారిగా పని చేస్తున్నప్పుడు, ఒకసారి పాత్ర పోషణకు ‘ఉమ్మడి బేరం’ అంశాన్ని తీసుకున్నాం. పారిశ్రామిక సంబంధాల్లో కార్మికుల కోర్కెల పరిష్కారం దిశగా, కార్మిక సంఘ ప్రతినిధులు – యాజమాన్య ప్రతి నిధుల మధ్య జరిగే చర్చలనే ‘ఉమ్మడి బేరం’ (కలెక్టివ్ బర్గెయినింగ్) అంటారు.. సిబ్బంది వ్యవహారాల అధికారి (పర్సనల్ మేనేజర్) పాత్ర పోషణలో లీనమైపోయిన ఒక శిక్షణార్థి, కుర్చీలో ముందుకు వెనక్కు ఊగుతూ, ఎదుటివారు ఏమి చెప్పినా ‘కుదరదు’, ‘చూద్దాం’ అన్న నిర్లక్ష్య ధోరణితో పాత్రకు ‘రక్తి’ కట్టించాడు. మిగతా శిక్షణార్థులు చప్పట్లతో అభినందించారు. ఎందుకంటే వాళ్ల వాళ్ల కర్మాగారాల్లో యాజమాన్య ప్రతినిధులు చర్చల సమయంలో అలాగే వ్యవహరిస్తారని చెప్పారు.. ఇదే ధోరణి దేశ ప్రజా ప్రయోజనార్థం చట్టాలు రూపొందించాల్సిన గౌరవ సభ్యులు కూడా అనుసరించడం మన దురదృష్టం.

ఈ మాటలు ఊరికే అనడం లేదు..

2014-2014లో యూపీఏ పాలనలోనూ, 2014 నుంచి నేటివరకు ఎన్డీయే పాలనలోనూ పరిస్థితి సేమ్ టు సేమ్ అనేలాగా తయారైంది. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం, కామన్‌వెల్త్ క్రీడల అవినీతి, బొగ్గు గనుల కేటాయింపుల వ్యవహారం, లోక్ పాల్, ఎఫ్‌డీఐల పెరుగుదల వంటి అంశాలపై నాటి పార్లమెంటులో సభాకార్యక్రమాలను స్తంభింప‌జేశారు. ఇంక ఎన్డీయే పాలనలో 2015లో భూసేకరణ బిల్లు, 2016లో నోట్ల రద్దు, 2018లో రాఫెల్ ఒప్పందం, మూడు వ్యవసాయ చట్టాలు, అదానీ గ్రూప్ అంశం, మణిపూర్ హింస, కేంద్ర దర్యాప్తు సంస్థల రాజ కీయీకరణ వంటి అంశాలపై సభా కార్యక్రమాలను నిరంతరం అడ్డుకున్నారు..

విపక్ష వాదన వినకుండానే చట్టాలు..

ఫలితంగా క్రమశిక్షణ పేరిట బహిష్కరణలు కూడా రాజకీయ ఆయుధాలుగా మారాయి. వ్యవసాయ బిల్లుల ఆమోద సమయంలో సభా నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో 8 మంది రాజ్యసభ సభ్యులను వారం రోజుల పాటు బహిష్కరించారు.. 2023లో అదానీ గ్రూప్, మణిపూర్ హింస అంశాలపై నిరసనల నేపధ్యంలో ఈ సంఖ్య 140కి చేరింది. ఈ దుష్పరిణామాల కారణంగా పూర్తి స్థాయి చర్చలు లేకుండానే కీలక బిల్లులు చట్టాలుగా మారుతున్నాయి. ప్రశ్నోత్తరాల గంటలు రద్దవడం, అత్యంత ప్రాధాన్యమున్న బిల్లులను నోటి మాటతో (Voice Vote) ఆమోదించడం, ఉభయసభల సెలెక్ట్ కమిటీలకు పంపే సంప్రదాయం క్షీణించడం, రాజ్యసభ పాత్రను పరిమితం చేయడం, విపక్ష వాదన వినకుండానే చట్టాలు చేయడం పరిపాటిగా మారింది.

నోటి మాటతో కీలక బిల్లుల ఆమోదం..

మన దురదృష్టం ఏమంటే ఈ పరిస్థితి ప్రస్తుత లోక్‌సభ, రాజ్యసభ సమావేశాల్లోనూ పునరావృతమవుతోంది. వర్షాకాల, శీతాకాల సమావేశాల్లో 20 కంటే ఎక్కువ సందర్భాల్లో పత్రాలు చించి వేయడం లేదా ప్లకార్డులు ప్రదర్శిం‌చడం, 10-15 సార్లు వెల్‌లోకి దూసుకెళ్లడం, 3-4 సందర్భాల్లో మేజాలపై ఎక్కడం, మైకులు విసరడం, పరిక‌రాలను ధ్వంసం చేయడం జరిగాయి. లోక్‌సభలో కేంద్రమంత్రి మాటల్లోనే ‘మర్చంట్ షిప్పింగ్ బిల్లు- 2025’, ‘క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు’ అనే రెండు ముఖ్యమైన చట్టాలు నోటిమాటతో ఆమోదించబడ్డాయి. రాజ్యసభలో కూడా ‘మణిపూర్ జీఎస్టీ సవరణ బిల్లు’ వంటి మరికొన్ని బిల్లులు, విపక్షం నిరసనగా వెల్‌ఔట్ చేసిన సందర్భాల్లో చివరి నిమిషాల్లో ఆమోదం పొందాయి.

అడ్డంకుల వేదికగా చట్టసభలు..

ఇది జరుగుతున్న కథ. రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా ‘పార్లమెంట్ చర్చ వాదన నిర్ణయాల వేదికగా ఉండాలే తప్ప, అడ్డంకుల వేదికగా మారకూడదు’ అని రాజ్యసభ మాజీ సభాపతి వెంకయ్య నాయుడు చేసిన హితబోధను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కాగా, ఇటీవల లోక్‌సభ స్పీకర్ అన్ని రాజకీయ పక్షాల నాయకులు, సభ్యులు సభా నిర్వహణ సజావుగా సాగేందుకు సహకరించాలని చేసిన విజ్ఞప్తి ఫలిస్తుందో, లేదో మరోసారి చెవిటివారి ముందు ఊదిన శంఖమే అవుతుందో చూడాలి..

- మల్లాప్రగడ రామారావు

99898 63398

Next Story