పేరెంటింగ్ లోపాలు.. పెరుగుతున్న కుటుంబ సంక్షోభం!

by Ravi |   (  Updated:2026-05-26 01:00:32  IST  )

పిల్లల విపరీత ప్రవర్తనతో కుటుంబాలు మానసిక వేదన, సామాజిక అవమానాలను ఎదుర్కొంటున్నాయి. డ్రగ్స్, సోషల్ మీడియా, పేరెంటింగ్ లోపాలు యువతను ఎలా ప్రభావితం చేస్తున్నాయో.. ఈ గ్లోబల్ ఫ్యామిలీ క్రైసిస్‌పై ప్రత్యేక విశ్లేషణ..

పేరెంటింగ్ లోపాలు.. పెరుగుతున్న కుటుంబ సంక్షోభం!
X

బయట ప్రపంచానికి నవ్వుతూ కనిపించే కుటుంబాల్లో.. లోపల కన్నీళ్లు, అవమానం, భయం, నిద్రలేని రాత్రులు పెరుగుతున్నాయి. కొంతమంది పిల్లల ప్రవర్తన వల్ల సమాజం ముందర తలెత్తుకోలేని పరిస్థితులు వస్తున్నాయి. కుటుంబాలు విరిగిపోతు న్నాయి, మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి, ఇది ఇప్పుడు ఒక ఇంటి సమస్య కాదు. ఒక గ్లోబల్ ఫ్యామిలీ క్రైసిస్. ఇది కేవలం ‘చెడు పిల్లల సమస్య’ కాదు. ఇది ఒక పెద్ద సామాజిక, మానసిక, డిజిటల్ సంక్షోభం..

కష్టం విలువ తెలియకుండా పెంచడమే నేటి తరం తల్లిదండ్రులు చేస్తున్న అతిపెద్ద పొరపాటు. పిల్లల ప్రవర్తన అనేది ఒకే రోజులో వికృతంగా మారదు. ‘నేను తప్పు చేస్తే మా నాన్న నన్ను కాపాడలేడు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అనే సందేశం పిల్లల మనస్సులో బలంగా నాటాలి. అది ఒక నిరంతర ప్రక్రియ. కాబట్టి, తల్లిదండ్రులు తమ హోదా, అహంకారాలను పక్కన పెట్టి, పిల్లల ఎదుగుదలను నిశితంగా గమనించినప్పుడే ఇలాంటి సామాజిక ట్రాజెడీలను అరికట్టవచ్చు.

సమస్యకు ప్రధాన కారణాలు..

ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల విపరీత ప్రవర్తనల వల్ల మానసిక వేదనను, సామాజిక అవమా‌నాలను ఎదుర్కొంటున్నారు. పిల్లల ప్రవర్తనలు కుటుంబాల ఇమేజ్‌ను ఒక్కసారిగా మట్టికరిపిస్తున్నాయి. ఈ సమస్య కేవలం ఒక కుటుంబానికో పరిమితమైంది కాదు. ఇది ఒక తీవ్రమైన సామాజిక, మానసిక సమస్య. దీని వెనుక ఉన్న కారణాలను శాస్త్రీయ దృక్పథంతో, సామాజిక-మానసిక పరిశోధనల ఆధారంగా విశ్లేషిస్తే పలు ఆసక్తికరమైన, ఆందోళనకరమైన నిజాలు బయటపడతాయి. సైకాలజీ, సోషియాలజీ ప్రకారం నేటి యువతలో పెరు గుతున్న విపరీత ప్రవర్తన వెనుక తల్లిదండ్రుల నిర్లక్ష్యం, స్నేహితుల ప్రభావం, డ్రగ్స్, సోషల్ మీడియా వంటి అనేక కారణాలు ఉన్నాయి. తల్లిదండ్రులు పిల్లలతో గడిపే సమయం తగ్గుతోంది. ఈ మానసిక ఒంటరితనం పిల్లలను తప్పుదారుల్లోకి నెడుతోంది. రెండోవది ‘మా పిల్లలు మంచివాళ్లు’ అనే గుడ్డి నమ్మకం, చిన్న తప్పులను నిర్లక్ష్యం చేయడం, భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారి తీస్తోంది. మూడోది కష్టపడకుండానే అన్నీ దొరకడం వల్ల ఓపిక, బాధ్యత, విలువల పట్ల గౌరవం తగ్గుతోంది. అందుకే అనుకున్నది జరగకపోతే కోపం, హింస పెరుగుతున్నాయి. నాల్గొవది పార్టీలలో పాల్గొంటూ డ్రగ్స్ సేవించడం, ఐదోవది సోషల్ మీడియా ప్రభావంతో ‘నేను కూడా అలాగే ఉండాలి’ అనే ఒత్తిడి వారిని తప్పుడు మార్గాల్లోకి నెడుతోంది.

గణాంకాలు ఏం చెబుతున్నాయి?

ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవడానికి గ్లోబల్, జాతీయ స్థాయి గణాంకాలు కొన్ని నిజాలను నొక్కి చెబుతున్నాయి. ఎన్‌సీఆర్‌బీ నివేదికల ప్రకారం దేశంలో జువైనల్ క్రైమ్స్ (మైనర్ల నేరాలు) గత దశాబ్ద కాలంలో గణనీయంగా పెరిగాయి. ఇందులో కేవలం పేద వర్గాల పిల్లలే కాదు, సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసుల్లో ఉన్నత విద్యావంతులు, సంపన్న కుటుంబాల పిల్లల సంఖ్య వేగంగా పెరుగుతోంది. WHO లెక్కల భారతదేశంలో 15-24 ఏళ్ల మధ్య వయసున్న యువతలో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగినట్లు సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాలు, ఐటీ హబ్‌లు, నైట్ లైఫ్ కల్చర్ పెరగడం వల్ల డ్రగ్స్ నెట్‌వర్క్ సంపన్న వర్గాల పిల్లలను టార్గెట్ చేస్తోంది. గ్లోబల్ పేరెంటింగ్ సర్వేల ప్రకారం, రోజుకు కనీసం 30 నిమిషాలు పిల్లలతో నాణ్యమైన సమయం కూడా ఇవ్వని లేదా గడపని కుటుంబాల్లోని పిల్లలు వ్యసనాలకు, డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశం 40% ఎక్కువగా ఉంటుందట.

దీనికి పరిష్కారం ఏమిటి?

తల్లిదండ్రులు తమ కష్టార్జితాన్ని, గౌరవాన్ని కాపాడు కోవాలంటే పేరెంటింగ్ శైలిలో కొన్ని శాస్త్రీయ మార్పులు చేసుకోవాలి. అథారిటేటివ్ పేరెంటింగ్ సైకాలజీ ప్రకారం ఇది అత్యంత విజయవంతమైన పద్ధతి. దీని ప్రకారం పిల్లలపై అధికారం చలాయించడం కాకుండా, అలాగే వారిని పూర్తిగా వదిలేయడం కాకుండా.. ప్రేమను చూపిస్తూనే కచ్చితమైన హద్దులను విధించాలి. డబ్బుతో ప్రేమను కొనలేరు, తల్లిదండ్రులు తమ పిల్లలకు అడిగిందల్లా ఇవ్వడం ద్వారా తమ కంట్రోల్లో ఉంటారనే భ్రమలో బతుకుతారు, కానీ అది నిజం కాదు. వాటికి బదులుగా పిల్లలకు రోజు అరగంట సమయం ఇచ్చి వారి స్నేహితులు ఎవరు? వారు ఖాళీ సమయంలో ఏం చేస్తున్నారు? వారి ఆర్థిక అవసరాలు ఏంటి? అనే విషయాలపై నిఘా ఉంచాలి. ముఖ్యంగా నైతిక విలువలు గురించి చిన్నతనం నుంచే సామాజిక బాధ్యత, ఇతరుల పట్ల గౌరవం, చట్టం పట్ల భయం నేర్పించాలి. తల్లిదండ్రులు తమ హోదా, అహంకారాలను పక్కన పెట్టి, పిల్లల ఎదుగుదలను నిశితంగా గమనించినప్పుడే ఇలాంటి సామాజిక ట్రాజెడీలను అరికట్టవచ్చు.

-డాక్టర్. కేశవులు బి. ఎండీ

చైర్మన్ తెలంగాణ మేధావుల సంఘం

85010 61659

Next Story