గడ్డిమందుకు గడ్డి పెట్టేదెప్పుడు?

by Ravi |   (  Updated:2026-03-05 01:01:22  IST  )

పారాక్వాట్ అనే రసాయన మందు ప్రమాదాలు, రైతులు, పశువులపై దాని ప్రభావం ఎలా ఉంటుందో వివిధ దేశాల్లో ఈ మందు ఎందుకు నిషేధించబడింది? భారత్‌లో ఇంకా విస్తృతంగా ఎలా అందుబాటులో ఉందో తెలుసుకోండి.

గడ్డిమందుకు గడ్డి పెట్టేదెప్పుడు?
X

కాలం గిర్రున తిర్గుతున్నది. ఈ క్రమంలో ఎన్నో మార్పులు, ఎన్నెన్నో చేర్పులు చోటు చేసుకుంటు న్నయి. అందులో భాగంగానే ఎవుసం ఆధునీకరించ బడుతున్నది. యంత్రాలు సాగులో మంత్రాలు జేస్తనే ఉన్నయి.. సాగు ఆధునీకరణ చెందితే సంతోషమే గానీ, ఆ ఆధునీకరణ మానవ సమాజాన్ని సంపేసే దిశగా దూసుకువస్తేనే అసలు సమస్య..

సాగులో యంత్రాలు ప్రవేశించడం మూలాన గొడ్డూ, గోదా అవసరం లేకుండా పోయింది. తత్ఫలితంగా మారుమూల గ్రామీణ ప్రాంతాలల్లో పశువులు అంతరించిపోతున్నయి. పశువులు అంతరించిపోవడం మూలంగానే పొలాల్లో పెరుగుతున్న పచ్చగడ్డి నేడు పనికి రాకుండా పోతున్నది. ఆ పనికిరాని పచ్చగడ్డిని కూలీల చేత కోయించడం రైతులకు ఖర్సుతో కూడుకున్న పనే కాదు, రైతుల సమయం కూడా వృథా అవుతున్నది. అందుకే, రైతులు గడ్డిమందు మీద ఆధారపడుతున్నరు.. రైతుల అవస‌రాన్ని ఆసరాగా చేసుకుంటున్న పలు రసాయనాల కంపెనీలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డయి. ఆ పోటీ ఫలితమే ఈ ‘పారాక్వాట్‌’ అనే విరుగుడు లేని విషపు మందు పుట్టుక. నేను ఐదో తర్గతి సదువుతున్న రోజులు.. కరీంనగర్‌ జిల్లాలోని మానకొండూ‌ర్‌ నా పుట్టినూరు. మా పెద్దబాపుకు రెండెకురాల భూమి ఉండేది. అది సాగు చేయడానికి ఓ ఎవుసం బాయి గూడ ఉన్నది. ఆ రెండెకురాలల్ల సగం వరి పంట సాగు చేయంగ, మిగతా సగంలో పల్లి, మక్క, కందులు, పెసర వంటి రకరకాల పంటలు సాగు జేసేటోడు. ఇదంతా ఒకెత్తయితే, ఆయనకు పదుల కొద్దీ బర్లు (పశువులు) ఉండేటియి. వాటిని యాజ్జేసుకుంటె పెద్ద బర్ల కొట్టం (పశువుల కొట్టం) ఇప్పటికీ నా కండ్ల ముందు మెరుస్తది. అయితే పెద్దబాపు సంపాదనంతా ఈ బర్లతోనే.. పెద్దబాపు తన ఎవుసం భూమి సాగు జేస్తుండగా పంటలల్ల, ఒడ్ల పొంటి కలుపు మొక్కలు ఎక్కువగా పెరిగేటియి. సాయంత్రమైతే సాలు పెద్దబాపు రోజు ఒడ్లపొంటి పెరిగిన గడ్డి కోస్కరావడానికి పొలం కాడికి వోయేటోడు. బడికెళ్లి సాయంత్రం ఇంటికి రాంగనే నేను మా కుటుంబం ఆయన తోటి పచ్చగడ్డిని కొడళ్లతోని కోసేటోళ్లుం. ఆ కోసిన పచ్చగడ్డిని మా బర్లు ఇష్టంగా తినేటివి..

విరుగుడు లేని మందు..

‘పారాక్వాట్‌’ అంటే ఏమిటీ? దీని పర్యావసానాలేంటో ఇప్పుడు సూద్దాం. ‘పారాక్వాట్‌’ ఒక విరుగుడు లేని మందు.. పంట పొలాల్ల పెరిగే కలుపు మొక్కలకు ఈ మందు కొడితే ఆ మొక్కలు వెంటనే సచ్చిపోతయి.. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే! ఇంకో వైపు జూస్తే అంతులేని శోకం మనక్కనవడ్తది. ఈ ‘పారాక్వాట్‌’ మందు ద్వారా ఎన్నో నష్టాలున్నయి. ఎవుసం అంటేనే రైతుకు కత్తిమీద సాము.. ఎవుసం రైతును ఎప్పుడెత్తుకుంటదో, ఎప్పుడెత్తేస్తదో తెల్వదు. ఎవుసం జేస్తే అచ్చిన నట్టాలో, లేకుంటే అప్పుల బాధలో, ఇంకా ఏ ఇతర కారణాలో తెలియదు గానీ క్షణికావేశంలో దేశవ్యాప్తంగా వేలమంది రైతులు ఈ ‘పారాక్వాట్‌’ మందు తాగి తమ ఉసురు తీసుకుం‌టున్నరు. అయితే ఈ మందుకు విరుగుడు లేదు. నాలిక మీద ఒక సుక్క వడ్డా పానం వోతది. ఇది తాగిన మనుషుల పానాలు కాపాడటం డాక్టర్ల వల్లనే గాదు, ఆ దేవుని వల్ల గూడ కాదట! అందుకే ఈ ‘పారాక్వాట్‌’ మందును రద్దు జేయాల్నని ఎవుసాయాధికారులు, డాక్టర్లు డిమాండ్‌ జేస్తున్నరు.

ఎందుకు నిషేధించదు..?

ప్రపంచం మొత్తంగా దొరుకుతున్న ఈ ‘పారాక్వాట్‌’ మందును యురోపియన్‌ యూనియన్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ లాంటి దేశాలు పూర్తిస్థాయిలో నిషేధించినయి.. ఆస్ర్టేలియా, అమెరికా వంటి అనేక దేశాలు పరిమితులు, నియంత్రణలతో కూడిన అనుమతులిస్తున్నయి. కానీ, మన దేశంలో మాత్రం ఈ పారాక్వాట్‌ మందు విచ్చలవిడగా దొరుకుతున్నది. తమది కిసాన్‌ ప్రభుత్వమని గొప్పలకు వోయే ఎన్డీయే ప్రభుత్వం మాత్రం ‘పారాక్వాట్‌’ మందును పూర్తిస్థాయిలో నిషేధించడానికి ఎందుకో తటపటాయిస్తున్నది. మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ‘పారాక్వాట్‌’ మందును రద్దుజేసి తమది రైతుల బాగుకోరే సర్కారని నిరూపించుకోవాలి. కేరళ, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల లెక్క కనీసం మన తెలంగాణ రాష్ట్ర సర్కారైనా ఈ పారాక్వాట్‌ మందును రద్దు జేయాలి. ఆ దిశగా అడుగులు పడుతాయని ఆశిద్దాం.

- గడ్డం సతీష్‌,

99590 59041

Next Story