ఆయుధ ప్రయోగాలకు పాలస్తీనా ఒక ప్రయోగశాల.. ప్రజలు పరికరాలు మాత్రమే!

by Ravi |   (  Updated:2025-08-12 01:15:43  IST  )

పాలస్తీనా కోసం నేడు బ్రిటన్, కెనడా లాంటి దేశాలు మాట్లాడుతుండడం అంతర్జాతీయ చరిత్రలో వచ్చిన కొత్త మార్పుగా కనిపిస్తుంది.

ఆయుధ ప్రయోగాలకు పాలస్తీనా ఒక ప్రయోగశాల.. ప్రజలు పరికరాలు మాత్రమే!
X

పాలస్తీనా కోసం నేడు బ్రిటన్, కెనడా లాంటి దేశాలు మాట్లాడుతుండడం అంతర్జాతీయ చరిత్రలో వచ్చిన కొత్త మార్పుగా కనిపిస్తుంది. దాదాపు ఏడు దేశాలు పాలాస్తీనాను ఒక దేశంగా యూఎన్‌ఓ సమావేశంలో గుర్తిస్తామని ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్‌కి ఇదో తలబాధ వ్యవహారం అయింది. పరిస్థితి ఇంతవరకు పయనించిందీ అంటే దాని వెనుక నేపథ్యం కూడా అంతే బలంగా ఉంటుందని అర్థం.

నెతాన్యాహుకు కూడా నిరసన స్వరాలు ఈ దేశాల నుండి రావడం మింగుడు పడడం లేదు. తన అత్యాచారాలకు అంతర్జాతీయ మద్దతు లభిస్తుందని భావించిన నెతాన్యాహు కథ ఇలా అడ్డం తిరుగుతోంది ఏమిటని కంగారు పడుతున్నాడు. తన ట్రంప్ అన్నయ్య ఉండగా తనకు భయం ఏమిటి? ట్రంప్ తన మనుషులను గాజాకు పంపించి ఆకలి కడుపులకు న్యాయం చేసేస్తున్నట్టు భ్రమ కలిగిస్తున్నాడు. ఎంతైనా ఆయుధాల మిత్రుత్వం కదా!

కదిలించి వేస్తున్న ఆకలి చావులు..

పాలస్తీనా ఆకలి చావులు నేడు దేశ దేశాల ప్రజల్ని కదిలిస్తున్నాయి. ఎముకల గూళ్లతో కనిపించే చిన్నారుల ఫోటోలు మనసున్న, హృదయం ఉన్న ప్రతి మనిషినీ కదిలిస్తూ నిద్రపోనివ్వడం లేదు. ఇజ్రాయిల్ దారుణాల ఫలితంగా పంటలు లేని, ఉపాధి లేని, ఆహారం లేని ఒక పెద్ద ప్రజా సమూహం నేడు పాలస్తీనాలో పెరుగుతోంది. యుద్ధం నేడు భయంకరమైన కరువుకి దారి తీసింది. పాలస్తీనాను మరు భూమిగా మార్చేసింది. మానవ బాధల స్థాయి, మానవ గౌరవ విచ్ఛిన్నం అనేవి చాలా కాలంగా చట్టపరంగా, నైతిక పరంగా రెండింటిలోనూ ఆమోదయోగ్యమైన ప్రతి ప్రమాణాలను మించిపోయని అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు మిర్జానా స్పోల్జారిక్ అంటున్న మాటలు మనసున్న, జీవమున్న ప్రతి మనిషినీ కదిలించి వేస్తున్నాయి.

60 వేల మృతులు..

జూన్ 2 గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ రిపోర్ట్ ప్రకారం, రెండు సంవత్సరాల లోపల పిల్లలు 1860 మంది చని పోయారు. 7 అక్టోబర్ 2023లో హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ చేసిన ఘాతుకాలకు దాదాపు 60 వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 122 మంది ఆకలితో అలమటిస్తూ ప్రాణం విడిచారు. దాదాపు 28 వేల మంది పోషకాహార లోపంతో బాధపడు తున్నారు. దాడి తర్వాత ఈ ఘాతుకాలను అత్యంత నిబద్ధతతో రిపోర్ట్ చేస్తున్న 232 మంది బాధ్యతాయుతమైన జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు.

ఎవరి ప్రయోజనాల కోసం ఈ దారుణాలు..

ఆహారం కోసం కంచాలు పట్టుకొని నిలుచున్న ప్రజల్ని కూడా ఇజ్రాయెల్ నరహంతక సైన్యం విడిచి పెట్టడం లేదు. అలా నిలుచున్న 130 మందిని హతమార్చడం మరింత విస్మయం కలిగిస్తోంది. ఫలితంగా ఇజ్రాయెల్ మీద అంతర్జా తీయంగా ఒత్తిడి పెరుగుతోంది. గాజాలో ఆకలి చావులు ఏవీ లేవని నెతన్యాహు తోసి పుచ్చుతున్నా సరే, వాస్తవ చిత్రాలు ప్రజల ముందు మరోలా కనిపిస్తున్నాయి. రక్తహీనతతో పిల్లల శరీరాలూ, పోషకాహార లోపంతో విపరీతంగా బాధపడుతున్న గర్భిణీ స్త్రీలూ సాధారణ చిత్రాలు అయ్యాయి. ఆకలి, ఆకలి అని తిండి కంచాలు పట్టుకొని తోసుకుంటూ ఎయిడ్ సెంటర్ల ముందు హృదయవిదారకంగా బారులు తీరిన పిల్లలూ, స్త్రీలూ, పురుషులూ, వారి పాట్లు నాగరిక సమాజాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఆహారం అందించే వాహనాలు తమ భూభాగంలోకి ప్రవేశించగానే ఆ వాహనాల పైకి జనాలు ఎక్కి ఆహారం బస్తాలు లాక్కుపోయే సన్నివేశాలు ఎవరికైనా గుండెల్ని పిండి చేస్తాయి. ఏ వర్గ ప్రయోజనాల కోసం ప్రజలను ఇంతంత దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారు? ఇజ్రాయిల్ దారుణాలు ఇక ఆగవా? ఎన్నాళ్లు కొనసాగుతాయి? ఇంకా ఎంతమంది రక్తాన్ని తాగుతారు? వీరి రక్త దాహం తీరదా? మనదేశంలోని పత్రికలు ఎక్కడో ఓ మూలన పావు స్థలంలో ఆ కథనాలను అందిస్తూ ఉంటే, గార్డియన్ లాంటి బ్రిటన్ పత్రికలు రెండేసి పూర్తి పేజీల హృద్యమైన వార్తలను రెండు, మూడు రోజులుగా అందిస్తూ సభ్య సమాజాన్ని నిద్ర లేపుతున్నాయి.

బతికే అన్ని మార్గాలను మూసివేశారు..

ఇజ్రాయిల్ పాలస్తీనాలోని వ్యవసాయ భూముల్ని విషతుల్యం చేసింది. పరిశ్రమలను విధ్వంసం చేసింది. నేడు పాలస్తీనా భూభాగంలో వ్యవసాయం కొనసాగడం లేదు. పరిశ్రమలు కూడా లేవు. బయటి నుంచి ఆహారం ప్యాకెట్లు వస్తేనే తప్ప కడుపు నిండని దారుణమైన పరిస్థితి. ఇజ్రాయెల్ కుట్ర కూడా అదే. పాలస్తీనియన్లు బతకడానికి అన్ని రకాల దారులని కూడా మూసేయడమే ఇజ్రాయెల్ యుద్ధ నీతి. యుఎన్ఓతో పాటు ఇతర సంస్థలు అందించే ఫుడ్ సరఫరా కూడా ఆకలి కడుపులతో అలమటిస్తున్న ప్రజలకు అందకుండా, ఆ వాహనాలను కూడా పాలస్తీనాలోకి ప్రవేశిం‌చకుండా ఇజ్రాయెల్ అడ్డుకున్న పరిస్థితి ప్రపంచ మానవాళికి అత్యంత ఆశ్చర్యం కలిగిస్తుంది. యూఎన్‌ఓ ప్రకారం ఆహారం కోసం నిల్చున్న 1383 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయిల్ బాంబులు చంపేశాయి.

ఆయుధ పరీక్షల ప్రయోగశాల..

చావులు లేని పాలస్తీనా నేడు ఊహించడం కష్టం. ఇజ్రాయెల్ దారుణాలకు సామ్రాజ్యవాద దేశాలు సైతం ఆశ్చర్యానికి లోనవుతున్నాయి. హాస్పిటల్స్ మీద కూడా బాంబింగ్ చెయ్యడం కిరాతకం కాదా! పాలస్తీనా ప్రజలకు నిలువ నీడ లేకుండా చేసి ఆకలి మంటలతో నిస్సహాయంగా మిగిల్చే పన్నాగం ఇజ్రాయెల్‌కి ఉందని తెలుస్తోంది. దీనికి తోడు ఆయుధాల టెస్టింగ్ కూడా వ్యవస్థకు అవసరమే. ఈ ప్రయోగాలకు పాలస్తీనా ఒక ప్రయోగశాల, పాలస్తీనా ప్రజలు పరికరాలు మాత్రమే!

-కేశవ్

ఆర్థిక సామాజిక విశ్లేషకులు

98313 14213

Next Story