P4 ఎప్పటి నుంచో ఉపాధ్యాయులు అనుసరిస్తున్న విధానమే!

by Ravi |   (  Updated:2025-08-05 01:01:02  IST  )

సమాజాన్ని అభివృద్ధిలో నడిపించడానికి ప్రభుత్వాలు అనేక రకాలైన పాలసీ విధానాలను తెర ముందుకు

P4 ఎప్పటి నుంచో ఉపాధ్యాయులు అనుసరిస్తున్న విధానమే!
X

సమాజాన్ని అభివృద్ధిలో నడిపించడానికి ప్రభుత్వాలు అనేక రకాలైన పాలసీ విధానాలను తెర ముందుకు తీసుకు వస్తుంటాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం P4 విధానాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. దీని ప్రధాన ఉద్దేశం ‘పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్‌నర్‌షిప్ ద్వారా ‘సున్నా పేదరికం’ సాధించడం. ఈ పాలసీ విధానంలో భాగస్తులవ్వాలనుకునేవారు వాలంటరీగా పేదరికంతో బాధపడే వారిని ‘బంగారు కుటుంబాలు’గా భావించి దత్తత తీసుకునేటట్లుగా, వారికి మార్గదర్శకులుగా ఉండే పరిస్థితులను ఏర్పాటు చేసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి అనుగుణంగా ప్రతి డిపార్ట్మెంట్ వారు మార్గదర్శకులుగా మారి ఇతరులకు ఆదర్శ ప్రాయంగా ఉండేందుకు తగిన సూచనలను చేసింది. ఈ విధానంలో ఉపాధ్యాయులు సైతం వాలంటరీగా మార్గదర్శకులుగా మారాలని ప్రభుత్వం అభిలా షించింది. ఇందులో ఉపాధ్యాయ వర్గం వారు పెద్ద పెద్ద ఆర్థిక పరమైన సహాయ సహకారాలను ‘బంగారు కుటుంబాల’ వారికి చేయాలనే ఉద్దేశం కాదు.

వారి జీవితానికి మార్గదర్శకులవుతూ..

రాష్ట్రంలో పేదరికాన్ని పటాపంచలు చేసేందుకు గురువుల దగ్గర ఉన్న జ్ఞానాన్ని, మనో ధైర్యాన్ని, మెంటార్స్‌గా ఉండి, దత్తత తీసుకున్న వారి కెరీర్‌ను గైడ్‌ చేస్తూ పేద విద్యార్థులకు ప్రేరణ రూపంలో, భరోసా అందించే విధంగా మార్గదర్శనం చేయగలిగి వారి జీవిత సాఫల్యానికి తోడ్పడేటట్లు తీర్చిదిద్దాలి. ప్రభుత్వం జారీ చేసిన సూచనలలో సైతం.. అధ్యాపకులు, ప్రైవేటు సంస్థలు P4గా గుర్తించబడిన బంగారు కుటుంబాల నుండి నిరుపేద విద్యార్థి కుటుంబాలకు విద్యా, కెరీర్ మార్గదర్శక పద్ధతులను అందించడం, విద్యా ఫలితాలను మెరుగు పరచడంలో సహాయ పడగలరని తెలియపరచింది.

ఉదాహరణగా చెప్పాలంటే P4లో భాగంగా ఉపాధ్యాయులు ఒక పేద కుటుంబంను మార్గదర్శకులుగా నిలవాలనుకుంటే ఆ కుటుంబంలో కొంత చదువుకొని మధ్యలో చదువు మానేసిన వారికి అనియత విద్యా కేంద్రాలైన ఓపెన్ స్టడీస్ ద్వారా పదవ తరగతి లేదా ఇంటర్ అలానే డిగ్రీ లేదా పీజీ స్టాండర్డ్స్ అవసరమైన వారికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా తమ క్వాలిఫికేషన్ పెంచుకునేందుకు సహయం చేసినా.. మనం P4లో భాగంగానే పరిగణించవచ్చు. అంతేకాదు వారి పరిస్థితులను అనుసరించి కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్‌ గూర్చి చెప్పడం, ప్రాక్టీస్ చేయించడం ద్వారా అనేక ఉపయోగాలున్నట్లు తెలియపరచి వారికి గైడ్ చేసి వారి కెరీర్‌కు మార్గం చూపినట్లయితే, దీనిని కూడా P4లో భాగంగానే పరిగణించడానికి అవకాశం ఉంటుంది.

ఉపాధ్యాయులు అనుకోవాలే కానీ..

విద్యార్థులలో దాగివున్న సామర్థ్యాలను వెలికి తీసేదే విద్యా ప్రేరణ. ఈ సామర్ధ్యాలు తనలో ఉన్నాయని తెలుసుకోనంత వరకు విద్యార్థి అంధకారంలోనే నివసిస్తాడు. వాటిని ప్రేరణ ద్వారా వారి వారి సామర్థ్యాలను వారు గుర్తించేటట్లు చేసే గురుతర బాధ్యత గురువులదే కదా! అలాంటి బాధ్యత కలిగిన ఒక సంఘటన ఎప్పుడో జరిగింది. సతారాలో కృష్ణ కేశవ అంబేడ్కర్‌ అనే బ్రాహ్మణ ఉపాధ్యాయుడు భీమ్ రావును ఎంతో ప్రేమతో మార్గదర్శకత్వం చేయడంతో మహా నాయకుడుగా తన బాటలు సుగమం చేసుకోగలిగారు. అందుకు ఆ గురువుపై ఉన్న అభిమానంతో భీమ్ రావు ఇంటిపేరు అంబేడ్కర్‌గా మార్చుకున్నారు. ఉపాధ్యాయులు అనుకోవాలె గాని ఎంతోమందికి మార్గదర్శకులు కాగలరు. వాస్తవానికి గురువులు ఎప్పటినుండో ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. వారి సర్వీసులో ఎంతోమంది విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉంటూ అనేక రకాల పరీక్షలకు పేద విద్యార్థులను సంసిద్ధులుగా చేస్తూ కొన్ని సందర్భాలలో కొంతమంది ఉపాధ్యాయులే వారి ఫీజులను సైతం సహాయం చేసే సంఘటనలు కోకొల్లలని ఘంటాపధంగా చెప్పవచ్చు. గురువుల ప్రోద్బలంతో, వారి సహకారంతో ఈరోజు తమ జీవిత లక్ష్యాలను సాధించుకున్న ఆనాటి పేద విద్యార్థుల అనేక మంది లేకపోలేదు. ఇలాంటి విషయాలను గమనిస్తున్నప్పుడు P4 విధానానికి గురువులు వ్యతిరేకులు కాదనిపించక మానదు.

ఇతరుల కోసం చేసేది..

'మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుందంటారు’ గాంధీజీ. అందుకనే విద్యా గైడ్ లైన్స్‌లలో భాగంగా ఉపాధ్యాయులు సృజనాత్మకంగా ఆలోచించి ఎవరికి ఎలాంటి గైడ్ లైన్స్ ఇవ్వగలమో.. తద్వారా వారి పేదరికం ఎలా దూరం చేయగలమో.. నిశితంగా పరిశీలించుకుంటూ వారి పేదరికాన్ని దూరం చేయటానికి ప్రయత్నించడమే గురువులు పాటించే P4. పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నత విద్యను అభ్యసించాలని కలలుగనే వారికి P4 లో భాగంగా గురువులు ఉన్నత విద్య అందించేందుకు ఈవినింగ్, నైట్ కాలేజీల ద్వారా వారి ఉన్నత విద్యను అందిపుచ్చుకోగలరు. ప్రభుత్వం వారికి అలాంటి గైడ్ లైన్స్ ఇచ్చినట్లయితే వారు లా కోర్సులు, ఎంసీఏ, ఇతర టెక్నికల్ కోర్సులు లాంటివి అభ్యసించి వారి జీవిత సాఫల్యానికి మార్గం వేసుకోగలరని విశ్వసించవచ్చు.

-వి.వి రమణ నాయక్

ఉపాధ్యాయుడు

89198 62019

Next Story