ఓటు మనది.. అభివృద్ధి వాళ్లదా?

by Ravi |   (  Updated:2025-12-11 00:46:06  IST  )

నాయకులు తలుపు తడతారు. మనల్ని 'అన్న, తమ్ముడు' అంటూ ఆలింగనం చేసుకుంటారు. కానీ ఒక్కసారి గుండె మీద చేయి వేసుకుని ఆలోచించండి.. తరాలు మారుతున్నా సామాన్యుడి తలరాత ఎందుకు మారడం లేదు?

ఓటు మనది.. అభివృద్ధి వాళ్లదా?
X

నాయకులు తలుపు తడతారు. మనల్ని 'అన్న, తమ్ముడు' అంటూ ఆలింగనం చేసుకుంటారు. కానీ ఒక్కసారి గుండె మీద చేయి వేసుకుని ఆలోచించండి.. తరాలు మారుతున్నా సామాన్యుడి తలరాత ఎందుకు మారడం లేదు? నాయకులు మారుతున్నారు, వాళ్ల కార్ల మోడళ్లు మారుతున్నాయి, వాళ్ల బంధువులు రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతున్నారు. కానీ, ఏళ్ల తరబడి పార్టీల కోసం, నాయకుల కోసం జెండా మోసిన కార్యకర్త బతుకు మాత్రం అక్కడే మిగిలిపోతోంది. అధికారం వాళ్లది, ఆస్తులు వాళ్లవి.. మరి కష్టం, నష్టం, కేసులు మనవా? మన ఓటు.. వాళ్ల 'అధికార టికెట్' ఎన్నికల్లో గెలిచిన నాయకుడి ఇల్లు కోట లాంటి భవనంగా మారిపోతుంది. ఆయన చుట్టూ ఉన్నవారంతా లక్షాధికారులవుతారు.. ఎందుకంటే మన ఓటు వాళ్లకు కేవలం ఒక ‘అధికార టికెట్’. మన నమ్మకం.. వాళ్లకు సంపాదన మెట్టు మాత్రమే.. రోడ్ల మీద జెండాలు, మైకుల్లో హామీలు, ఇంటింటికీ నమస్తేలు.. కానీ ఐదేళ్లకోసారి మనల్ని గుర్తు చేసుకునేవాళ్లు, మిగతా రోజుల్లో ఎక్కడ ఉంటారు?

కర్ర మోత.. కాసుల మోత!

జెండా మోస్తే మిగిలేది 'కర్ర' మాత్రమే.. పదవి వచ్చాక వాళ్లకి 'కాసుల' మోత! కార్ల మోడళ్లు మారుతున్నాయి.. కన్నీళ్లు మారట్లేదు! మన కళ్ల ముందే అద్భుతాలు జరుగుతున్నాయి. ఏళ్ల తరబడి ఆ పార్టీ కోసం, ఆ నాయకుడి కోసం గొంతు చించుకుని అరిచిన కార్యకర్త పరిస్థితి ఏంటి? జెండా మోసిన వాడి భుజం కాయలు కాసింది తప్ప, జేబు నిండలేదు. బతుకు మారలేదు. చివరికి అధికారం వాళ్లది, ఆస్తులు వాళ్లది.. మిగిలే కష్టం, నష్టం, పోలీస్ కేసులు మాత్రం మనవా?

మన ఓటు వాళ్లకో పాస్‌పోర్ట్

మన ఓటు.. వాళ్లకొక 'అధికార టికెట్' రాజకీయ నాయకులకు మన ఓటు కేవలం ఒక 'పాస్ పోర్ట్' లాంటిది. ఒక్కసారి గెలిచి సభలల్లో అడుగుపెట్టడానికి మనల్ని నిచ్చెనలా వాడు కుంటారు. ఆ నిచ్చెన ఎక్కి పైకి వెళ్లాక, ఆ నిచ్చెనను (ఓటరును) తన్ని వెళ్లిపోతారు. ఎందుకంటే మన ఓటు వాళ్లకు పెట్టుబడి మాత్రమే.. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన దానికి, గెలిచాక వడ్డీతో సహా వసూలు చేసుకుంటారు. రోడ్ల మీద జెండాలు, మైకుల్లో హామీలు, ఇంటింటికీ నమస్తేలు.. ఇవన్నీ కూడా ఆ పెట్టుబడిలో భాగమే..

చివరకు మిగిలేది నిరాశే..!

ముఖ్యంగా యువత మేలుకోవాల్సిన సమయం ఇది. నీ రక్తంలో ఉన్న వేడిని, నీ అమూల్యమైన యవ్వనాన్ని స్వార్థ రాజకీయాలకు బలి చేయకు.. నీ కోసం ఆసుపత్రికి రాని నాయకుడి కోసం నీ పిల్లల ఫీజు కట్టని నాయకుడి కోసం, నువ్వు జెండా పట్టి తిరుగుతావా? నీ సమయాన్ని, జీవితాన్ని నాయకుడికి ధారపోస్తే.. చివరికి మిగిలేది నిరాశే.. వాళ్లు ఎదుగుతారు.. నిన్ను వాడుకుంటారు. నీ జెండా నీ కుటుంబం కావాలి, నీ ఎజెండా నీ అభివృద్ధి కావాలి.

ఓటర్ గెలిచేదెన్నడు?

ఓటు వేయడం అంటే ఏదో ఒక నాయకుడిని గెలిపించడం కాదు.. నీ బతుకును నువ్వు గెలిపించుకోవడం! కొన్ని వందల రూపాయలకు, మందు సీసాలకు ఓటు అమ్మేస్తే.. ఐదేళ్లు బానిసగా ఉండక తప్పదు. అదే ఓటును ఆయుధంగా వాడితే, ప్రశ్నించే హక్కు నీకు ఉంటుంది. నీ ఓటు మారితే... వాళ్ల గద్దె దిగొచ్చు, నీ బతుకు ఎదుగొచ్చు! రాజకీయాల్లో నాయకుడు ఎప్పుడూ ఓడిపోలేదు.. ఓటర్ ఎప్పుడూ గెలవలేదు.. ఈ చరిత్రను తిరగరాయాల్సిన బాధ్యత యువతదే.. నీ యవ్వనం నాయకుల కోసం కాదు.. నీ కుటుంబం కోసం!

- రాచకొండ సాగర్

70958 22883

Next Story