- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశానికి ఉక్కు కవచం..
76 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న భారత రాజ్యాంగం భారతీయులందరికీ ఆత్మ వంటిది. దేశ స్వాతంత్య్రం తర్వాత రాజ్యాంగ రచన పూర్తయి 1950 జనవరి 26 నుండి అమల్లోకి తెచ్చుకున్నాం. సుదీర్ఘకాలం భారత రాజ్యాంగం చెక్కుచెదరకుండా దృఢంగా భారతదేశాన్ని ఉక్కు కవచంగా కాపాడగ లిగింది.

76 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న భారత రాజ్యాంగం భారతీయులందరికీ ఆత్మ వంటిది. దేశ స్వాతంత్య్రం తర్వాత రాజ్యాంగ రచన పూర్తయి 1950 జనవరి 26 నుండి అమల్లోకి తెచ్చుకున్నాం. సుదీర్ఘకాలం భారత రాజ్యాంగం చెక్కుచెదరకుండా దృఢంగా భారతదేశాన్ని ఉక్కు కవచంగా కాపాడగ లిగింది. మన రాజ్యాంగం ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిల బడుతుంది.
పౌరులకు హెచ్చరిక..
రాజ్యాంగ నిర్మాణ సభ చివరి సమావేశంలో రచన సంఘం అధ్యక్షులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నవంబర్ 25, 1949న చారిత్రాత్మకమైన ప్రసంగం చేశారు. ‘రాజ్యాంగం ఎంత మంచిదైనప్పటికీ దాన్ని అమలు చేయవలసిన వారు చెడువారైతే చెడ్డ రాజ్యాంగంగా మారే అవకాశం ఉంది. అదే విధంగా ఎంత చెడ్డ రాజ్యాంగమైనా సరే దాన్ని అమలు చేసేవారు మంచివారైనప్పుడు మంచి రాజ్యాంగంగా మారే అవకాశం కూడా ఉంది’ అని తన ప్రసంగంలో తెలియచేశారు. అలాగే ‘1950 జనవరి 26న మనం పరస్పర వైరుధ్యాలలో అడుగుపెడుతున్నాం. రాజకీయాల్లో మనకు సమానత్వం ఉంటుంది. కానీ సామాజిక ఆర్థిక రంగాల్లో అసమానతలు ఉంటాయి. రాజకీయాలలో మనం ఒక మనిషికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒకే విలువ అని గుర్తిస్తాం. కానీ ఒక వ్యక్తికి ఒకే విలువ అనే సూత్రాన్ని మాత్రం పాటించబోం. ఎన్నాళ్లు ఈ విధంగా వైరుధ్యాల మధ్య మనం జీవించాలి’ అని అంబేద్కర్ ప్రశ్నించారు. ‘వీలైనంత త్వరగా ఈ వైరుధ్యాలను మనం తొలగించుకోవాలి. లేకపోతే మనం ఈ రాజ్యాంగ సభ ద్వారా నిర్మించుకున్న ఈ రాజకీయ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని అసమానతలకు గురైన వారు పేల్చి వేస్తారు’ అని హెచ్చరించారు.
ప్రజాస్వామ్యానికి చిరునామా..
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం పొందిన అనేక ఆసియా, ఆఫ్రికా ఖండాల దేశాలలో భారతదేశం అగ్రగామిగా నిలబడిందనడంలో ఎటువంటి సందేహం లేదు. రాజ్యాంగం ఆవిర్భవించిన మొదటి రెండున్నర దశాబ్దాలలో ఈ రాజ్యాంగం బూర్జువా రాజ్యాంగం అని తిరస్కరించిన అనేక సమూహాలు ఉన్నాయి. మరోవైపు ఈ రాజ్యాంగంలో స్వదేశీయత లోపించిందని అసహనం వ్యక్తం చేసిన వర్గాలు ఉన్నాయి. అయినప్పటికీ భారతదేశంలో జమీందారీ వ్యవస్థ, రాజభరణాలు రద్దు చేయబడ్డాయి. అనేక భూసంస్కరణలు జరిగాయి. భూమిలేని పేదలకు భూ పంపిణీ చేయబడింది. బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన సమసమాజ నిర్మాణం కోసం దారులు వేయ బడ్డాయి. మరోవైపు ప్రపంచీకరణ ముంచుకొస్తున్నప్పుడు సర ళీకృత ఆర్థిక విధానాలు ముందుకొచ్చాయి. ప్రపంచంతో భారతదేశం పోటీ పడగలుగుతుంది. బ్రిటిష్ వలస పాలన అందించిన ఆంగ్ల భాష నేడు భారతీయులను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెడుతుంది.
గణతంత్ర దేశమా! వర్ధిల్లు!!
రాజ్యాంగ నిర్మాతలు భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగం నాలుగో భాగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారు. గడచిన ఏడున్నర దశాబ్దాలలో అనేకమైనటువంటి నిబంధనలు చట్టరూపం దాల్చాయి. విద్య హక్కు చట్టం లాంటివి ప్రాథమిక హక్కులలో చేర్చబడ్డాయి. ఆదేశిక సూత్రాల అమలు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్నాయి. ఎస్సీ ,ఎస్టీ ,ఓబీసీలు, స్త్రీలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో అనేక చట్టాలు చేయబడ్డాయి. ఈనాటికి పలు సమూహాలు తమ తమ అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని పెంపొందించుకోవడానికి ప్రత్యేక హక్కులను డిమాండ్ చేస్తున్నాయి. భారత రాజ్యాంగ పీఠికలో పేర్కొన్న ఆదర్శ సమాజం నెలకొనడానికి ప్రభుత్వాలు నిరంతరం కృషి చేయాలి.
(రేపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా)
- తడక యాదగిరి
93480 09227






