మన నాణేల వారసత్వ గ్రంథాలయాలు

by Bhoopathi Nagaiah |

డిసెంబర్ 24వ తేదీని, భారతదేశంలో "నేషనల్ న్యూమిస్మాటిక్ డే"గా జరుపుకుంటారు.

మన నాణేల వారసత్వ గ్రంథాలయాలు
X

డిసెంబర్ 24వ తేదీని, భారతదేశంలో "నేషనల్ న్యూమిస్మాటిక్ డే"గా జరుపుకుంటారు. డాక్టర్ పి.ఎల్. గుప్తా (1914-2001)ను భారతీయ న్యూమిస్మాటిక్స్ రంగపు స్థాపక పితామహుల్లో ఒకరిగా భావిస్తారు. వారి ప్రసిద్ధ గ్రంథం "కాయిన్స్" భారతీయ నాణేల చరిత్ర యొక్క ప్రతి అంచును వివరించే ఒక మైలురాయి.ఈ రంగాన్ని గౌరవించి, ప్రోత్సహించే ఉద్దేశ్యంతో 2015 నుండి వారి జయంతిని నేషనల్ న్యూమిస్మాటిక్ డేగా జరుపుతున్నారు.

అతిపెద్ద నాణేల సేకరణ లైబ్రరీ

భారతదేశంలోని అగ్ర శ్రేణి నాణేల గ్రంథాలయం మహారాష్ట్రలోని నాసిక్ లో ఉన్న 'ఇండియన్ న్యూమిస్మాటిక్, హిస్టారికల్ అండ్ కల్చరల్ రీసెర్చ్ ఫౌండేషన్' (ఐ.ఎన్.హెచ్.సి.ఆర్.ఎఫ్) లో ఉంది. ఇక్కడ మూడు లక్షల కంటే ఎక్కువ భారతీయ నాణేల ఫోటోల ఆర్కైవ్ ఉంది. ఇది ప్రపంచంలోనే నాణేల సేకరణకు సంబంధించిన అతిపెద్ద సేకరణల్లో ఒకటి. ఇక్కడ పురావస్తు, చారిత్రక, ఇండాలజికల్, శాసన సంబంధిత ప్రచురణల అద్భుతమైన సేకరణ ఉంది, ఇది చరిత్రకారులు, న్యూమిస్మాటిస్టులు, ఆర్కియాలజిస్టులు, అలాగే ఎపిగ్రాఫర్లకు ఒక అమూల్యమైన వనరు. గ్రంథాలయంలో 6500కి పైగా ఆఫ్ ప్రింట్ వ్యాసాలు ఉన్నాయి. వివిధ జర్నల్‌లు, సంపుటాలలో ప్రచురించబడిన పరిశోధనా వ్యాసాల సేకరణలతో ప్రసిద్ధి చెందింది.

అరుదైన ఫోటోగ్రాఫిక్ ఆర్కైవ్

ఈ గ్రంథాలయంలోని అత్యంత విశిష్టమైన అంశం దాని ఫోటోగ్రాఫిక్ ఆర్కైవ్. ఇక్కడ మూడు లక్షల కంటే ఎక్కువ భారతీయ నాణేల ఫోటోల ఆర్కైవ్ ఉంది, ఇది ప్రపంచంలోనే నాణేల సేకరణకు సంబంధించిన అతిపెద్ద సేకరణలలో ఒకటి. ప్రైవేట్, మ్యూజియం సేకరణల నుండి వర్తకంలో ఉన్న నాణేల వరకు, ప్రాచీన పంచ్ మార్క్‌డ్ నాణేల నుండి ఆధునిక నాణేల వరకు ఈ సేకరణ విస్తరించి ఉంది. ఇంకా, గ్రంథాలయంలో ఒక ప్రత్యేక 'న్యూస్ క్లిప్పింగ్స్ సెక్షన్' కూడా ఉంది,

విద్యార్థులకు గొప్ప వనరు

ఈ లైబ్రరీ మరో ముఖ్యమైన విభాగం దాని 'డాక్యుమెంట్ ఆర్కైవ్స్'. ఇందులో ఒక లక్ష కంటే ఎక్కువ పేజీల పరిశోధనా డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇవి నోట్లు, వర్క్ షీట్లు, జాబులు అలాగే ప్రచురించని పదార్థాల రూపంలో విద్యార్థులకు గొప్ప వనరుగా ఉంటాయి. ఈ ఆర్కైవ్‌లో డాక్టర్ పరమేశ్వరీ లాల్ గుప్తా, ప్రొఫెసర్ అజయ్ మిత్ర శాస్త్రి, ప్రొఫెసర్ బి.ఎన్.ముఖర్జీ, చార్లెస్ బిడ్డల్ఫ్, సి.ఎచ్.కే, జో క్రిబ్ వంటి ప్రముఖ న్యూమిస్మాటిస్టులు, విద్వాంసుల వ్యక్తిగత పత్రాలు, జాబులను కూడా సంరక్షించారు. ఈ గ్రంథాలయం సుప్రసిద్ధ పండితులు తమ సంపూర్ణ వ్యక్తిగత లైబ్రరీలను దానం చేయడం వల్ల మరింత సుసంపన్నమైంది. ఐ.ఎన్.హెచ్.సి.ఆర్.ఎఫ్ వద్ద ఇప్పటికే మూడు లక్షల నాణేల డేటాబేస్, 7500 రాక్ ఆర్ట్ చిత్రాల డేటాబేస్ ఉంది. వీటిని డిజిటలైజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

చరిత్రకు మూగసాక్ష్యాలు నాణేలు

చివరిగా ... డిసెంబర్ 24న జరుపుకునే నేషనల్ న్యూమిస్మాటిక్ డే నాణేల ద్వారా చరిత్రను అర్థం చేసుకోవడానికి ఒక ప్రత్యేక అవసరాన్ని సృష్టించింది. ఐ.ఎన్.హెచ్.సి.ఆర్.ఎఫ్ లైబ్రరీ వంటి సంస్థలు ఈ జ్ఞాన భాండాగారాన్ని సంరక్షించడంలో, భావి తరాల పరిశోధకులకు అమూల్యమైన వనరులను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ గ్రంథాలయాలు, మ్యూజియంలు మన ప్రాచీన మధ్యయుగ ఆర్థిక, రాజకీయ సాంస్కృతిక చరిత్రకు మూగ సాక్షులైన నాణేల కథను తెలియజేయడానికి నిరంతరం కృషి చేస్తున్నాయి.


డాక్టర్.జి. రాధికా రాణి,

అసిస్టెంట్ ప్రొఫెసర్, హెడ్,

డిపార్ట్‌మెంట్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్,

కాకతీయ యూనివర్సిటీ వరంగల్.

99495 95810

Next Story