- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాహ బంధాల్లో ఆన్‌లైన్ చిచ్చు..
స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా, ఆన్‌లైన్ పరిచయాలు వైవాహిక బంధాలపై చూపుతున్న ప్రభావం, దాంపత్యంలో విశ్వాస సంక్షోభం, సైబర్ ముప్పులు, కుటుంబ జీవితం దెబ్బతినకుండా పాటించాల్సిన డిజిటల్ నియంత్రణ..

సాంకేతికత మనుషుల మధ్య దూరాలను తగ్గించినా, మనసుల మధ్య దూరాలను పెంచుతోందనే ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా వైవాహిక జీవితంలో స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా, ఆన్‌లైన్ పరిచయాలు కొత్త సవాళ్లను సృష్టిస్తున్నాయి.. భార్య భర్తల మధ్య సంభాషణలు తగ్గడం, పరస్పర విశ్వాసం దెబ్బతినడం కుటుంబ బంధాలను బలహీనపరుస్తున్నాయి. నేడు ఈ డిజిటల్ ప్రపంచం వల్ల నిజ జీవిత బంధాలను కాపాడుకోవడం నేటి దంపతుల ముందున్న అతిపెద్ద సవాలుగా మారింది.
సోషల్ మీడియా వేదికలు భాగస్వాముల మధ్య అదృశ్య గోడలను నిర్మిస్తున్నాయి.. ఆన్‌లైన్ ప్రపంచంలో ఇతరుల కృత్రిమ సంతోషాలను చూస్తూ, నిజ జీవిత భాగస్వామితో పోల్చుకుంటూ అసంతృప్తిని పెంచుకుంటున్నారు. ఇక రహస్య చాటింగ్‌లు విశ్వసనీయతను హరిస్తున్నాయి.. ఈ ఆన్‌లైన్ అలవాటు వైవాహిక జీవితాలను విచ్ఛిన్నం చేస్తోంది.
ఆన్‌లైన్ ఆకర్షణలు..
వివాహ బంధంలో దైనందిన జీవితం ఒకేలా సాగుతున్నప్పుడు, ఆన్‌లైన్ ప్రపంచం కొత్తదనం, ఉత్సాహాన్ని అందిస్తోంది. సోషల్ మీడియాలో వచ్చే లైకులు, కామెంట్లు, ప్రశంసలు తక్షణ ఆనందాన్ని కలిగిస్తాయి. నిజ జీవితంలో భాగస్వామి తనను అర్థం చేసుకోవడం లేదనే భావనతో చాలామంది ఆన్‌లైన్‌లో లభించే సానుభూతి వైపు ఆకర్షితులవుతున్నారు.. ఇంట్లోని గొడవలు, ఒత్తిడి నుంచి బయట పడేందుకు డిజిటల్ ప్రపంచాన్ని ఆశ్రయిస్తున్నారు. అయితే వివాహ బంధం వెలుపల కొత్త వ్యక్తులతో ఏర్పడే అనుబంధాలు నేరభావన, ఆందోళన, ఒత్తిడిని పెంచుతున్నాయి. కొత్త వ్యక్తి నుండి వచ్చే ప్రతి మెసేజ్‌తో డోపమైన్ విడుదలై ఫోన్‌పై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతోంది. దీనివల్ల ఫోన్ దూరంగా ఉంటే చిరాకు, నిరాశ, కోపం వంటి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. ఆన్‌లైన్‌లో కనిపించే కృత్రిమ పరిపూర్ణతతో నిజ జీవిత భాగస్వామిని పోల్చడం వల్ల అసంతృప్తి పెరుగుతోంది. రహస్య చాటింగ్ దొరికిపోతుందేమోననే భయంతో ఫోన్ దాచడం, పాస్‌వర్డ్‌లు మార్చడం వంటి భయాందోళనలతో జీవిస్తున్నారు. ఈ రహస్య సంభాషణలు బయటపడితే, బంధా నికి పునాది అయిన నమ్మకం పూర్తిగా నాశనమవుతోంది. పిల్లల పెంపకంపై శ్రద్ధ తగ్గుతోంది. తల్లిదండ్రుల ప్రవర్తనను గమనించే పిల్లల్లో భద్రతా భావం లోపిస్తోంది.
విచ్ఛిన్నమయ్యే వైవాహిక బంధాలు..
ఇక సైబర్ బెదిరింపులు ఈ సమస్యను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. ఆన్‌లైన్ పరిచయాలు కొన్ని రోజుల్లోనే సన్నిహితంగా మారి, వీడియో కాల్స్‌లో నగ్నంగా మాట్లాడేలా ప్రేరే పిస్తున్నాయి. ఆ తర్వాత ఆ దృశ్యాలను రికార్డ్ చేసి, డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నారు. చాటింగ్‌లో షేర్ చేసుకున్న ప్రైవేట్ ఫోటోలు, ఆధార్ కార్డ్ వివరాలను ఉపయోగించి నిందితులు లోన్ యాప్‌ల ద్వారా అప్పులు తీసుకోవడం, లేదా ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం వంటి సైబర్ దాడులకు పాల్పడు తున్నారు. డిజిటల్ సాక్ష్యాలు కోర్టులో వ్యభిచారం లేదా క్రూరత్వాన్ని నిరూపించడానికి బలమైన ఆధారం అవుతున్నాయి.. విడాకులు వేగంగా మంజూరవుతున్నాయి. పిల్లల కస్టడీని కోల్పోయే పరిస్థితి వస్తోంది. ఆన్‌లైన్ పరిచయం తీవ్రమై, వైవాహిక జీవితానికి అడ్డుగా ఉన్నారనే నెపంతో స్వంత భర్తను లేదా భార్యను కొత్త వ్యక్తితో కలిసి దారుణంగా హత్య చేసిన ఉదంతాలు ప్రతిరోజూ వెలుగుచూస్తున్నాయి. బ్లాక్‌మెయిలింగ్ తట్టుకోలేక, పరువు పోతుందనే భయంతో బాధితులు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. క్షణికావేశంలో చేసే ఈ తప్పుల వల్ల నిందితులు జీవితాంతం జైలు పాలవు తున్నారు. సమాజంలో ఇటువంటి దుశ్చర్యలు పెరిగిపోతున్నాయి. చట్టం కఠినంగా వ్యవహరిస్తున్నా, మనుషుల ప్రవర్తనలో మార్పు రావడం లేదు.
డిజిటల్ నియంత్రణ..
ఈ పరిస్థితిని అదుపులో ఉంచుకోవాలంటే దంపతులు కఠిన నియమాలను పాటించాలి. ఇంట్లో ఉన్నప్పుడు మొబైల్ వాడకాన్ని తగ్గించి భాగస్వామితో నేరుగా మాట్లాడటానికి ప్రాధాన్యత ఇవ్వాలి.. ఇద్దరి మధ్య దాపరికాలు లేకుండా నమ్మక మైన వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి. రాత్రి భోజన సమ యంలో, పడక గదిలోకి వెళ్లిన తర్వాత మొబైల్ ఫోన్లను పక్కన పెట్టేయాలి. భాగస్వామితో సమయం గడుపుతున్నప్పుడు సోషల్ మీడియా నోటిఫికేషన్లను సైలెంట్‌లో ఉంచాలి. రాత్రి ఒక నిర్దిష్ట సమయం దాటిన తర్వాత ఇద్దరూ ఫోన్లను వాడకూడదని నియమం పెట్టుకోవాలి. వ్యక్తిగత హద్దులను కాపాడుకుంటూ, వైవాహిక బంధం పవిత్రతను అర్థం చేసుకున్నప్పుడే ఈ డిజిటల్ చిచ్చు నుండి కుటుంబాలను కాపాడుకోగలం.
భాగస్వామిని అర్థం చేసుకుంటే..
సాంకేతికత మనుషులను కలపడానికి పుట్టింది. డిజిటల్ ప్రపంచం ఇచ్చే తాత్కాలిక ఉత్సాహం కంటే, కట్టుకున్న భాగస్వామిని అర్థం చేసుకోవడం, వారితో గడిపే ప్రతి క్షణం ఎంతో విలువైనది. బాధ్యతాయుతమైన ప్రవర్తన, పరస్పర గౌరవం, పారదర్శకమైన సంభాషణలు ఈ ఆన్‌లైన్ చిచ్చుకు సరైన పరిష్కారాలు. జీవితం ఫోన్ తెరలపై కాదు, పక్కన ఉన్న మనిషి కళ్ళల్లో కనిపిస్తుంది. ఈ విషయాన్ని గుర్తిస్తే, బంధాలు బలంగా నిలబడతాయి. ఆనందకరమైన కుటుంబ జీవితం సొంత మ వుతుంది. అప్పుడే సమాజంలో ఆరోగ్యకరమైన కుటుంబ వ్యవస్థలు బలంగా తయారవుతాయి.. పరస్పర సహకారంతోనే ఈ ఆన్‌లైన్ ముప్పును ఎదుర్కోవడం సాధ్యమవుతుంది.
- డా. కట్కూరి
సైబర్ నిపుణులు






