- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాడు బాధితురాలు.. నేడు అవగాహన కార్యకర్త!
భారతదేశంలో మానవ అక్రమ రవాణాకు అనేక కారణాలున్నాయి.. అవి సామాజిక, ఆర్థిక పరిస్థితుల వల్లే కాక, అవగాహన లోపం వల్ల

భారతదేశంలో మానవ అక్రమ రవాణాకు అనేక కారణాలున్నాయి.. అవి సామాజిక, ఆర్థిక పరిస్థితుల వల్లే కాక, అవగాహన లోపం వల్ల కూడా జరుగుతుంటాయి. పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, కుటుంబ సమస్యలు ఇందుకు ముఖ్యమైన కారణాలు.. ఈ అక్రమ రవాణా వల్ల ఎంతోమంది శారీరకంగా, మానసికంగా నాశనం అవుతారు. చిన్న పిల్లలను బాల కార్మికులుగా బలవంతంగా పనిచేయిస్తున్నారు. మహిళలను వేశ్యావృత్తిలోకి నెట్టివేస్తున్నారు. శిశువుల్ని దత్తత పేరుతో అక్రమంగా విక్రయిస్తున్నారు. అత్యధికంగా మానవ రవాణా కేసులు బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, తెలం గాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో కనిపిస్తున్నాయి.
తీర్పుల రేటు ఐదు శాతమే!
దేశవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా సమస్య తీవ్రమైనదిగా మారుతోంది. జాతీయ నేర గణాంకాల బ్యూరో ప్రకారం, 2018 నుండి 2022 మధ్య కాలంలో 10,659 కేసులు నమోదు కాగా, కేవలం 1,031 కేసులకు సంబంధించి మాత్రమే తీర్పులు వచ్చాయి, అంటే తీర్పుల రేటు 5% కంటే తక్కువగా ఉంది. తీర్పుల రేటు ఇలా తక్కువగా ఉండటానికి కారణాలు.. బాధితులకు న్యాయ సహాయం అందించడంలో లోపాలు, వారు కోర్టులో సాక్ష్యం ఇవ్వకపోవడం, రాష్ట్రాల మధ్య దర్యాప్తుకై సమన్వయం లోపిం చడం. అందుకే భారత ప్రభుత్వం ఈ సమస్యను ఎదుర్కొనడానికి అనేక చట్టాలను తీసుకువచ్చింది. మహిళా, శిశు అభివృద్ధి శాఖలు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అయినా సరే, అమ లులో లోపాలు ఉన్నందున సమస్య ఇంకా కొనసాగుతోంది. కానీ ఈ చట్టాలను సరిగ్గా అర్థం చేసుకున్న ఓ మహిళ ఈ ఊబి నుండి బయట పడింది.
నాటి బాధితురాలే నేడు..
ఆ పల్లెటూరు పేరు చంద్రవరం. అక్కడి యువతి సత్యమ్మకు చదువుపట్ల మక్కువ ఎక్కువ. కానీ పేద రికం కారణంగా పదవ తరగతిలోనే చదువు మానేసి పల్లెలో పనులు చూసేది. ఒక రోజు ఊరిలోకి ఒక దళారి వచ్చాడు. "నగరంలో మంచి ఉద్యోగం.. నెలకు 10 వేల రూపాయలు.. అని చెప్పి పల్లెలోని ముగ్గురిని తీసుకెళ్లాడు.. సత్యమ్మతో పాటు ఇద్దరు అమ్మాయిలను హైదరాబాద్‌కు తరలించాడు. కానీ అక్కడ పరిస్థితి విరుద్ధంగా మారింది. ఉద్యోగం కాదు వాళ్లను బలవంతంగా పని చేయించే ప్రయత్నం జరిగింది. ఇది మానవ అక్రమ రవాణాలో ఒక భాగం. అప్పుడే సత్యమ్మకు స్కూల్లో ఆమెకు టీచర్ చెప్పిన "మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం (2021 బిల్లు)". గుర్తొచ్చింది. ఆ చట్టం ప్రకారం, ఎవరికైనా శారీరక, మానసిక హింస ద్వారా, మోసం చేసి, బలవంతంగా తీసుకెళ్లడం నేరం. బాధితులకు రక్షణ, పునరావాసం కూడా చట్టంలో వుంది. సత్యమ్మ, తాను ధైర్యంగా పోలీసులకు ఫోన్ చేసింది. న్యాయ సాయం కోరింది. చట్టం ఆధారంగా పోలీసులు వెంటనే స్పందించి వారిని రక్షించారు. దళారి అరెస్ట్ అయ్యాడు. అతనికి కోర్టులో శిక్ష పడింది. సత్యమ్మకు ప్రభుత్వం పునరావాస కేంద్రంలో ఆశ్రయం కల్పించింది, ఇంకా విద్యా సహాయం కూడా అందింది. ఆమె ఇప్పుడు ఒక అవగాహన కార్యకర్తగా ఇతర గ్రామాల్లో మానవ అక్రమ రవాణా గురించి ప్రజలకు చెబుతోంది.
ఇలాంటివారు బయట అవగాహన లేకుండా ఎంతోమంది ఉన్నారు. అందుకే ఈ సమస్య పూర్తి నివారణ కోసం ప్రభుత్వంతో పాటు సామాజిక సంస్థలు, పౌరులు కూడా కలిసి పని చేయాలి. ప్రజల్లో అవగాహన పెంచడం, బాధితులను ఆదుకోవడం, నేరస్తులకు కఠిన శిక్షలు విధించడం అనివార్యం. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు, పిల్లల భవిష్యత్తుకు ఈ చీకటి వ్యాపారాన్ని అరికట్టే బాధ్యత మనందరిదీ.
అనూరాధ నాయుడు ఎం.
అడ్వకేట్,
83175 88344






