కూలిన పాత ద్రవిడ కంచుకోటలు.. నియో-ద్రావిడియజం’ వైపు తమిళనాడు..

by Ravi |   (  Updated:2026-05-08 01:00:52  IST  )

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఎదుగుదల, పెరియార్ సిద్ధాంతం కొత్త రూపంలో ఎలా తిరిగి ప్రజల్లోకి వస్తోందో తెలుసుకోండి. నియో-ద్రావిడియనిజం, సామాజిక న్యాయం, యువత రాజకీయ ఆకాంక్షలపై ప్రత్యేక కథనం.

కూలిన పాత ద్రవిడ కంచుకోటలు.. నియో-ద్రావిడియజం’ వైపు తమిళనాడు..
X

ప్రస్తుత దక్షిణాది రాజకీయాల్లో స్పష్టమైన శూన్యత కనిపిస్తోంది. పాత నాయకత్వం నిష్క్రమించడం, జాతీయ పార్టీలు స్థానిక భావజాలాన్ని అర్థం చేసుకోలేకపోవడం ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కొత్త రాజకీయ ఆశగా ఎదుగుతోంది. దాదాపు ఎనిమిది దశాబ్దాల రాజకీయ చైతన్యం ఉన్న నేల మీద, 85 శాతం పోలింగ్ నమోదైందంటే ప్రజలు మార్పు కోసం పరితపిస్తున్నారని అర్థం.

విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ మొన్నటి ఎన్నికల ఫలితాల్లో సాధించిన ప్రభంజనం చూస్తుంటే, పాత కోటలు బీటలు వారడం కళ్లముందే కనిపిస్తోంది. ఇది పెరియార్ సిద్ధాంతానికి జరిగిన ఓటమా? లేక ఆ సిద్ధాంతం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడమా? అన్నది ఇక్కడ అసలైన తాత్విక ప్రశ్న.

పెరియార్ సిద్ధాంతం ఓడినట్టా?

విశ్లేషకులు దీనిని ద్రవిడ సిద్ధాంత అంతం అని భావి స్తున్నారు. కానీ అది పొరపాటే. ఎందుకంటే పెరియార్ అంటే ఒక విగ్రహం కాదు. అదొక నిరంతర చైతన్య స్రవంతి. ఆయన చెప్పిన సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, కుల రహిత సమాజం అనేవి ఆ నేల డీఎన్ఏలోనే ఉన్నాయి. మరి మార్పు ఎందుకు వచ్చిందంటే యాభై ఏళ్లుగా తమిళ నాడును శాసిస్తున్న ద్రవిడ ద్వయం (DMK-AIADMK) పెరియార్ పేరును ఒక కవచంలా వాడుకున్నాయి. ఆ పేరు వెనుక వారసత్వ రాజకీయాలు, అవినీతి, కుటుంబ పాలన తిష్ట వేసుకుని కూర్చున్నాయి. సిద్ధాంతం ప్రజల కోసం కాకుండా, పాలకుల ప్రయోజనాల కోసం వాడబడినప్పుడు.. ప్రజలు తిరుగుబాటు చేస్తారు. అందుకే ప్రజలు ఈ ఎన్నికల్లో వారికి పాతరేశారు. కానీ విజయ్ పెరియార్ మూలాలను ఎక్కడా వదిలిపెట్టలేదు. తన పార్టీ జెండాపై పెరియార్‌ను ప్రతిష్టించుకోవడమే కాకుండా, ఆయనను తన ఐడియాలజికల్ మెంటర్‌గా ప్రకటించుకున్నారు.

ఆత్మగౌరవ రాజకీయాలే.. కానీ సరికొత్తగా..

విజయ్ తన రాజకీయ పంథాను చాలా స్పష్టంగా నిర్వచించారు. ఆయన పెరియార్‌లోని సామాజిక కోణాన్ని స్వీకరిస్తూనే, ఆయన కఠిన నాస్తికత్వాన్ని పక్కన పెట్టారు. అన్నాదురై చెప్పిన ‘ఒకటే కులం.. ఒకటే దేవుడు’ అనే సూత్రాన్ని పట్టుకున్నారు. ఇది ఒక గొప్ప పరిణామం. ప్రజల నమ్మకాలను గౌరవిస్తూనే సామాజిక న్యాయం కోసం పోరాడటం అనేది ఒక నూతన ప్రయోగం. అందుకే దీనిని మనం ‘నియో-ద్రావిడియనిజం’ అని పిలుచు కోవాలి. ఇది పెరియార్ సిద్ధాంతాన్ని ఆధునిక తరానికి అనుగుణంగా రీ-ప్యాకేజింగ్ చేయడం. ఈ తరానికి అర్థమయ్యే భాషలో, ఆత్మగౌరవ రాజకీయాలను సరికొత్తగా అందించడమే విజయ్ చేసిన అసలైన మేజిక్. ముందుగా బీజేపీని సిద్ధాంత పరమైన శత్రువుగా, డీఎంకేను రాజకీయ శత్రువుగా ప్రకటించడంలో విజయ్ ఒక స్పష్టమైన రేఖను గీశారు. మత రాజకీయాలకు ఈ నేల మీద చోటు లేదని చెప్తూనే, ద్రవిడ మోడల్ పేరుతో జరుగుతున్న అవినీతిని ఎండగట్టారు. ఇది ఒక రకమైన క్లీన్ పాలిటిక్స్ వైపు అడుగు. యువత భారీ స్థాయిలో టీవీకే వైపు మళ్లడం వెనుక ఉన్న రహస్యం ఇదే.

ఈ గెలుపు పెరియార్‌కు దక్కిన గౌరవమే!

నిజానికి రాజకీయం అంటే అది నిరంతరం ప్రవహించే నది లాంటిది. పాత నీరు పోతేనే కొత్త నీరు వస్తుంది. కరుణా‌నిధి, జయలలిత కాలం నాటి ఆ ఇనుప తెరలు ఇప్పుడు తొలగిపోయాయి. ప్రజలు ఒక నిష్పక్షపాత నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కులం కేంద్రంగా సాగే రాజకీ యాలకు కాలం చెల్లిందని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. సామాజిక న్యాయం అంటే ఏదో కొన్ని వర్గాల ప్రయోజనం కాదు, అది అందరి అభివృద్ధి అని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. ఈ గెలుపు పెరియార్‌కు దక్కిన గౌరవమే. ఆ సిద్ధాంతం చావలేదు, అది రూపం మార్చుకుని నవ యవ్వనంతో మళ్లీ ప్రజల ముందుకు వచ్చింది. పాత కంచుకోటలు కూలిపోవడం చూస్తుంటే ఒక రకమైన విషాదం కలగవచ్చు. కానీ ఆ శిథిలాల నుంచే ఒక కొత్త ఉషోదయం పుడుతుంది. తమిళ గడ్డ మీద సామాజిక విప్లవం ఇంకా బలంగానే ఉంది. అది తన పాత చొక్కాను విడిచేసి, కొత్త రంగులను అద్దుకుంది అంతే. ‘నియో-ద్రావిడియనిజం’ అది ఒక కొత్త తరం ఆకాంక్ష. ఈ మార్పు చారిత్రక అవసరం. కాలం రాసిన తీర్పు. మీరు గమనిస్తే, విజయ్ గెలుపులో సినిమా గ్లామర్ కంటే సామాజిక అంశాలకే ఎక్కువ బలం చేకూరింది. ప్రజలు ఒక నటుడిని చూడలేదు, ఒక ప్రత్యామ్నాయాన్ని చూశారు.

తమిళ అస్తిత్వం, ఆత్మగౌరవ రాజకీయాలు ఇప్పుడు ఒక కొత్త వెలుగును చూస్తున్నాయి. ఇదే నేటి తమిళనాడు చెప్తున్న పచ్చి నిజం. మారుతున్న కాలంతో పాటు మనం కూడా అడుగులు వేయాలి. పాత పద్ధతులను వదిలేసి, కొత్త మార్గాల్లో ప్రయాణించాలి. ఈ రాజకీయ ప్రభాతం అటువంటి ప్రయాణానికే నాంది.

-డాక్టర్ నంబూరి చంద్రశేఖర్

రేడియో ఫిజిసిస్ట్

93939 90399

Next Story