- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వృద్ధాశ్రమాలు.. సేవా కేంద్రాలా! లాభ కేంద్రాలా?
మీరు ఒకసారి రండి అని నాకు ఓ ఫోన్ వచ్చింది.. ఆయనకు 80 ఏళ్లుంటాయి. నాకు తీరిక కుదరగానే వెళ్లాను. మంచం మీద నీరసంగా పడుకుని ఉన్నారు.

మీరు ఒకసారి రండి అని నాకు ఓ ఫోన్ వచ్చింది.. ఆయనకు 80 ఏళ్లుంటాయి. నాకు తీరిక కుదరగానే వెళ్లాను. మంచం మీద నీరసంగా పడుకుని ఉన్నారు. లో గొంతుకతో ‘ఆకలి తీరా అన్నం తిని మూడు రోజులయింది. రుచీ, పచీ లేని భోజనం. చెప్పుకుందామంటే వినే నాధుడు లేడు’. నిర్వాహకుడు వస్తారంటారు కానీ ఇవాల్టి వరకు రాలేదు అని బాధ వ్యక్తం చేశారు.
నాకు ఒక దారి తోచింది. ట్రాన్స్ జెండర్స్, వయోవృద్ధుల సంక్షేమం చూడడానికి ఒక ప్రత్యేక విభాగం ఉంది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలలో.. మన జిల్లా అధికారి ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను. ఆయనకు చెప్పండి అన్నాను. ఒప్పుకోలేదు. ‘వద్దండి. వాళ్లూ, వీళ్లూ ఒకటే’ అన్నారు. వారో విశ్రాంత అధికారి. గత అనుభవం గుర్తొచ్చి వారి మాటలు కాదనలేకపోయాను.
నిర్ణీత రుసుము నెలనెలా చెల్లిస్తేనే..
ఇలాంటిదే మరొక ఆశ్రయం. మా స్నేహితుడు ఒకరిని చూడడానికి వెళ్లినప్పుడు, ఆ గదిలోనే ఉన్న 20-25 సంవత్సరాల కుర్రవాడు పరిచయమయ్యాడు. మాట సరిగా రాదు. తిన్నగా నడవలేడు. కష్టపడి ఫోన్‌లో కొద్ది మాటల సందేశాలు పంపగలడు. తల్లి లేదు. తండ్రి పట్టించుకోడు. మేనమామలు ఆశ్రయంలో చేర్చారు. ఎప్పుడైనా చూసి వెళ్తారు. ఒక ఉదయాన్నే సందేశం వచ్చింది. ‘నన్ను కొడుతున్నారు’. ఇందాక ప్రస్తావించిన జిల్లా అధికారి గుర్తొచ్చారు. ఫోన్‌లో విషయం విన్నవించాను. చూస్తానన్నారు. ఉత్సాహం వచ్చింది. కాస్సేపటికి ఫోన్ మోగింది. కర్కశ స్వరం. ‘ఎవరు మీరు? ఏమనుకుంటున్నారు మీ గురించి? ఆ కుర్రవాడికి మీకు ఏం సంబంధం? ఇప్పుడు వాడిని తీసుకొచ్చి మీ ఇంటి ముందు వదిలేస్తే ఏం చేస్తారు?’ అవాక్కయ్యాను. బింకంగా ‘అలాగే చేయండి చూద్దాం’ అన్నాను. కానీ, అప్పుడే నిర్ణయించుకున్నాను. ఈ సత్కార్యాలు చేయడం నా పరిమితికి మించినదని. ఇదంతా చదివి ఆ ఆశ్రయాలు ఉచితంగా వసతి, భోజన వగైరా సౌకర్యాలు కల్పిస్తాయి అనుకోకండి. కొంత ధరావత్తు, నిర్ణీత రుసుము నెలనెలా చెల్లిస్తేనే వృద్ధులకు, ఇతరులకు ప్రవేశాలు.
ఆశ్రమాలు నడపాలంటే..
ప్రస్తుతానికి పార్లమెంటు ఆమోదించిన ‘తల్లిదండ్రులు మరియు వరిష్ట పౌరుల పోషణ సంక్షేమ చట్టం- 2007 గురించి చెప్పుకుందాం. ఈ చట్టం 2008 ఏప్రిల్ 28 నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమలుకు వచ్చింది. 2011 డిసెంబర్ 28న ఇందుకు అవసరమైన నిబంధనలు జారీ చేయబడ్డాయి. ఆ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వేతరుల నిర్వహణలో ఉన్న వృద్ధాశ్రయాలు, ఆయా జిల్లాలలో గల భిన్న ప్రతిభావంతుల, ట్రాన్స్ జెండర్స్, వయోవృద్ధుల సంక్షేమ సహాయ నిర్దేశకులకు దరఖాస్తు చేసుకుని, ధ్రువీకరణపత్రం పొందాలి. ఆ సంస్థలు ఆంధ్రప్రదేశ్ సంస్థల ( సొసైటీస్) నమోదు చట్టం- 2001, లేదా కంపెనీల చట్టం-1956, లేదా భారత ధర్మకర్తృత్వ (ట్రస్టీషిప్) చట్టం- 1882 క్రింద నమోదయి ఉండాలి. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ చెల్లింపు ప్రాతిపదికన చాలా వృద్ధాశ్రయాలు నడుస్తున్నాయి. అయితే కొన్ని వృద్ధాశ్రయాలు నమోదే కావడం లేదు. గూగుల్ పుణ్యమా అని సంబంధిత అధికారులు తమ కార్యాలయంలో కూర్చునే అంతర్జాలంలో వృద్ధాశ్రయాల వివరాలు తెలుసుకోవచ్చు. తెలుసుకుంటూ ఉండవచ్చు కూడా.
ఈ చట్ట ప్రకారం..
రాష్ట్రంలో ఉన్న ఆ వృద్ధాశ్రయాలు తమవద్ద గల సదుపాయాలు, తాము అందించే సేవలు చార్టర్ రూపంలో ప్రకటించాలి. నివాసితుల వయసుకు తగ్గ, ఆయా ఋతువులలో లభించే కూరగాయలు, పండ్లతో కూడిన, రుచికరమైన పోషకాహారాన్ని అందించాలి. ఆ మెనూను వృద్ధాశ్రయంలో ప్రదర్శించాలి. వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలి. వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, వారి సమస్యలను త్వరగా, క్రమపద్ధతిలో పరిష్కరించడానికి, నివాసితుల గృహ కమిటీలు ఏర్పాటు చేయాలి. వృద్ధాశ్రయం లక్ష్యాలు, పేరు, చిరునామా, సంస్థలో పనిచేస్తున్న డైరెక్టర్లు/బోర్డు సభ్యులు సిబ్బంది అర్హతలు, నివాసితుల వివరాలు, వారి నుండి వసూలు చేసే నెలవారీ ఛార్జీలు, మొదలైన వాటిని ఆ సంస్థలు వెబ్‌సైట్‌లో, ప్రతి సంవత్సరం నవీకరిస్తూ, ప్రభుత్వం సూచించిన విధంగా ప్రదర్శించాలి. అంతేకాక వివిధ చట్టాలు, పథకాల ప్రకారం వరిష్ట పౌరులకు ఉద్దేశించిన అన్ని హక్కులు, ప్రయోజనాలు అన్నివేళలా అందేలా చర్యలు తీసుకోవాలి. ఈ చట్టం అమలు తీరుపై కూడా జిల్లా కలెక్టర్ల స్థాయిలో సమీక్ష జరిపితే కొంత ప్రయోజనం ఉండవచ్చు. మళ్లీ మొదటికి వస్తే, వృద్ధాశ్రయ నిర్వాహకుడు వచ్చి, ఆ పెద్దాయనకి ఆహార నాణ్యత భద్రత పెంచుతామని హామీ ఇచ్చారు. ఐతే, పరిస్థితి యధాపూర్వం.
-మల్లాప్రగడ రామారావు
99898 63398






