- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక మంచి ప్రేమకథ.. మౌనంగా సంధించిన ప్రశ్న!
‘ఒక మంచి ప్రేమ కథ’ తల్లి–కూతురు బంధాన్ని వ్యక్తిగత సవాళ్ల మధ్య నడిపించిన ఒక సున్నితమైన కథ. ఇది కేవలం ఇద్దరి నడుమ కదిలే కథలాగా అనిపించినప్పటికీ, ఇవాళ సమస్త మానవాళి అనుభవిస్తున్న వర్తమాన కాలపు సినిమా.. ఇందులో అందరూ కనిపిస్తూనే ఉంటారు. అందరూ వినిపిస్తూనే ఉంటారు.. కానీ కలిసుండటానికి కలిసిపోవడానికి అందరి నడుమా అడ్డంగా కళ్ల ముందే మొలుస్తున్నగోడలు..

‘ఒక మంచి ప్రేమ కథ’ తల్లి–కూతురు బంధాన్ని వ్యక్తిగత సవాళ్ల మధ్య నడిపించిన ఒక సున్నితమైన కథ. ఇది కేవలం ఇద్దరి నడుమ కదిలే కథలాగా అనిపించినప్పటికీ, ఇవాళ సమస్త మానవాళి అనుభవిస్తున్న వర్తమాన కాలపు సినిమా.. ఇందులో అందరూ కనిపిస్తూనే ఉంటారు. అందరూ వినిపిస్తూనే ఉంటారు.. కానీ కలిసుండటానికి కలిసిపోవడానికి అందరి నడుమా అడ్డంగా కళ్ల ముందే మొలుస్తున్నగోడలు.. ఎవరికి వారు నిర్మించుకుంటున్న భ్రమాలోకపు గడీలు.. తవ్వి తలకెత్తుకుంటున్న కందకాలు.. చుట్టూరా ఖాళీలు, కొలతల కందని దూరాలు, ఎవరి లెక్క వారిది ఎవరి కుహరం వారిది. ఎవరి వాదన వాళ్లది. ఎవరి సౌకర్యం వాళ్లదే. ఇదీ ఇవాల్టి లోకం..
ఎవరి కెరీర్ వాళ్లది. ఎవరి పరుగు వాళ్లది.. ఈ వేగవంతమైన బతుకుల్లో ఎవరేమి కోల్పోతున్నారో ఎవరేమి పొందుతున్నారో తెలుసుకోలేని కాలమిది. ఈ కాల నేపథ్యంలో ‘మన అమ్మకు మనం ఎప్పుడు చివరిసారి సమయం ఇచ్చాం’ అన్న ప్రశ్నని సంధించిన సినిమా ‘ఒక మంచి ప్రేమ కథ’. ఈ సినిమా ఈటీవీ విన్‌లో ఉంది. ఈ సినిమా పెద్దగా వాదించదు. కన్నీళ్లు కార్చమని బెదిరించదు.. కానీ ఒక ప్రశ్నను, బాధ్యతను మాత్రం మన గుండెల్లో నెమ్మదిగా పెట్టి వెళ్తుంది. ఒక మంచి ప్రేమ కథ’లో దర్శకుడు మనుషుల ప్రేమను కేవలం ప్రేమకథలా చెప్పడు.. ఇది వృద్ధాప్యంలో తల్లి పట్ల పిల్లల బాధ్యత గురించి, కార్పొరేట్ గడియారాల పరుగులో ఉద్యోగ పోరాటాల మధ్య మగ్గిపోయిన మనుషుల గురించి మనసుల గురించి ప్రస్తావించే కథ. మానవ సంబంధాలు ఎలా నెమ్మదిగా అలసిపోతున్నాయో చెప్పే కథ.
నాకేమీ వద్దు.. కాస్త మీ సమయం చాలు..
కథంతా రంగమణి అనే వృద్ధ తల్లి చుట్టూ తిరుగుతుంది. ఆమె ఒంటరిగా ఉంది. ఇంట్లోనే కాదు, జీవితంలో కూడా.. ఆమె కూతురు సుజాత, అల్లుడు ఈశ్వర్. వాళ్లకు మంచి ఉద్యోగాలు, మీటింగ్స్, కాల్స్ అన్నీ ఉన్నాయి. కానీ తల్లికి మాత్రం వారు లేరు. రంగమణిగా రోహిణి హట్టంగడి నటన కేవలం నటన కాదు, ఒక నిశ్శబ్ద జీవనం. ఆమె చూపుల్లో ప్రశ్నలు లేవు. అపేక్ష మాత్రమే కనిపిస్తుంది. ‘నాకు ఏమీ వద్దు కాస్త మీ సమయం చాలు’ అంటూ చూసే ఆమె చూపు ప్రేక్షకుల్ని వెంటాడుతుంది. ఈశ్వర్ పాత్రలో సముద్రఖని ఎక్కడా విలన్ కాదు. అలాగే హీరో కూడా కాదు. మన చుట్టూ ఉండే సాధారణ మనిషి. తనకి బాధ్యత తెలుసు, కానీ ఆచరించలేని అలసత్వం. ఉద్యోగం అందులో పోటీ ప్రగతి అదే లక్ష్యం.
పెద్ద వాళ్లు.. పాత సామాన్లు కాదు..
ఈ సినిమాకున్న బలమే దాని నిజాయితీ. తల్లీ–కూతురు బంధాన్ని ఎలాంటి అలంకారాలు లేకుండా చూపించడం. వృద్ధ తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత అనే అంశాన్ని చూపించడం. ఈ సినిమా ఒక డీసెంట్ ఎమోషనల్ ఫ్లిక్. మంచి ఉద్దేశ్యం. మంచి సందేశంతో సాగిన ఈ సినిమా చూసిన ప్రేక్షకుడు బయటకు వచ్చాక కూడా వెంటాడే పెద్ద వాళ్ల పట్ల బాధ్యతల ప్రశ్న ఈ సినిమా సాధించిన విజయం. ఇవ్వాళ ఇంట్లో పెద్ద వాళ్లని పాత సామాన్లుగా భావించే నవతరం ఏమి పోగొట్టుకుంటుందో సున్నితంగా చెప్పే సినిమా ఇది.. యువత మాత్రమే కాదు నిజానికి ఇది పెద్దలూ పరుగు పందెంలో చిక్కుకున్న వాళ్లందరూ చూడాల్సిన సినిమా. ఎందుకంటే... మనమంతా ఎప్పుడో ఒకప్పుడు రంగమణి కూతుళ్లమే లేదా రేపటి రంగమణులమే. ఈ సినిమా చూసిన తర్వాత బయటకు నడుచుకుంటూ వస్తూ ఫోన్ తీసి నాన్నకు లేదా అమ్మకు ఒక కాల్ చేస్తే... అదే ఈ సినిమా సాధించిన విజయం అనుకుంటాను.
కాలాన్ని ప్రశ్నించిన దర్శకుడు..
దర్శకుడిగా అక్కినేని కుటుంబరావు స్థిరంగా తన విశ్వాసాల కోసం నిలబడిన రచయిత కళాకారుడు. కేవలం మారుతున్న కాలంతో ఇండస్ట్రీతో పోటీపడని దర్శకుడు. ఆయన కాలాన్ని ప్రశ్నించిన మనిషి. ఆయనకు సినిమా ఒక వేడుక కాదు అది నడిచే గాయం. ఒక నిశ్శబ్దమైన నిరసన. తెలుగు సమాంతర (ప్యారలల్) సినిమా రంగంలో ఆయన చేసిన కృషి తీసిన సినిమాలు సంఖ్యలో తక్కువే అయినా ప్రభావంలో లోతులో అపారమైనది. కుటుంబరావు రూపొందించే సినిమాల్లో కెమెరా ముందు నిలిచే వాళ్లు మెగా హీరోలు కాదు. వీధి పిల్లలు, బాల కార్మికులు, వెనుకబడిన వర్గాల మనుషులు.. ఆయన సినిమాలు చూస్తుంటే అది కథలా ఉండదు మన కండ్ల ముందరి జీవితమే నెమ్మదిగా మన ముందుకు వచ్చి కూర్చుంటుంది.
వీధి పిల్లల జీవితాల ఆవిష్కర్త..
దర్శకుడిగా అక్కినేని కుటుంబరావు మొదటి సినిమా భద్రం కొడుకో.. ఆ సినిమా భారతదేశపు పట్టణాల్లో అక్కడి వీధుల్లో తిరిగే పిల్లల జీవితాలను ఆవిష్కరించింది. ఇందులో ఉన్నది కేవలం సినిమాటిక్ మెలోడ్రామా కాదు, సున్నితంగానే కానీ బలంగా చెప్పిన వాస్తవం ఈ సినిమా.. ఈ సినిమాకు 39వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగులో ఉత్తమ చిత్రం జాతీయ పురస్కారం లభించింది. ఆ అవార్డు ఆ సినిమాకి కాదు, ఆ పిల్లల జీవితాలకు వచ్చిన గుర్తింపనే చెప్పాలి.. ‘అమూల్యం’, ‘తోడు’, ‘గులాబీలు’ ఇవి కుటుంబాల్లోని సంక్లిష్టతలు, సంఘర్షణ, కష్టాలు, పేదరికం, పిల్లల సంక్షేమం వంటి అంశాలను కళాత్మక దృష్టితో భావనాత్మక లోతులతో ప్రతిపాదించిన ప్రయత్నాలు.. ఆయనకు వచ్చిన నంది అవార్డులు, అంతర్జాతీయ గుర్తింపులు ఆయన ప్రయాణానికి వచ్చిన ఘనమైన అభినందనలుగా చెప్పుకోవచ్చు. అక్కినేని కుటుంబ రావుకు చిన్న వయసులోనే సాహిత్యం గొప్ప ఆలంబన అయింది. రచనే తన జీవితంగా గడిపారు. తను సినిమాల్లోకి రాకముందే ఆయన రాసిన పుస్తకాలు ‘అధోజగత్ సహోదరి’, ‘అమ్మ’, ‘కార్మిక గీతం’, ‘కొల్లేటి జాడలు’ అవన్నీ తన విశ్వాసాలకు తాను నమ్మిన భావ జాలానికి ప్రతిబింబాలు..
సమాంతర సినిమాల్లో విలక్షణ స్వరం..
దేశవ్యాప్తంగా 1960 –70 దశకాల్లో సమాంతర సినిమా ఉద్యమాలు, సామాజిక ఇతివృత్తాలకు ప్రాధాన్యమిచ్చిన రచయితలు, దర్శకులు ఆయనపై గొప్ప ప్రభావం చూపారు.. రంగస్థలం, రచన, దృశ్యం ఈ మూడింటి మధ్య ఆయన ఒక వారధి కట్టుకున్నాడు. రచయితగా స్థిరపడిన తర్వాత కుటుంబరావు సినిమాల్లోకి వచ్చారు.. వాణిజ్య ధోరణుల నడుమ ‘నేను చెప్పాల్సింది వేరే ఉంది’ అని తన దారిని వెతుక్కున్నారు. తెలుగు సినిమా రంగంలో వ్యాపార సినిమాకి సమాంతరంగా కళాత్మక సినిమాల్ని రూపొందించిన వాళ్లల్లో దర్శకుడిగా అక్కినేని కుటుంబరావుది విలక్షణ స్వరం..
- వారాల ఆనంద్
94405 01281






