కులగణనపై ఓబీసీల సందేహాలు..

by Ravi |   (  Updated:2026-02-04 01:01:09  IST  )

అసలే బీసీలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకుంటోంది అంతంతమాత్రమే!! ఇప్పుడు జనగణనలో కులగణనను కేంద్రం చేస్తున్నప్పటికీ ఓబీసీ కాలం క్యాస్ట్ లేకపోవడం తీరని అన్యాయం. ఇది ఓబీసీలను మోసం చేసే కుట్రలో భాగమే!

కులగణనపై ఓబీసీల సందేహాలు..
X

అసలే బీసీలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకుంటోంది అంతంతమాత్రమే!! ఇప్పుడు జనగణనలో కులగణనను కేంద్రం చేస్తున్నప్పటికీ ఓబీసీ కాలం క్యాస్ట్ లేకపోవడం తీరని అన్యాయం. ఇది ఓబీసీలను మోసం చేసే కుట్రలో భాగమే!

జాతీయ జనగణనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్ట‌నున్న కులగణన డాక్యుమెంట్‌లో ఎస్సీ, ఎస్టీల కాలమ్ పెట్టినప్పటికి ఓబీసీ కాలమ్ లేకుండా కులం అనే కాలమ్ మాత్రమే పెట్టి బీజేపీ ప్రజలను మోసం చేస్తోంది.

‘అదర్స్’ పేరుతో పక్కన పెట్టే కుట్ర..

దేశ జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు సరైన లెక్కలే లేవని, బీసీలకు అందాల్సిన రిజర్వేషన్ అందడం లేదు. ఇక తాజా కులగణనలో బీసీ కాలమ్ లేకపోవడం యావత్ బీసీ ప్రపంచానికే ప్రమాదకరం.. ఇప్పటికే బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఓటు బ్యాంకు రాజకీ‌యాల కోసం వారిని వాడుకుంటున్నారు.. 75 ఏళ్లుగా బీసీల కులగణన లేకపోవడం దురదృష్టకరం, 33 అంశాల్లో ప్రత్యేకంగా ‘బీసీ కాలమ్’ ఉండాలి. అన్ని వర్గాలకు న్యాయం జరగాలని అన్నారు. అందుకోసం కులగణనలో ఎస్సీ, ఎస్టీలలో పాటు బీసీలకు కాలమ్ ఉండాలి!

ప్రజలను విడదీసే ప్రయత్నమా?

జనగణన 2021లో చేయాల్సి ఉండగా కొవిడ్‌ కారణంగా చేయలేదు. కులగణనపై అన్ని రాష్ట్రాల్లో డిమాండ్‌ రావటంతో కేంద్రం అందుకు అంగీకరించిందని స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీల కాలం పెట్టి, ఓబీసీ అని లేకుండా కులం అనే కాలం మాత్రమే డాక్యుమెంట్‌లో పెట్టారు. బీసీల విషయంలో ఎంత గందర‌గోళం ఉంటుందో ఆలోచించాలి.. కుల గణన విషయంలో బీజేపీ మాట తప్పినట్టు స్పష్టంగా తెలుస్తోంది. కులగణలో కులం కేటగిరీతో పాటు సబ్‌ కేటగిరీ ఉండాలి. జనగణనలో బీసీలను మోసం చేసే కుట్ర జరుగుతోంది. కులాల పేర్లతో పంచాయితీ పెట్టి ప్రజలను విడదీయడమే వీరి ప్లాన్ అని అనిపిస్తోంది.

పశువుల లెక్కలు తీస్తారు కానీ..

1953లో, 1979లో, 2017లో ఏర్పడిన బీసీ కమిషన్ల సిఫార్సులు అరకొరగానే అమలయ్యాయి. ఒక కమిషన్ గడువును 13 సార్లు పొడిగించినా ఇంతవరకు నివేదికను ప్రభుత్వానికి సమర్పించలేదు. 2011లో జరిగిన సామాజిక ఆర్థిక కుల గణన వివరాలు ఉన్నాయని చెప్పిన కేంద్రం ఆ వివరాలు ఎందుకో బయట పెట్టకుండా దాటవేసింది. దేశంలో సగానికి పైగా జనాభా ఉన్న బీసీల విషయంలో కేంద్రం లెక్కలేనితనం చూపడం దారుణమైనది. దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారు వీళ్ల ఆర్థిక స్థితి గతులేమిటి వీరి చదువులు ఎలా ఉన్నాయి వీరి ఉద్యోగ అవకాశాలేమిటి లాంటి విషయాలలో ఇప్పటి వరకూ ఓ క్లారిటీ లేదు.. పశువుల, వన్య ప్రాణుల లెక్కలను క్రమం తప్పకుండా తీసే ప్రభుత్వానికి, బీసీ లెక్కలు తీయాలన్న విజ్ఞతను కనబరచపోవడం అమానవీయం. బీసీలను పశువులకన్నా తక్కువ చేసి చూడడం దుర్మార్గం. దేశంలో మెజారిటీ ప్రజలైన బీసీల అభి‌వృద్ధిని, సంక్షేమాన్ని గాలికి వదిలేసి మాది ప్రజారంజక ప్రభుత్వం అని చెప్పుకోవడం సిగ్గుచేటు. హక్కుల సాధనకు ఉద్యమించిన రైతులను జైళ్లపాలు చేశారు.. ఉద్యమకారులపై పి.డి., ఉగ్రవాద చట్టాలను అమలు చేశారు. ఇలాంటి చర్యలు గతంలో ఎప్పుడూ ఈ దేశంలోని ప్రజలు ఎదుర్కొలేదు. ఇప్పటికైనా బీసీల ప్రధాన డిమాండ్‌‌ను పూర్తి చేయడం కేంద్రానికి కూడా చాలా మంచిది.

90 ఏళ్ల నాటి డేటాతోనే బీసీ రిజర్వేషన్లు..

దేశంలో బీసీల జనాభా 70 కోట్లు, మొత్తం జనాభాలో ఇది 56% అని అంచనా. 90 ఏళ్ల నాటి డేటా ఆధారంగానే కొనసాగుతున్న రిజర్వేషన్లు.. కులాల లెక్కలతోనే బీసీల అసలు జనాభా తెలుస్తుంది. కుల గణన చేపట్టాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. పది సంవత్సరాలకు ఓ సారి దేశంలో జనాభాను లెక్కిస్తున్నా.. అందులో దళితులు, ఆదివాసీల సంఖ్య పైన మాత్రమే స్పష్టమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే జనాభాలో ఓబీసీతో పాటు ఏ‌ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారన్న సమగ్ర సమాచారం సేకరించడం లేదు. దేశంలో బడుగు, బలహీన వర్గాలకు బీజేపీ పార్టీ దశాబ్దాలుగా తీవ్ర అన్యాయం చేస్తూనే ఉంది. సామాజిక న్యాయం పేరుతో మాటలు చెప్పే బీజేపీ, అధికారంలో ఉన్న చోట బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించ డంలో పూర్తిగా విఫలమైంది. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలంటే రిజర్వేషన్ల పెంపు తప్పనిసరి. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన నిర్ణయం తీసుకుని అమలు చేయాలి.

-దుండ్ర కుమారస్వామి

జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు

99599 12341

Next Story