ఏజెన్సీ సంక్షేమ సారథి ఎన్టీఆర్

by Ravi |   (  Updated:2023-01-18 02:08:34  IST  )

ఏజెన్సీ సంక్షేమ సారథి ఎన్టీఆర్ ... NTR is the welfare chief of the tribal areas says laxminarayana

ఏజెన్సీ సంక్షేమ సారథి ఎన్టీఆర్
X

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిలో తనదైన తోడ్పాటునందించారు. 1976లో ఐటిడిఏలు ఏర్పడిన పదేళ్ల తర్వాత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ప్రభుత్వం తొలిసారిగా ఏజెన్సీ గిరిజనుల పై దృష్టి సారించింది. 1986లో ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని గ్రామాల్లో పర్యటించి ఆ గూడేల్లో 'ప్రజల ముంగిట ప్రజాపాలన' కార్యక్రమం నిర్వహించి తిర్యాణి మండలం గిన్నేధారిలో బస చేశారు. ఆదివాసీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు ఆకళింపు చేసుకొని వారి సమస్యలు తీర్చడానికి ఎంతో క‌‌ృషి చేశాడు.

వారి సంక్షేమం కోసం

గిరిజనులు అధికంగా నివసించే ఆదిలాబాద్ జిల్లాను ఆదర్శ జిల్లాగా మార్చడానికి 14 సూత్రాల విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అవి 1. గిరిజనుడి భూమి గిరిజనుడికే, 2. తొలగించిన గిరిజనేతరులకు సంపూర్ణ పునరావాసం, 3. 1980కి ముందు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలలో భుక్తికి ఖాస్తు చేసిన గిరిజనులకు పట్టాలు, 4. 1976 తర్వాత వలస వచ్చిన రాష్ట్రేతర లంబాడాలకు గిరిజన సదుపాయాలు రద్దు, 5. గిరిజన ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి ఆరు కోట్ల రూపాయలు మంజూరు, 6. చెలిమెల వాగు ప్రాజెక్టుకు రూ. నాలుగు కోట్లు మంజూరు, 7. ప్రతి గిరిజనుడికి కనీస ఆటవీ హక్కుల కల్పన, 8. గిరిజనులే ఉపాధ్యాయులుగా 1000 పాఠశాలలు మంజూరు, 9. ఏజెన్సీలో చిన్న ఉద్యోగాలకు గిరిజనులనే అర్హులుగా చేయడం, 10 గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి దళారీలకు ముగింపు పలకడం, 11. ప్రతి గిరిజనుడికి ఒక కిలో జొన్నలు కేవలం రూ.1.25కి ఇవ్వడం, 12. స్థానిక గిరిజనులకు పదివేల ఇళ్లు, 13. ప్రతి గిరిజనుడికి అందుబాటులో వైద్య సౌకర్యం, 14. గిరిజన ప్రాంతాలలో స్వయం రక్షణ గిరిజనులదే వంటి సూత్రాలు అమలుపరిచారు. కానీ వీటిని ఆర్డినెన్స్ చేయకపోవడంతో అవి పూర్తిస్థాయిలో అమలు కాక కేవలం శిలాఫలకానికే పరిమితమైనవి. ఆ జిల్లాలో నిరక్షరాస్యత ఎక్కువ ఉందని, అలాగే గిరివాసులకు మాతృభాషలోనే బోధన చేసేలా వెయ్యి గిరిజన వికాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఆ పాఠశాలలో కేవలం స్థానిక గిరిజనులే ఉండాలని, ఉపాధ్యాయులు సైతం స్థానికంగా ఉండే వారిని నియమించాలని ఉత్తర్వు ఇచ్చి గిరిజనులకు తొలిసారి స్పెషల్ డీఎస్సీ నిర్వహించిన ఘనత ఎన్‌టీఆర్‌కే చెల్లుతుంది. క్రమక్రమంగా ఏజెన్సీలో వేరే ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు అప్పటి ప్రభుత్వం 19 రకాల జీఓలను విడుదల చేసింది. ఆ జీఓలు చరిత్రలో నిలిచిపోయాయి.

అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వ ఉత్తర్వు (03/2000) ను రెండేళ్ల కిందట సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఇరు రాష్ట్రాల ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయం ఏజెన్సీ ప్రాంతాలకే పరిమితమైన ఇతర ఉత్తర్వులతో పాటు, రాజ్యాంగంలోని గిరిజనులకు రక్షణ కవచమైన ఐదో షెడ్యూలుకు విఘాతం ఏర్పడనుంది. ప్రస్తుతం ఆదివాసీల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే ఐటిడిఏలు నామమాత్రంగా మారిపోతున్నాయి. అనేక మంది గిరిజనులు అప్పుడు ఉద్యోగాలను అందిపుచ్చుకున్నారు తప్ప, గత పదేళ్ల నుంచి ఆ జీవోల ఊసెత్తడంలేదు. గతంలో వెలువడిన ఏజెన్సీ ఉత్తర్వులను నేటి ప్రభుత్వం అమలు చేయటం లేదు సరికదా, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పెంచిన 10 శాతం రిజర్వేషన్‌కు ఎలాంటి శాస్త్రీయతా లేదు. వీటిపై పునరాలోచన చేసి చిత్తశుద్ధితో ఏజెన్సీ జీవోలను అమలు చేస్తేనే ఆదివాసీ గిరిజనులు ఆశించిన ఆర్థిక ప్రగతికి చేరుకుంటారు. గిరిజనుల ఉద్యోగ, ఉపాధి మార్గాలకు బాట వేసిన ఎన్‌టీఆర్ అనారోగ్యంతో 1996 జనవరి 18న కన్నుమూశారు. మీ సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటున్న గిరిపుత్రులు మిమ్మల్ని సదా తలుచుకుంటూనే ఉంటారు.

గుమ్మడి లక్ష్మీనారాయణ

సామాజిక రచయిత,

7842631972

Also Read....

దేశం చూపు కేసీఆర్ వైపు..


Next Story