- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్యాగుల మోత కాదు.. ఆర్థిక భారం తగ్గించాలి!
విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన విద్యారంగం, నేడు అనేక సవాళ్లతో సతమతమవుతోంది. వ్యాపార కేంద్రాలుగా

విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన విద్యారంగం, నేడు అనేక సవాళ్లతో సతమతమవుతోంది. వ్యాపార కేంద్రాలుగా మారిన విద్యా సంస్థలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత, కేవలం మార్కులు, ర్యాంకులకు ప్రాధాన్యతనిస్తూ జ్ఞాన వికాసాన్ని నిర్లక్ష్యం చేయడం వంటివి ప్రస్తుత విద్యా విధానంలోని లోపాలు.. ఈ నేపథ్యంలో, సమూలమైన మార్పులు ఆవశ్యకం. నూతన విద్యా విధానం అనేది కేవలం పుస్తకాల బరువును తగ్గించడం కాదు.
వ్యాపారీకరణకు అడ్డుకట్ట షురూ..
ప్రస్తుతం, విద్య అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది. ప్రైవేటు విద్యా సంస్థలు భారీగా ఫీజులు వసూ లు చేస్తూ, తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయి. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయాలి. విద్యను మళ్లీ ఒక సేవా దృక్పథంతో చూడాలి. నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఆధునిక బోధనా పద్ధతులను ప్రవేశపెట్టడం ద్వారా వాటిని బలోపేతం చేయాలి. తద్వారా, ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించి, ఒకే విధానంలో విద్యా బోధన జరిగేలా చూడాలి.
జ్ఞాన వికాసానికి ప్రాధాన్యత
నేటి విద్యా విధానం కేవలం మార్కులు, ర్యాంకుల చుట్టూ తిరుగుతోంది. ఇది విద్యార్థులపై అనవసరమైన ఒత్తిడిని పెంచుతోంది తప్ప, వారికి నిజమైన జ్ఞానాన్ని, నైపుణ్యాలను అందించడం లేదు. నూతన విద్యా విధానం లో జ్ఞాన వికాసానికి, సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ప్రాధా న్యత ఇవ్వాలి. సిద్ధాంత పరిజ్ఞానంతో పాటు, ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించే వృత్తి విద్యా వర్క్‌షా ప్‌లు కలిగిన విద్యాలయాలను ఏర్పాటు చేయాలి. ఇది విద్యార్థులను భవిష్యత్తులో ఉద్యోగాలకు సిద్ధం చేయడమే కాకుండా, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.
బోధనా పద్ధతులు మారాలి!
బోధనా పద్ధతులలో గణనీయమైన మార్పులు అవసరం. కేవలం బట్టీపట్టే విధానానికి స్వస్తి పలికి, ఆవిష్కరణాత్మక, సృజనాత్మక పద్ధతులను ప్రోత్సహించాలి. విద్యార్థులకు ఆసక్తి పెంపొందించే విధంగా, ఆడుతూ పాడుతూ విజ్ఞాన వికాసానికి దోహదం చేసేలా విద్యా సంస్థలు ఉండాలి. దీనికి అనుగుణంగా, ప్రతి ఉపాధ్యాయునికి అవసరమైన ఆధునిక శిక్షణను అందించాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని బోధనలో సమర్థవంతంగా వినియోగించుకునేలా ఉపాధ్యాయులను తీర్చిదిద్దాలి. బోధన అనేది కేవలం సమాచారాన్ని అందించడం కాకుండా, విద్యార్థులలో ఆలోచనా శక్తిని, విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంపొందించేదిగా ఉండాలి.
తల్లిదండ్రుల భాగస్వామ్యం
నూతన విద్యా విధానం విజయవంతం కావాలంటే, తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకం. కేవలం పాఠశాల పైనే భారం వేయకుండా, తల్లిదండ్రులు తమ వంతు బాధ్యతగా తమ పిల్లలకు సరైన విద్యావకాశాలు కల్పించాలి. పిల్లల అభిరుచులను గుర్తించి, వారిని ప్రోత్సహించాలి. విద్యార్థులు పాఠశాలలోని అన్ని కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేలా చూడాలి. ఇంటి వద్ద కూడా నేర్చుకునే వాతావరణాన్ని కల్పించడం ద్వారా వారి బంగారు భవిష్యత్తు కోసం కృషి చేయాలి.నూతన విద్యా విధానం అనేది కేవలం పుస్తకాల బరువును తగ్గించడం కాదు, విద్యార్థులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం మాత్రమే కాదు. అది వారిని జ్ఞానవంతులుగా, నైపుణ్య వంతులుగా, బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే సమగ్ర ప్రణాళిక. ఈ మార్పులు సాకారమైతే, భవిష్యత్ తరాలకు నిజమైన ప్రగతిని అందించినట్లవుతుంది.
-దండంరాజు రాంచందర్ రావు
98495 92958






