- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Books vs Screens: చూడటమే కాదు.. చదవడం అవసరమే!
ఇవ్వాళ మొత్తంగా భాష రూపమే మారిపోయి దృశ్య మాధ్యమంగా మారిపోతున్నది. దాదాపు మారిపోయింది కూడా. మరోవైపు

ఇవ్వాళ మొత్తంగా భాష రూపమే మారిపోయి దృశ్య మాధ్యమంగా మారిపోతున్నది. దాదాపు మారిపోయింది కూడా. మరోవైపు మాతృభాషను సంరక్షించుకోవాలన్న ఉద్యమం మొదలైంది. నిజానికి తెలుగు భాష విషయానికి వస్తే “ఇంట్లో మార్కుల గోల కాలేజీల్లో రాంకుల హేల” మొదలైన 90వ దశకం ఆరంభంలోనే మాతృ భాష ప్రశ్నార్థకంలో పడింది.
భాష/ మాటల సందడి కాదు, / శబ్ద సమూహమూ కాదు / అది ఆలోచనల ప్రవాహం, భావాల ప్రయాణం/ భాష/ స్తబ్దత నిండిన శిల కాదు / నిరంతర చలనశీలి / అది ఏకరూపి కాదు / బహురూపి.. స్థలానికీ/ స్థలానికీ భాష మారుతుంది / స్వరానికీ స్వరానికీ / యాస మారుతుంది. నాలుగడుగులు వేస్తే / దాని నడకా మారుతుంది.
అన్నీ చూడటమే..
మార్కుల కోసం సంస్కృతాన్ని ప్రవేశపెట్టినప్పుడే మన భాష ఉనికి తప్పింది. అప్పటి నుంచి మౌనంగా ఉండి ఇప్పుడు ఉద్యమం అంటే ఎలా? ఇక మరోవైపు సంస్కృతం, తమిళం, హిందీ గొడవ జరుగుతూనే ఉంది. ఇదంతా ఇట్లా వుంటే 21వ శతాబ్దంలో ఆధునిక తరం ‘చదివే సంస్కృతి’ నుంచి వేరై పోతూ చూసే సంస్కృతికి దగ్గరవుతున్నారు. ముఖ్యంగా గత దశాబ్ద కాలం నుంచి ఒక్క చదివే అలవాటు మినహా అన్ని మాధ్యమాలూ పెరిగాయి. అంతా చూడడమే టీవీ చూస్తారు, సినిమా చూస్తారు, కంప్యూటర్ చూస్తారు, స్మార్ట్ ఫోన్ మాట్లాడానికంటే బొమ్మలు, వీడియోలు చూడటానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలా ఒకటేమిటి అన్నీ చూడ్డమే.
చెత్తనంతా చూసే సంస్కృతి..
చిన్న పిల్లల నుంచి మొదలు అందరూ ఇలా చూసేందుకు అలవాటు పడిపోతున్నారు. అక్షరాలు రాయడానికీ, చదవడానికీ కూడా ఇమేజ్‌లనే వాడే సంస్కృతిని మనం చూస్తున్నాం. అయితే ఈ చూడడం అనే ప్రక్రియలో అంతా సరిగ్గానే ఉందా? చూస్తూ ఉన్న వాళ్ళపైన ఈ ఇమేజెస్, మూవింగ్ ఇమేజెస్‌కు సంబంధించిన ప్రభావాలు ఎలా వుంటున్నాయి? వాటి ప్రతి ఫలనాలు సమాజం పైన ఎట్లా ఉంటున్నాయనే అవగాహన కొరవడడం విచారకరం. దృశ్య సంస్కృతికి, దృశ్య సాక్షారతకు (విజువల్ లిటరసి) సంబంధించిన కనీస పరిజ్ఞానం లేకపోవడం వల్ల టీవీలూ, ఇంటెర్నెట్‌లు నట్టింట్లో కుమ్మరిస్తున్న చెత్తనంతా చూస్తూ పిల్లలూ పెద్దలనే కాదు మొత్తం సమాజమే గాడి తప్పి కనీస విలువలు లేని ఒక విష సంస్కృతికి అలవాటు పడిపోతున్నారు. వాళ్లు చూపిస్తున్న దాన్ని గుడ్డిగా చూస్తూ మంచేదో చెడేదో భేదం గుర్తించగలిగే పరిస్థితి లేకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారవుతున్నది.
విద్యను వ్యాపారం చేసి..
ముఖ్యంగా భావి సమాజానికి ప్రతినిధులుగా ఉండవలసిన విద్యార్థులకు మాతృభాష, విజువల్ లిటరసీలకు సంబంధించిన మౌలిక విషయాలేమైనా అందుతున్నాయా? లేదా అన్న విషయాన్ని ఇవాళ ప్రభుత్వాలూ, మేధావులూ, విద్యావేత్తలూ ఆలోచించాల్సిన అవసరం వుంది. ఒక వైపు ప్రభుత్వాలు డిజిటల్ తరగతి గదులూ, స్కిల్ డెవలప్‌మెంట్ అంటూ ఉంటే మరో పక్క ప్రైవేటు విద్యాసంస్థలు ఈ స్కూల్స్, డిజి స్కూల్స్ అంటూ విద్యను మొత్తంగా వ్యాపారం చేసి తరగతి గదుల్లో ప్రొజెక్టర్లు, కంప్యూటర్లు అంటూ ఊదరగొడుతున్నాయి.
విచక్షణ లేని విజువల్ మాధ్యమం
నిజానికి ఒక బొమ్మ వేయి పదాలకు సమానం. ఇక వీడియో లేదా సినిమానయితే ఎన్నో భావాల్ని నేరుగా ప్రేక్షకుని మనసులోకి తీసుకెళ్తుంది. అంతగా ప్రభావం చూపించగల విజువల్ మాధ్యమాన్ని గురించి సమాజం కనీసం ఆలోచన చేస్తున్నదా? అంటే జవాబు నిరాశాజనకంగానే ఉంది. అసలు మంచి విజువల్ ఏదో, చెడు విజువల్ ఏదో, మంచి సినిమాను లేదా మంచి వీడియోను ఎట్లా అర్థం చేసుకోవాలో నేర్పించే వ్యవస్థ నిర్మించుకోలేక పోవడం ఇవాల్టి విషాదం. ఆ స్థితిలో అర్థం లేని చెత్త దృశ్యాల్ని చూస్తూ పిల్లలు పాడై పోతున్నారని బాధ పడడంలో అర్థం లేదు. చూసే దృశ్యాలకు సంబందించి దృశ్య సాక్షారతను అందించలేనపుడు పిల్లలే కాదు పెద్దలు కూడా విలువలు లేని బొమ్మలకూ, సీనిమాలకూ వీడియోలకూ అలవాటు పడిపోతారు. అందుకు వాళ్లని కాకుండా పాలకుల్నీ, ప్రణాళికా నిర్మాతల్ని మేధావుల్నీ నిందించాల్సి ఉంటుంది. నిజానికి వర్తమాన సమాజం ప్రసార మాధ్యమాల ప్రభావంలో పడి కొట్టుకు పోతున్నది. అంతే కాదు పూర్తిగా ఇమేజ్ చట్రంలో కూరుకుపోతున్నది.
చదివే అలవాటు ఎక్కడికెళ్ళింది?
ఇదంతా ఇట్లా ఉంటే భాష గురించి చదివే అలవాటు పెంపొందించడం గురించి కవులూ రచయితలూ మేధావులూ ఏమయినా ప్రయత్నాలు చేస్తున్నారా? అన్నది మరో మౌలిక ప్రశ్న. ఇంట్లో గాని స్కూళ్ళు, కాలేజీల్లో కానీ నాన్ అకడెమిక్ పుస్తకాలు చదివే అలవాటుని ఏమయినా ప్రోత్సహిస్తున్నామా? ఎంతసేపూ కెరీర్, కాంపిటీషన్‌లకు మాత్రమే ప్రాదాన్యతనిస్తున్నామా? అనేది ఆలోచించాల్సి ఉంది. నూతన తరం తమ తమ భావాల్ని వ్యక్తం చేసేందుకు ఒకవైపు లిఖిత భాష, మరోవైపు అర్థవంతమైన దృశ్యాలని ఆవిష్కరించడంలో ఆసక్తిని పెంచాలి. చూసే అలవాటుతో పాటు చదివే అల వాటుని పెంపొందించాలి. దాని రీడర్స్ క్లబ్స్, గ్రంథాలయాలు, విజువల్ లిటరసీ సెంటర్స్‌ని ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తే భాష మిగులుతుంది. మాతృభాష పరిఢవిల్లుతుంది.
‘చీకటికి ఉనికి లేదు / వెల్తురు క్షీణించడమే చీకటి’ / అందుకే చిన్న వయసులోనే / మనస్సుల్లో వెలుగులు / నింపే ప్రయత్నం జరగాలి.
- వారాల ఆనంద్
94405 01281






